SOURCE :- BBC NEWS

భూకంపం

ఫొటో సోర్స్, Getty Images

మరోసారి భూకంపం వస్తుందని వైరల్ టిక్‌టాక్ వీడియోతో ప్రజల్లో భయాందోళన రేకెత్తించారంటూ ఒక జ్యోతిష్కుడిని మియన్మార్ అధికారులు అరెస్ట్ చేశారు.

మియన్మార్‌లో ఇటీవల 7.7 తీవ్రతతో భూకంపం వచ్చి 3,500 మంది చనిపోయారు. శతాబ్దాల నాటి ఆలయాలను ఈ భూకంపం ధ్వంసం చేసిన వారాల తర్వాత జాన్ మో తన భవిష్యవాణిని ఏప్రిల్ 9న టిక్‌టాక్‌లో పోస్టు చేశారు.

ప్రజల్లో భయాందోళన కలిగించేలా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేసినట్లు మియన్మార్ సమాచార మంత్రిత్వ శాఖ చెప్పింది.

ఏప్రిల్ 21న మియన్మార్‌లో ప్రతి నగరంలో భూకంపం రాబోతోందని జాన్ మో హెచ్చరించారు. అయితే, భూకంపాలను అంచనా వేయడం అసాధ్యమని నిపుణులు స్పష్టం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జాన్ మో పోస్టు చేసిన వీడియోకు 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రకంపనాల సమయంలో ముఖ్యమైన వస్తువులను తీసుకుని, భవనాల నుంచి బయటికి పారిపోవాలని, ఆ రోజంతా ఎత్తయిన బిల్డింగులలో ఉండవద్దని ఆ వీడియో క్యాప్షన్‌లో ప్రజలను హెచ్చరించారు మో.

ఈ జ్యోతిష్కుడు చెప్పిన భవిష్యవాణిని తన పక్కింటివారు చాలామంది నమ్మారని యాంగాన్ నివాసి అయిన ఒక మహిళ చెప్పారు.

జాన్ మో చెప్పినట్లు భూకంపం వస్తుందేమోననే భయంతో వారు ఇంట్లో ఉండకుండా, రోజంతా బయటే గడిపారని ఆమె తెలిపారు.

భూకంపం తీవ్రత

ఫొటో సోర్స్, Reuters

జాన్ మో టిక్‌టాక్ అకౌంట్‌ ప్రస్తుతం పనిచేయకుండా పోయింది. ఈ అకౌంట్‌కు 3 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు.

జ్యోతిష్యశాస్త్రం, హస్తసాముద్రిక జాతకం (పామిస్ట్రీ) ప్రకారం ఈ అంచనావేసినట్లు ఆయన తన వీడియోలో తెలిపారు.

సెంట్రల్ మియన్మార్‌లోని సగైంగ్‌లో ఉన్న ఆయన ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు అధికారులు.

మార్చి 28న వచ్చిన భూకంపం మాండలే, సగైంగ్‌ ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది.

ఈ భూకంపం తర్వాత తమను ఆదుకోవాలంటూ మియన్మార్‌‌లోని జుంటా ప్రభుత్వం విదేశీ సాయాన్ని కోరింది. అరుదైన సందర్భాల్లోనే జుంటా పాలకులు ఇలా సాయాన్ని కోరతారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)