SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
8 మే 2025, 10:16 IST
పాకిస్తాన్‌పై భారత్ జరిపిన దాడిలో తమ నాయకుడు మసూద్ అజర్ కుటుంబంలో 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహితులు చనిపోయారని జైషే మొహమ్మద్ సంస్థ తెలిపింది.
దీనిపై ఆ సంస్థ బుధవారం (మే 7) ఒక ప్రకటన చేసింది. మసూద్ అజర్ అక్క, బావ, మేనల్లుడి భార్య, మేనకోడలు, ఐదుగురు పిల్లలతో సహా మొత్తం 10మంది చనిపోయారని ఆ ప్రకటనలో తెలిపింది.
పాకిస్తాన్ బహావల్‌పుర్‌లోని సుబ్హాన్ మసీదుపై జరిగిన దాడిలో మసూద్ అజర్ బంధువులు చనిపోయారని ఆ ప్రకటనలో ఉంది.
మసూద్ నేపథ్యం
1968 జూలై 10న బహావల్‌పుర్‌లోని అల్లాబక్ష్ సబీర్ కుటుంబంలో మసూద్ అజర్ పుట్టారు. మసూద్ తండ్రి బహావల్‌పుర్‌లోని ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్.
భారత హోం మంత్రిత్వ శాఖ 2024 మార్చి 7న విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో మొదటి పేరు 57ఏళ్ల మసూద్ అజర్‌దే.
భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన చాలా నేరాలకు సంబంధించిన కేసుల్లో ఆయన నిందితుడు.
శ్రీనగర్‌లోని జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సముదాయంపై 2001 అక్టోబరు 1న జరిగిన దాడిలో 38 మంది చనిపోయారు. మసూద్ అజర్‌పై ఉన్న కేసుల్లో ఇది కూడా ఒకటి.
ఆ తర్వాత 2001 డిసెంబరు 12న భారత పార్లమెంట్‌పై జరిగిన దాడి కేసులోనూ మసూద్ నిందితుడు. ఈ దాడిలో ఆరుగురు భద్రతాసిబ్బంది, ఇతరులు ముగ్గురు చనిపోయారు.


ఫొటో సోర్స్, EPA
పుల్వామా దాడి కుట్ర ఆరోపణలు
40 మంది భద్రతాసిబ్బంది మరణించిన పుల్వామా దాడిలో కూడా మసూద్ అజర్ నిందితుడు.
మౌలానా మసూద్ అజర్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్న సందర్భం కాందహార్ హైజాక్ ఒకటి.
1999లో కాందహార్ హైజాక్ సమయంలో భారత్ విడుదల చేసిన ముగ్గురు ఉగ్రవాదుల్లో మసూద్ అజర్ ఒకరు.
అప్పటి భారత విదేశాంగమంత్రి జస్వంత్ సింగ్ ప్రత్యేక విమానంలో మసూద్ అజర్‌ను కాందహార్ తీసుకెళ్లారు. అప్పటినుంచి భారత భద్రతాబలగాలు మసూద్ కోసం వెతుకుతున్నాయి.
భారత్‌లో నిషేధం విధించిన జైషే మొహమ్మద్‌కు హెడ్ మసూద్ అజర్. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం పాకిస్తానీ పంజాబ్‌లోని బహావల్‌పుర్‌లో ఉందని భారత ప్రభుత్వం ఎప్పటినుంచో ఆరోపిస్తోంది.
పాకిస్తాన్ లోపల 100 కిలోమీటర్ల పరిధిలోకి చొచ్చుకెళ్లి మొదటిసారి భారత్ దాడులు చేయడానికి ఇది కూడా ఓ కారణమని భావిస్తున్నారు.
మసూద్ అజర్‌ను తమకు అప్పగించాలని పాకిస్తాన్‌ను భారత్ ఎన్నోసార్లు కోరింది. కానీ ఆయన తమ దేశంలో లేరని పాకిస్తాన్ చెబుతూ వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
జిహాదీ కార్యకలాపాల ప్రారంభం
ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థల జాబితాలో మౌలానా మసూద్ అజర్‌కు చెందిన జైషే మొహమ్మద్‌ను చేర్చాలని 2009 నుంచి భారత్ డిమాండ్ చేస్తోంది. కానీ చైనా వీటో ఉపయోగించి ఎప్పుడూ అడ్డుకుంటూ వచ్చింది.
జైషే మొహమ్మద్‌ను ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్యసమితి గుర్తించాలని పదేళ్లపాటు భారత్ ప్రయత్నాలు చేసింది.
పుల్వామా దాడి తర్వాత 2019 మే 1న జైషే మొహమ్మద్‌ను ఉగ్రవాదసంస్థగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీనిపై భద్రతామండలి ఆంక్షల కమిటీ దగ్గర పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తంచేసింది.
మసూద్ అజర్ నాయకత్వంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం జైషే మొహమ్మద్ భారీగా రిక్రూట్‌మెంట్ చేసుకుంటోందని, భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా యువతను రెచ్చగొడుతోందని భారత హోంశాఖ మోస్ట్ వాంటెడ్ జాబితాలో తెలిపింది.
మౌలానా మసూద్ అజర్ గురించి 2022 జనవరిలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సమగ్రంగా ఓ కథనం ప్రచురించింది. కరాచీలో చదువుకునే రోజుల నుంచి జిహాదీ కార్యకలాపాల్లో మసూద్ అజర్ పాల్గొంటున్నట్లు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
మసూద్ అజర్ అరెస్టు
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వివరాల ప్రకారం మసూద్ సరిహద్దు గుండా భారత్ రాలేదు. 1994 జనవరిలో ఢాకా నుంచి దిల్లీకి విమానంలో చేరుకున్నారు.
కొన్నిరోజుల పాటు దిల్లీలోని ప్రముఖ హోటళ్లలో బస చేసిన తర్వాత మొదటగా దేవ్‌బంద్ వెళ్లారు. తర్వాత కశ్మీర్ చేరుకున్నారు. అక్కడే 1994 ఫిబ్రవరి 10న భారత భద్రతా బలగాలు మసూద్‌ను కస్టడీలోకి తీసుకున్నాయి.
మసూద్‌ను అరెస్టు చేసిన పదినెలల్లోనే తీవ్రవాదులు కొందరు విదేశీయులను కిడ్నాప్ చేశారు. వారిని విడుదల చేయాలంటే మసూద్‌ను అప్పగించాలని డిమాండ్ చేశారు.
కానీ, ఉత్తరప్రదేశ్, దిల్లీ పోలీసులు సహరాన్‌పూర్ నుంచి బందీలను రక్షించగలగడంతో తీవ్రవాదుల ప్రయత్నం విఫలమయింది.
ఏడాది తర్వాత కొందరు విదేశీయులను కిడ్నాప్ చేయడానికి హర్కత్-ఉల్-అన్సార్ మళ్లీ ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమయింది.
ఆ తర్వాత 1999లో విడుదలయ్యేవరకు మసూద్‌ను జమ్ములోని కోట్ భల్వాల్ జైలులో ఉంచారు. ఆ సమయంలో కశ్మీర్‌లో అరెస్టు చేసిన కశ్మీరీ, అఫ్గానీ, పాకిస్తానీ తీవ్రవాదులందరినీ ఆ జైలులోనే ఉంచారు.
వారిలో తీవ్రవాద సంస్థ హర్కత్-ఉల్-ముజాహిదీన్ శ్రీనగర్ కమాండర్ సయీఫుల్లా ఖాన్, ఆయన సోదరులైన ఇద్దరు తీవ్రవాదులు కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, AFP
తీవ్రవాదులపై మసూద్ ప్రభావం ఎలా ఉండేది?
తాము జైల్లో ఉన్నప్పుడు మసూద్ కొన్ని విషయాలు చెప్పారని సయీఫుల్లా బీబీసీ ప్రతినిధి జుబైర్ అహ్మద్‌కు చెప్పారు.
”మసూద్‌కు ఒకే ఒక పని ఉండేది. ప్రసంగాలివ్వడం. ఆయన తుపాకీ పట్టుకోలేదు. ఎవరినీ చంపలేదు. జిహాద్ సిద్ధాంతాల మీద ప్రసంగించేవారు” అని సయీఫుల్లా చెప్పారు.
అక్కడున్న తీవ్రవాదులందరిమీద మసూద్ ప్రసంగాలు తీవ్ర ప్రభావం చూపేవని సయీఫుల్లా తెలిపారు. మసూద్ యూట్యూబ్ వీడియోలు భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా ఉండేవని జుబైర్ అహ్మద్ తన రిపోర్టులో తెలిపారు.
”పాకిస్తాన్‌లో నిషేధం ఉన్నప్పటికీ పాకిస్తాన్ నిఘా వ్యవస్థ నుంచి జైషే మొహమ్మద్‌కు సాయం అందుతున్నట్టు కొన్ని కార్యకలాపాలు కనిపించేవి. కానీ దీనికి ఆధారాలు లేవు” అని బీబీసీ న్యూస్ ఉర్దూ ప్రస్తుత ఎడిటర్ ఆసిఫ్ ఫారూకీ బీబీసీ హిందీకి చెప్పారు.
”1999లో కాందహార్ ఘటన తర్వాత అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ల సాయంతో జైషే మొహమ్మద్‌ను మసూద్ స్థాపించారు. మూడేళ్ల తర్వాత ఆయన్ను పాకిస్తాన్‌లో అరెస్టు చేశారు. ఆయన సంస్థను నిషేధించారు. మసూద్ అజర్‌కు అనుకూలంగా రహస్యంగానో లేదా బహిరంగంగానో మాట్లాడిన ఒక్క నేతను కూడా ఇప్పటివరకూ నేను చూళ్లేదు” అని ఆసిఫ్ ఫారూకీ తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
మసూద్ గురించి పాకిస్తాన్‌లో ఏమనుకుంటారు?
”మసూద్ అజర్ గురించి పాకిస్తాన్‌లో మంచి అభిప్రాయం లేదు. ఆయన తీవ్రవాద సంస్థ అధ్యక్షుడని, తీవ్రవాదాన్ని రెచ్చగొడతారని ప్రతి ఒక్కరికీ తెలుసు. అనేక తీవ్రవాద ఘటనల్లో మసూద్ పాత్ర ఉంది. యువతకు ఆ సంస్థపై సదభిప్రాయం లేదు. అయితే వారికి మద్దతుగా నిలిచే ఓ వర్గం కూడా సమాజంలో ఉంది. భారత్‌ను వారంతా శత్రువుగా భావిస్తారు” అని ఆసిఫ్ ఫారూకీ వివరించారు.
మసూద్ అజర్ చాలా అరుదుగా బయట కనిపిస్తారు. హఫీజ్ సయీద్‌లాగా మసూద్ గురించి పాకిస్తాన్ మీడియాలో వార్తలుండవు.
గడిచిన రెండు దశాబ్దాల్లో మసూద్ బయట కనిపించారన్న చర్చ జరిగింది కేవలం రెండుసార్లు.
”కరాచీలో జరిగిన ఓ సమావేశంలో మసూద్ కనిపించారు. ఆ తర్వాత ముజఫరాబాద్‌లో జిహాదీ సంస్థల కాన్ఫరెన్స్‌లో కనిపించారు” అని ఆసిఫ్ ఫారూకీ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS