SOURCE :- BBC NEWS
రథాలు, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఎస్‌యూవీలు, కత్తులు, త్రిశూలాలు, కొన్నిసార్లు చేతుల్లో గన్లు, శారీరక వ్యాయామ ప్రదర్శనలు.. ఇవ్వన్నీ మహాకుంభమేళాలో కనిపిస్తున్న దృశ్యాలు.
సాధారణంగా మనం ‘అఖాడా’ అనే పదం వినగానే రెజ్లింగ్‌కు సంబంధించినదిగా భావిస్తుంటాం. కానీ, కుంభమేళాలో అఖాడా అనే పదం సాధువులు, సన్యాసుల సంప్రదాయంతో ముడిపడి ఉంది.
కుంభమేళాను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న త్రివేణి సంగమం వద్ద, ఉత్తరఖాండ్‌లోని హరిద్వార్‌లో, మహారాష్ట్రలో ఉన్న నాసిక్‌లోని గోదావరి నది ఒడ్డున, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న క్షిప్రా నది ఒడ్డున నిర్వహిస్తుంటారు.
కుంభమేళా సమయంలోనే అఖాడాల్లోకి కొత్త సన్యాసులను కూడా చేర్చుకుంటూ ఉంటారు. 15 రకాల అఖాడాల్లో ఒకదానిలో చేరడం ద్వారా ఆ సన్యాసులు తాము ప్రపంచాన్ని త్యజించినట్లు భావిస్తుంటారు.
అయితే, దీనికి ముందు వారెన్నో కఠిన పరీక్షలను ఎదుర్కోవాలి. కొన్ని ముఖ్యమైన క్రతువులు నిర్వహించాలి. ఆ తర్వాతనే, వారు లౌకిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశిస్తారు.
అఖాడాలు హిందూ మతానికి చెందిన మఠాల వంటివి. బౌద్ధ మతం వ్యాప్తి చెందకుండా ఆది శంకరాచార్యులు అఖాడాలను స్థాపించినట్లు చెబుతారు.
ప్రస్తుతం అఖాడాలెన్ని ఉన్నాయి?
” గ్రంథాలు నమ్మని వారిని ఆయుధాలతో ఒప్పించి, అఖాడాలు హిందూ మతాన్ని పునరుజ్జీవింపజేశాయి” అని మహానిర్వాణి అఖాడా కార్యదర్శి మహంత్ రవీంద్ర పురి చెప్పారు.
అంతకుముందు కేవలం నాలుగు అఖాడాలు మాత్రమే ఉండేవి. కానీ, సిద్ధాంతాలు భిన్నంగా ఉండటంతో, వారు విడిపోతూ వచ్చారు. ప్రస్తుతం 15 ప్రధాన అఖాడాలు ఉన్నాయి. వాటిలో మహిళల కోసం పరి అఖాడా, కిన్నార్ అఖాడాను తాజాగా చేర్చారు.
మహాకుంభ మేళాలో ప్రధాన ఆకర్షణ సన్యాసులు, నాగ సాధువులే. ఈ సమయంలో, ఆధ్యాత్మిక, మతపరమైన అంశాలను వారు ఒకరికొకరు పంచుకుంటూ, గ్రంథాలపై అధ్యయనం చేస్తారు.
ప్రతి అఖాడాకు సొంతంగా దానికంటూ సంప్రదాయం ఉంటుంది. అంతకుముందు అఖాడాల్లో ఎక్కువగా శివుణ్ణి, విష్ణువును నమ్మేవారు. ప్రస్తుతం ఉదాసి, సిక్కు అఖాడాలు ఉన్నాయి. ఈ అఖాడాల్లో సుమారు ఐదు లక్షల మంది సాధువులు ఉంటారు.
సన్యాసి ఏ వర్గానికి చెందిన వారో, ఆ వర్గం పేరుతో పాటు కొత్తపేరును జత చేస్తారు. సన్యాసిగా మారిన తర్వాత, కుటుంబంతో సంబంధ బాంధవ్యాలను వదిలేయాలి. చివరన తండ్రి పేరు పెట్టినట్లుగానే, గురువు పేరును జత చేస్తారు.
నాగ సాధువుగా ఎలా మారొచ్చు?
హిస్టరీ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ త్రిపాఠి ”నాగా సన్యాసియోం కా ఇతిహాస్” పేరుతో పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో మూడో చాప్టర్లో వివిధ వర్గాలకు చెందిన సన్యాసుల నిబంధనలను వివరించారు. ఆ పుస్తకంలో వివరించిన నిబంధనలు కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి..
- ఏ వ్యక్తి అయినా అఖాడాల్లో చేరాలన్నా లేదా నాగ సాధువులుగా మారాలన్నా నాగ సాధువు దగ్గర శిష్యరికం తీసుకోవాలి. శారీరకంగా ఎలాంటి లోపం ఉండకూడదు. సాధారణంగా 16 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్నయువకులు నాగ సాధువుగా మారే దీక్షను ప్రారంభించవచ్చు.
- దీక్ష ప్రారంభించే సమయంలో, వారి జుట్టును కత్తిరిస్తారు. ‘మహా పురుష్’ లేదా ‘వస్త్రధారి’ అనే పేరు పెడతారు. సీనియర్ నాగ సాధువు పర్యవేక్షణలో వారు శిక్షణ తీసుకోవాలి.
- ఈ సమయంలో, వారికి వ్యక్తిగతంగా గురువు ఉండరు. కానీ, అఖాడాలకు చెందిన ప్రధాన దైవమే వారికి అసలైన గురువు.
- శుభ్రపరచడం, వంట చేయడం, నాగఫణి వాయించడం, అస్త్రాల వాడుకలో శిక్షణ పొందడం వంటి ఆయనకు అప్పగించిన పనులన్నింటిన్నీ నాగ సాధువుగా మారాలనుకునే, అనుభవం లేని సన్యాసి చేయాలి.
- ఆ తర్వాత, సీనియర్ నాగ సాధువులు తమ శిష్యుల దీక్షను, పట్టుదలను చూసి సంతృప్తి చెందితే, నాగ దిగంబరులుగా దీక్ష చేయిస్తారు.
- ఇక వారు తిరిగి ఇంటికి వెళ్లలేరు. ఈ అఖాడాలకు చెందిన మహంత్ వారితో ప్రమాణం చేయిస్తారు.
అంతేకాక, నాగ సాధువుగా మారేందుకు ఇతర నిబంధనలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా వాటిని తెలుసుకోవాలి.
- కుంభ్ సమయంలో, మూడు రోజులు ఉపవాస దీక్ష చేస్తూ మంత్రాలను జపించాలి. సొంతంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. తన చేతులతో 21 తరాల వారికి పిండదానం చేయాలి. ఆ తర్వాత లౌకిక ప్రపంచంతో సంబంధాలను తెంచేసుకోవాలి.
- ప్రాపంచిక జీవనంలో ఉన్న తన గుర్తింపును తొలగించుకోవాలి. జుట్టు కత్తిరించుకోవాలి. కుంభమేళా జరిగే ప్రాంతంలోని నదిలో తెల్లవారుజామున పవిత్ర స్నానం చేసి, కేవలం లోదుస్తులు మాత్రమే ధరించాలి. దీంతో, వారు సాధువుగా పునర్జన్మ పొందినట్లు అవుతారు. సాగ సాధువులు, శరీరంపై ధూపం, భస్మాన్ని రాసుకుంటారు.
- శిక్షణ సమయంలోనే తాము తిరిగి సాధారణ సమాజంలోకి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు. ఆలోచించుకునేందుకు సరిపడా సమయం ఉంటుంది.
- నాగ సాధువుగా మారేందుకు కనీసం రెండు నుంచి 12 ఏళ్ల సమయం పడుతుంది. దీనికి ఎలాంటి కాల పరిమితి ఉండదు.
- అయితే, మహిళా నాగ సాధువులు పూర్తిగా నగ్నంగా ఉండటానికి అనుమతి లేదు. వారు కుంకుమ పువ్వు రంగులో వస్త్రాలు ధరించాలి. ఈ రంగు వస్త్రాలు హిందూ మతంలోని త్యాగాన్ని ప్రతిబింబిస్తాయి.
- అంతకుముందు ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో మహిళా అఖాడాలకు గుర్తింపు లభించింది. ‘మాయి అఖాడా’ పేరును ‘సన్యాసిని అఖాడా’గా మార్చారు.
అఖాడా సంప్రదాయం ఎప్పుడు మొదలైంది?
ప్రతి అఖాడాను వాటికి మహాధినేతగా భావించే మహామండలేశ్వర్ నిర్వహిస్తారు.
”ఏ హిస్టరీ ఆఫ్ ది దశ్నామి నాగ సన్యా’సిస్” పేరుతో జదునాథ్ సర్కార్ రాసిన పుస్తకంలో, మహామండలేశ్వర్ను అంతకుముందు ‘పరమహంస’గా పిలిచేవారని తెలిసింది.
అఖాడాల్లో 8 గదులు, 52 మఠాలు ఉంటాయి. అఖాడాల సైజును బట్టి, దానిలో ఉండే సంఖ్య తక్కువగా ఉండొచ్చు. మహంత్ నేతృత్వంలో ప్రతి కేంద్రంలో మతపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తారు.
ప్రారంభ శతాబ్దాలలో, ఈ మహంతుల ప్రాంతాలు హిందూ రాజుల నేతృత్వంలో ఉండేవి. ప్రతి రాజు సన్యాసులను గౌరవించేవారు. వారికి అవసరమైన సదుపాయాలు అందించే వారు. దీనికి ప్రతిగా, నాగ సాధువులు రాజులకు సైనిక మద్దతును ఇచ్చేవారు.
”అలెగ్జాండర్ ఆక్రమణ సమయం నుంచే అఖాడాల సంప్రదాయం ప్రారంభమైందని నమ్ముతుంటారు.” అని అలహాబాద్ యూనివర్సిటీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్ హేరాంబ్ చతుర్వేది అన్నారు.
”ఏ హిస్టరీ ఆఫ్ ది దశ్నామి నాగ సన్యా’సిస్” పుస్తకంలో చాలా అంశాలను సర్ జదునాథ్ సర్కార్ ప్రస్తావించినట్లు తెలిపారు.
అక్బర్ కాలంలో, హిందూ సన్యాసులకు కూడా ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత, ఔరంగజేబు కాలంలో, వారి మధ్య సాయుధ పోరాటాలు జరిగిన కేసులు కూడా ఉన్నాయి.
భారత్‌లో బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆయుధాల వాడకంపై ఆంక్షలు విధించారు. ఇండియన్ పీనల్ కోడ్ కింద నగ్నంగా తిరగడంపైనా ఆంక్షలు తెచ్చారు.
ప్రస్తుత కాలంలో, నాగ సాధువులు పెద్ద సంఖ్యలో కుంభమేళా, మహాకుంభమేళా, శివరాత్రి వేడుకల్లో కనిపిస్తున్నారు. వారి కార్యకలాపాలు చాలా వరకు అఖాడాలు, వాటి పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతాయి.
ఒకసారి ఈ అఖాడాల్లోకి అడుగు పెట్టిన తర్వాత, కులాన్ని, మతాన్ని, వర్గాన్ని, వర్గ విభజనలను, వ్యక్తిగత ఆస్తులను, లౌకిక సమాజాన్ని, కోరికలను వదులుకోవాలి.
సన్యాసులను అఖాడాల్లోకి చేర్చుకోవడానికి వివిధ రకాల ఏర్పాట్లు ఉంటాయి.
దశనామిల్లో నాలుగు ప్రధాన కేంద్రాలుంటాయి. అవి గోవర్ధన్ పీఠం, శారదా పీఠం, శృంగేరి మఠం, జ్యోతిర్ మఠం, పూరి (తూర్పులో ఒడిశా), ద్వారకా (పశ్చిమంలో గుజరాత్), శృంగేరి (దక్షిణాన కర్ణాటక), జ్యోతిర్ మఠం (ఉత్తరంలో ఉత్తరఖాండ్) దగ్గర ఉన్నాయి.
గోవర్ధన్ పీఠం, శారదా పీఠం, శృంగేరి మఠం, జ్యోతిర్ మఠ్లు ప్రకాశ్, స్వరూప్, చేతన్, ఆనంద్ అనే దీక్షలను సూచిస్తాయి. వారు కొలిచే దేవుళ్లు జగన్నాథుడు, సిద్ధేశ్వరుడు, ఆది వారాహుడు, నారాయణుడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)