SOURCE :- BBC NEWS
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో, ముఖ్యమైన రోజుల్లో ఒకటైన మంగళవారం తెల్లవారుజామున గంగానదిలో పవిత్ర స్నానమాచరించేందుకు సాధువులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తూ, మంత్రోచ్ఛాటనతో భగవంతునికి పూజలు చేశారు.
స్నానమాచరించి బయటికి వస్తూ, తెల్లని బూడిద లాంటి ఇసుకను చేత్తో తీసుకుని ఒంటికి పులుముకున్నారు. చాలా మంది సాధువుల చేతుల్లో కరవాలాలు, త్రిశూలాలు ఉన్నాయి. ఒకరు నాగేంద్రుడి వెండి ప్రతిమ పొదిగిన కర్రను పైకెత్తి చూపిస్తున్నారు.
అంతరిక్షం నుంచి కూడా చూడగలిగిన ఈ కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించేందుకు నాగ సాధువులుగా పిలిచే ఈ సన్యాసులతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు ప్రయాగ్‌రాజ్‌కి వస్తారు. కోట్లాది మంది ఒకచోటకు చేరే అతిపెద్ద వేడుక ఇది.
ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహాకుంభమేళాలో రెండోరోజైన మంగళవారం నాడు మధ్యాహ్నం 12 గంటల సమయానికి దాదాపు కోటి 60 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారని, రెండోరోజు పూర్తయ్యేనాటికి 2 కోట్ల మందికి చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. తొలిరోజు సోమవారం కోటి 65 లక్షల మంది పవిత్ర స్నానమాచరించినట్లు పేర్కొన్నారు. కుంభమేళా జరిగే 45 రోజుల వ్యవధిలో దాదాపు 40 కోట్ల మందికి పైగా భక్తులు, యాత్రికులు కుంభమేళాకు తరలివచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
కుంభమేళాలో పవిత్ర స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోయి, జననమరణ చక్రం నుంచి విముక్తి లభించి, మోక్షసిద్ధి కలుగుతుందని హిందువుల విశ్వాసం.
సాధువుల కోసం ఏర్పాటు చేసిన ఘాట్‌ల వైపు తరలివచ్చిన భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది
మంగళవారం భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని నియంత్రించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని జునా అఖాడాకు చెందిన మహంత్ ప్రయాగ్ పూరి ఆరోపించారు.
”స్నానమాచరించేందుకు వెళ్లినప్పుడు మమ్మల్ని పక్కకు తోసేశారు” అని ఆయన మాతో చెప్పారు.
”చాలా రద్దీగా ఉంది, ఎవరికీ క్రమశిక్షణ లేదు, కిందపడి నా కాలికి గాయమైంది. బతికి బయటపడేందుకు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పక్కకు రావాల్సి వచ్చింది”
ఈరోజు, ”తొలి షాహి స్నానం” అని ఆయన అన్నారు.
”జనవరి 29న జరిగే మరో షాహి స్నానంలోపు అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నా” అన్నారాయన.
జనవరి 14న ఆచరించే స్నానాలను షాహి స్నానం లేదా రాజ స్నానంగా పిలుస్తారు. ఈ రోజున స్నానమాచరించేందుకు సాధువులు త్రివేణి సంగమానికి (పవిత్ర నదులుగా భావించే గంగా, యమున, సరస్వతి నదుల కలయిక. అయితే సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుందని నమ్ముతారు) కోలాహలంగా, ఊరేగింపుగా తరలివచ్చారు.
ఎక్కడెక్కడి నుంచో వచ్చే సాధువుల ఆశీర్వాదం కోసం భక్తులు తరలిరావడం ఇక్కడ ప్రధాన ఆకర్షణ.
కుంభమేళాలో ముఖ్యమైన రోజులు..
కుంభమేళాలో స్నానమాచరించేందుకు ఆరు రోజులు అత్యంత ప్రాముఖ్యత కలిగినవిగా చెబుతారు. గ్రహాలు, నక్షత్రరాశుల కలయిక ఆధారంగా పండితులు వీటిని నిర్ణయిస్తారు.
అవేంటంటే..
జనవరి 13: పుష్య పౌర్ణమి
జనవరి 14: మకర సంక్రాంతి
జనవరి 29: మౌని అమావాస్య
ఫిబ్రవరి 3: వసంత పంచమి
ఫిబ్రవరి 12: మాఘ పౌర్ణమి
ఫిబ్రవరి 26: మహా శివరాత్రి
వీటిలో జనవరి 14, 29, ఫిబ్రవరి 3 నాగ సాధువులు స్నానమాచరించే షాహి/రాజ స్నాన రోజులు.
జనవరి 29న భక్తులు భారీ సంఖ్యలో తరలిరావొచ్చని, ఆ రోజు 5 కోట్ల నుంచి 6 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానమాచరించేందుకు తరలివస్తారని భావిస్తున్నారు.
కుంభమేళాకు వచ్చే సాధువులు, భక్తులు, యాత్రికులకు వసతి కల్పించేందుకు నదీతీరంలో దాదాపు 4,000 హెక్టార్లలో విశాలమైన టెంట్లతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
కొద్దిరోజులుగా కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి డప్పువాయిద్యాలతో, ఊరేగింపులతో సాధువుల బృందాలు తరలివస్తున్నారు.
ఒంటినిండా బూడిద రాసుకున్న సాధువుల బృందాలు, వారిలో కొందరు నగ్న సాధువులు కాగా, మరికొందరు నడుముకి చిన్న వస్త్రం ధరించి, ఇంకొందరు మెడలో బంతిపూల దండలతో త్రిశూలాలు, కత్తులు, ఢమరుకాలు చేతబూని వీధుల్లో ప్రదర్శనగా తరలివస్తున్నారు.
మరొక బృందం తమ స్వామీజీని రథంపై కూర్చోబెట్టుకుని కళాకారులు, నృత్యకారుల కోలాహలం నడుమ గుర్రాలు, ఒంటెలతో భారీ ఊరేగింపుగా శిబిరానికి తీసుకెళ్లింది.
అఖాడాలుగా పిలిచే ఈ బృందాలు విశాలమైన శిబిరాలను ఏర్పాటు చేసుకున్నాయి. సాయంత్రం వేళ జరిగే పూజలకు, స్వామీజీల ప్రవచనాలు వినేందుకు తరలివచ్చే భక్తుల కోసం, దాదాపు పది వేల మంది పట్టేంత పెద్దవిగా ఆ శిబిరాలు ఉన్నాయి.
క్షీరసాగరాన్ని మథించిన వేళ ఉద్భవించిన అమృతభాండం కోసం దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన పోరాటమే కుంభమేళాలకు మూలంగా పురాణాలలో ఉంది.
అమృతభాండం కోసం దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన పోరాట సమయంలో అందులో నుంచి కొన్ని చుక్కలు చింది నాలుగు నగరాలైన ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో పడ్డాయని విశ్వసిస్తారు.
అందువల్ల, ఈ నాలుగు నగరాల్లో కుంభమేళా జరుగుతుంది. అయితే, మహా కుంభమేళా మాత్రం ప్రయాగ్‌రాజ్‌లోనే జరుగుతుంది.
అరుదుగా సంభవించే గ్రహాల కలయిక కారణంగా ఈసారి కుంభమేళా ప్రత్యేకమైనదని, ఆ కలయిక దీనిని మహా కుంభమేళాగా మార్చిందని స్వామీజీ మహంత్ రవీంద్ర పూరి చెప్పారు.
తన అఖాడా నుంచి వేలాది మందితో మంగళవారం పుణ్యస్నానమాచరించేందుకు మహంత్ పూరి స్వామీజీ తరలివచ్చారు.
”కుంభమేళా సమయంలో, పవిత్ర నదీజలాలు అమృతంతో పునీతమవుతాయని మా విశ్వాసం.”
”అలాగే, గంగమ్మ భక్తులు కోరిన కోరికలు తీరుస్తుంది” అని ఆయన అన్నారు.
మేం సోమవారం, మధ్యప్రదేశ్ నుంచి కుంభమేళాకు వచ్చిన చితియా అహిర్వార్‌ను కలిశాం.
20 మంది బృందంతో కలిసివచ్చిన ఈ 60 ఏళ్ల మహిళ నదిలో స్నానమాచరించారు, మంగళవారం కూడా మరోసారి పవిత్ర స్నానమాచరించనున్నట్లు చెప్పారు.
”నా పిల్లలు క్షేమంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆ గంగమ్మని కోరుకున్నా” అని ఆమె చెప్పారు.
కుంభమేళా గురించి చాలా విన్నానని, కానీ ఇంతకుముందు రాలేకపోయానని దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు నుంచి వచ్చిన వ్యాపారవేత్త మావరం పటేల్ చెప్పారు.
“కుంభమేళా మన ప్రాచీన సంప్రదాయంలో భాగం. ముఖ్యమైన హిందూ పండుగల్లో ఇదొకటి.”
”నా కుటుంబంతో పాటు ఈ విశ్వమంతా క్షేమంగా, సుఖసంతోషాలతో ఉండాలని గంగా మాతను ప్రార్థించా” అని పటేల్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)