SOURCE :- BBC NEWS
ఒక గంట క్రితం
మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
ప్రపంచంలో మానవులు తరలివచ్చే అతిపెద్ద మతపర కార్యక్రమం మహా కుంభమేళా.
ఈ కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి హిందూ భక్తులు తరలి వచ్చారు. ఆరు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతిరోజూ భక్తులు ఇక్కడకు రానున్నారు.
గంగా, యుమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో భక్తులంతా పవిత్ర స్నానాలు చేస్తారు.
పవిత్ర నదీజలాల్లో స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని హిందువులు నమ్ముతారు.
భజనలు, నృత్యాలు చేస్తూ పెద్ద ఊరేగింపుగా భక్తులు నదీ తీరానికి తరలివస్తున్నారు.
ఫోటో జర్నలిస్ట్ అంకిత్ శ్రీనివాస్ తీసిన ఫోటోలను ఇక్కడ మీకు అందిస్తున్నాం.
45 రోజుల వ్యవధిలో మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. బూడిద పూసుకుని నగ్నంగా ఉండే హిందూ సాధువులు, అంటే నాగ సాధువులు మంగళవారం తెల్లవారుజామున త్రివేణి సంగమంలో తొలి స్నానాలు ఆచరిస్తారు.
మహా కుంభమేళా కోసం దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. సోమవారం రోజు 50 లక్షల నుంచి 80 లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరిస్తారని, ఆ తర్వాత రోజు మంగళవారం 2 కోట్ల మందికి పైగా పవిత్రమైన త్రివేణి సంగమంలో స్నానం చేస్తారని అంచనా వేశారు అధికారు.
కుంభమేళా ఆచారాల్లో పాల్గొన్న భక్తులు, చాలామంది సాధువులు ఒళ్లంతా బూడిద రాసుకున్నారు. అఖాడాల్లో పెద్ద ఎత్తున జనం కనిపిస్తున్నారు. నాగ సాధువులు పంచ దశనాం జునా అఖాడాలో తమ శరీరాలపై బూడిద, మెళ్లల్లో రుద్రాక్ష మాలలు ధరించి కూర్చుని ఉన్నారు.
భారత్‌లో అత్యంత పవిత్రంగా భావించే గంగా, యమున, సరస్వతి నదులు కలిసే చోట భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక ఘాట్ అందుబాటులో ఉంది. ఇక్కడకు చేరుకోవాలంటే ప్రధాన నగరం నుంచి దాదాపు మూణ్నాలుగు కిలోమీటర్లు నడవాలి.
మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం సుమారు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజంతా పొగమంచు కురుస్తూనే ఉంటోంది. మధ్యాహ్నమైనా సూర్యుడి జాడ కనిపించని పరిస్థితి. అయినా భక్తులు తెల్లవారుజామునే స్నానాలకు వచ్చారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మతపర కార్యక్రమం మహా కుంభమేళాగా అభివర్ణిస్తున్నారు. ఈ కుంభమేళా కార్యక్రమం శాటిలైట్ల నుంచి కూడా కనిపిస్తుందని చెబుతున్నారు. భక్తులకు, పర్యాటకులకు సదుపాయం కల్పించేందుకు, 4 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో త్రివేణి సంగమ తీరంలో అతిపెద్ద టెంట్ సిటీని ఏర్పాటు చేశారు.
నగరంలో ఎక్కడ చూసినా భక్తులు, సెక్యూరిటీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తమ లగేజీని భుజాలపై వేసుకుని త్రివేణి సంగమం వైపుకు వెళ్లడం కనిపించింది. ప్రతిచోటా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
వివిధ అఖాడాలకు చెందిన సాధువులు రకరకాల ప్రదర్శనలు చేసుకుంటూ మహా కుంభమేళాకు విచ్చేస్తున్నారు. భక్తుల రక్షణ కోసం వజ్రా వాహనాలు, డ్రోన్లు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డులను ఈ వేడుక జరిగే ప్రాంతం వద్ద మోహరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)