SOURCE :- BBC NEWS
వారణాసిలో ఓ టీనేజ్ అమ్మాయి, తన అమ్మమ్మ వాళ్ల ఇంటిపక్కనుండే ఓ మహిళ మాటలు విని, తల్లి అయ్యేందుకు అవసరమయ్యే అండాలను దానం చేసింది. అది కూడా కేవలం 15 వేల రూపాయలకే. అప్పటికి ఆమెకు 15 ఏళ్లు కూడా లేవు. అలా వచ్చిన డబ్బుతో స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలన్నది ఆమె ఆశ. అలా ఆలోచించింది ఆమె ఒక్కతే కాదు.
భూమిపై ప్రతి 15 సెకన్లకు ఒకసారి మహిళల శరీరంలో నుంచి అండాలను బయటికి తీస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ తన కథనంలో తెలిపింది.
చాలా వరకు ఐవీఎఫ్(కృత్రిమ గర్భధారణ) చికిత్సలలో మహిళలు సొంతంగా తమ అండాలనే వాడుకుంటారు. కానీ, 6 శాతం కేసులలో మాత్రం ఇతరులు దానం చేసిన అండాలను వాడుతున్నట్టు అందులో పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా 2019లో 1,20,000లకు పైగా పిండాలను, దానంగా తీసుకున్న అండాల నుంచి సృష్టించారని, 2011తో పోలిస్తే ఈ సంఖ్య రెండింతలైనట్లు ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ మానిటరింగ్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ పేర్కొందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.
అయితే, వాస్తవ సంఖ్య దీని కంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది.
ఎందుకంటే, చాలా దేశాల్లో దీనిపై సమగ్ర పర్యవేక్షణ లేదు. అంతేకాక, ఇందులో భారత్‌కు చెందిన గణాంకాలు లేవు.
భారత్ సిరమ్స్ అండ్ వ్యాక్సీన్స్ లిమిటెడ్ విడుదల చేసిన డేటా ప్రకారం, భారత్‌లో ఒక్క 2023లోనే దానం ద్వారా తీసుకున్న అండాలను ఉపయోగించి 95 వేల సార్లు ఐవీఎఫ్ జరిగినట్లు అంచనా.
పిల్లల్ని పొందేందుకు కాస్త వయసున్న మహిళలతో పోలిస్తే యుక్త వయసులో ఉన్న మహిళల నుంచి సేకరించిన అండాలకే డిమాండ్ వస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ తన కథనంలో నివేదించింది.
ఈ ఎగ్ ట్రేడ్, పరిమిత నియంత్రణ పద్ధతుల్లో ఓపెన్ మార్కెట్లు, గ్రే మార్కెట్లు, బ్లాక్ మార్కెట్లలో సాగుతోంది.
అయితే, అండదానం, సరోగసీ ప్రక్రియలు చట్టబద్ధంగా జరిగేందుకు భారత్ ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలకు లోబడే అండదానం, సరోగసీలు జరగాలి.
అండాన్ని ఎవరు దానం చేయొచ్చు? ఎగ్ డొనేషన్‌కు భారత్‌లో ఉన్న నియమ నిబంధనలు ఏంటి? అన్న విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
‘అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ’ అనే మాటను అనేక విధాల అర్ధంలో నిర్వచించే అవకాశం ఉంది. అయితే, వీర్యం లేదా అండాలను మనిషి శరీరం నుంచి బయటకు తీసుకువచ్చి, దానిని అభివృద్ధి పరచడం ద్వారా రూపొందిన గమీట్ లేదా ఎంబ్రియోను మహిళ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోకి ప్రవేశపెట్టే అన్ని రకాల విధానాలను అసిస్టెడ్ రీప్రోడక్టివ్ టెక్నాలజీ అని దీని భావం.
ఈ యాక్ట్‌లోనే వీర్యం, అండాన్ని దానం చేయాలనుకునే వారికి ఎంత వయసుండాలి? ఆరోగ్యపరంగా వారికెలాంటి భద్రతా కల్పించాలి? ఈ ప్రక్రియలో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? క్లినిక్స్ పాటించాల్సిన నియమాలు ఏంటి? అన్న విషయాలను వివరించింది.
అండదానం ఎవరు చేయొచ్చు?
ఈ చట్టం ప్రకారం ఓసైట్(ఇమెచ్యూర్ ఎగ్ డోనర్) దానం చేయాలనుకునే మహిళల వయసు 23 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.
అంతేకాక, మహిళల నుంచి సేకరించిన ఓసైట్‌ను లేదా అండాన్ని ఒకరికి మించి ఎక్కువ జంటలకు ఇవ్వకూడదు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బ్యాంకులుగా నమోదు చేసుకున్న సంస్థల వద్దనే అండాన్ని దానం చేయాలి.
ఓసైట్ లేదా అండం దానం చేసే వ్యక్తి తన జీవితంలో ఒకేసారి దానం చేయాలి, చేసినప్పుడు ఏడుకు మించిన ఓసైట్లను లేదా అండాలను దానంగా ఇవ్వకూడదు.
అండాలను దానం చేయాలనుకునే మహిళలు ఆరోగ్యకంగా, లైంగికంగా చురుకుగా ఉన్నవారై ఉండాలని రివైవ్ క్లినిక్స్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీలత గొర్తి చెప్పారు. పెళ్లయిన మహిళలే అండదానం చేసేందుకు వీలుంటుందన్నారు.
‘అండదానం చేసే వారి ఆధార్ తప్పనిసరి’
అండదానం చేసే వారి నుంచి తప్పనిసరిగా ఆధార్ కార్డును డాక్టర్లు తీసుకోవాల్సి ఉంటుందని ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీలత గొర్తి తెలిపారు.
అయితే, తప్పుడు పత్రాలు సృష్టించే వారిని కనిపెట్టడం చాలా కష్టమని అన్నారు. పెళ్లయిన మహిళల నుంచే ఎగ్ డొనేషన్ ప్రక్రియ చేపడతారని, ఎందుకంటే ఇదంతా సర్జికల్‌గా సాగుతుందన్నారు.
అండదానం చేసిన వారికి చట్టంలో నిర్దేశించిన మాదిరి బీమా సౌకర్యాలను కమిషనింగ్ కపుల్ అంటే ఆ అండాల నుంచి లబ్ది పొందే వారు తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే, ఏఆర్‌టీ చట్టంలో లోపాలున్నాయని, కొన్ని విషయాల్లో స్పష్టత లేదని డాక్టర్ శ్రీలత చెప్పారు.
- హ్యుమన్ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్(హెచ్ఐవీ) టైప్ 1, 2
- హైపటైటిస్ బీ వైరస్(హెచ్‌బీవీ)
- హెపటైటిస్ సీ వైరస్(హెచ్‌సీవీ)
- క్లామిడియా
అయితే, మహిళల నుంచి సేకరించిన ఓసైట్/అండాలను అమ్మేందుకు, ట్రేడ్ చేసేందుకు ఉపయోగించకూడదు. వాటిని ఎక్కడికీ ఎగుమతి చేయకూడదు. తప్పుడుగా వీటిని ఉపయోగిస్తే, ఏఆర్‌టీ చట్టం కింద జైలు శిక్షలతో పాటు జరిమానాలు కూడా ఉన్నాయి.
క్లినిక్స్, బ్యాంకులు కూడా అండదానం చేసిన వారి సమాచారాన్ని, ఈ చికిత్స తీసుకునే జంట సమాచారాన్ని, చికిత్సను గోప్యంగా ఉంచాలి. ఆ సమాచారాన్ని నేషనల్ రిజిస్ట్రీకి తప్ప ఎవరికీ ఇవ్వకూడదు.
స్క్రీనింగ్ ప్రక్రియంతా పూర్తి చేయడంతో పాటు, లీగల్ పేపర్‌వర్క్‌లను పూర్తి చేసిన తర్వాతనే ఎగ్ డొనేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందని డాక్టర్ శ్రీలత చెప్పారు.
అండదానం చేసిన తర్వాత ఏమైనా సమస్యలు వస్తాయా?
అండాలను దానం చేయాలనుకునే వారు పది రోజుల పాటు ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ శ్రీలత గొర్తి తెలిపారు.
ఈ మెడికేషన్లు అండాలను ఉత్పత్తి చేసేందుకు సహకరిస్తాయని, ఆ తర్వాత అనస్థీషియా ఇచ్చి అండాలను బయటికి తీయాల్సి ఉంటుందని తెలిపారు. దీని వల్ల కొన్నిసార్లు కొద్దిపాటి నొప్పిలాంటి సమస్యలు వస్తుంటాయని, అవి కూడా పెయిన్ కిల్లర్ టాబ్లెట్లతో తగ్గించవచ్చని చెప్పారు.
సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా వస్తుంటాయని, అండాలను బయటకు తీసే ప్రక్రియ చాలా సురక్షితమైనదని డాక్టర్ శ్రీలత గొర్తి తెలిపారు. ఎగ్ ఫ్రీజ్ చేసుకునే వారు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తుంటారు.
చాలా అరుదైన కేసుల్లో ఒకేసారి ఎక్కువగా అండాలు విడుదలైనప్పుడు మాత్రమే సమస్యలు వస్తాయని తెలిపారు.
భారత్‌లో అండదానానికి నియమ, నిబంధనలు ఉన్నాయని, వాటిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని డాక్టర్ శ్రీలత చెప్పారు.
‘వయసు ఎక్కువైన తర్వాత పిల్లల్ని కనాలని చూస్తున్నారు’
‘‘28 ఏళ్ల వయసు వచ్చే సరికి స్త్రీలలో మంచి అండాలు 50 శాతానికి తగ్గిపోతాయి. మారుతున్న జీవన విధానాలు, స్మోకింగ్, ఆల్కహాల్ వంటి వాటితో మంచి అండాల విడుదల కూడా తగ్గిపోతుంది.
ప్రస్తుతం యువత కెరీర్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటంతో, వయసు ఎక్కువైన తర్వాత పిల్లల్ని కనాలని చూస్తున్నారు. కానీ, అప్పటికే మంచి అండాల విడుదల తగ్గుతుండటంతో, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయి. ప్రెగ్నెన్సీలు రాకపోతుండటంతో, ఐవీఎఫ్ చేయించుకుంటున్నారు.” అని డాక్టర్ శ్రీలత చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)