SOURCE :- BBC NEWS

పేర్ని నాని, ఆయన భార్య జయసుధ

ఫొటో సోర్స్, UGC

కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై గత కొద్దికాలంగా కేసులు, వివాదాలు నడుస్తుండగా.. ఇప్పుడు కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రేషన్‌ బియ్యం గల్లంతుపై మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబసభ్యుల మీద కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం పరారీలో ఉన్న నాని కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్‌ బీబీసీకి తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

అసలు కేసు ఏమిటి?

పేర్ని వెంకట్రామయ్య (నాని) తన భార్య జయసుధ పేరిట బందరు మండలం పొట్లపాలెంలో గోదాములను నిర్మించారు.

దాదాపు 40 వేల టన్నుల సామర్థ్యం కలిగిన ఈ గోదాములను 2020లో ఏపీ గిడ్డంగుల సంస్థ ద్వారా పౌర సరఫరాల సంస్థ అద్దెకు తీసుకుంది. 

బస్తాకు నెలకు రూ. 5 వరకు అద్దె చెల్లిస్తోంది. ఇక్కడ నిర్వహణ అంతా ప్రైవేటు యాజమాన్యమే చూసుకుంటుంది. సివిల్‌ సప్లయ్స్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా మేనేజర్‌ ఎప్పటికప్పుడు నిల్వలు పరిశీలించాల్సి ఉంటుంది.

అక్కడి గోదాముల్లోని నిల్వల్లో తేడాలున్నట్టు గత నెల చివరి వారంలో పౌరసరఫరాల సంస్థకు ఫిర్యాదులు అందాయి. దీంతో డిసెంబర్‌ నెల మొదట్లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మతో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులు సోదాలు చేయగా బియ్యం నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించారు.

ప్రభుత్వానికి చెందిన రేషన్‌ బియ్యంలో 185 టన్నులు మాయమైనట్టు సివిల్‌ సప్లయ్స్ కార్పొరేషన్‌ కృష్ణా జిల్లా అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డి ప్రాథమికంగా గుర్తించారు.

ఆ మేరకు రేషన్‌ బియ్యం నిల్వల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ బందరు పోలీస్‌ స్టేషన్‌లో జయసుధతో పాటు గోడౌన్‌ మేనేజర్‌ మానస తేజపై కోటిరెడ్డి ఫిర్యాదు చేశారు.

దీంతో ఈనెల 10వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు.

రూ.కోటి 79 లక్షలు చెల్లించాలని నోటీసులు

రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అధికారులు 185 టన్నుల బియ్యం విలువను రూ. 89.72 లక్షలుగా లెక్కగట్టారు.

ఘటనపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మన్‌జీర్‌ జిలానీ ఆదేశాలు జారీ చేశారు.

బియ్యం గల్లంతుపై లెక్కలు తేల్చి రెట్టింపు జరిమానా వసూలు చేయడంతో పాటు గోదాముల యజమానిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆ మేరకు నాని కుటుంబం రూ. కోటి 79 లక్షలు జరిమానా చెల్లించాలని స్పష్టంచేశారు.

గోదాములు

ఫొటో సోర్స్, Getty Images

248 టన్నులు మాయం

గోదాముల్లో వేబ్రిడ్జి సరిగ్గా పని చేయకపోవడం వల్ల తగ్గుదల వచ్చిందని పౌరసరఫరాల శాఖ అధికారులకు పేర్ని జయసుధ లేఖ రాశారు.

షార్టేజీకి సంబంధించిన ధాన్యం విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ మేరకు రూ. కోటి 76 లక్షల రూపాయలను డీడీల రూపంలో పేర్ని కుటుంబ సభ్యులు చెల్లించినట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ పద్మాదేవి బీబీసీకి తెలిపారు.

తనిఖీల్లో భాగంగా చేపట్టిన ప్రాథమిక విచారణలో పేర్ని జయసుధకి చెందిన గోడౌన్లో 185 టన్నుల బియ్యం నిల్వలు మాయమైనట్టు గుర్తించామని, అయితే పూర్తి స్థాయి సోదాలు చేపట్టిన తర్వాత 248 మెట్రిక్‌ టన్నుల బియ్యం మాయమైనట్లు తేలిందని పద్మాదేవి తెలిపారు. దీనిపై ఇంకా సదరు గోడౌన్‌ బాధ్యులకు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు.

డబ్బులు చెల్లించినా.. కేసులు ఎందుకంటే

ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేశారన్న అభియోగంపై 316 క్లాజ్‌–3,5, 61 క్లాజ్‌2 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని బందరు తాలూకా పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఏసుబాబు బీబీసీకి వివరించారు.

డబ్బుల తిరిగి చెల్లింపుతో తమకు సంబంధం లేదని, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

పేర్ని నాని

ఫొటో సోర్స్, perninani/facebook

అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం

గోదాంలో రేషన్‌ బియ్యం మాయమైన ఘటనకు సంబంధించి గోదాం యజమాని పేర్ని జయసుధ, మేనేజర్‌ మాసన్‌ తేజపై క్రిమినల్‌ కేసులు నమోదైనప్పటి నుంచి పేర్ని కుటుంబం కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు.

బియ్యం మాయమైన కేసులో ప్రధాన నిందితురాలు జయసుధ విదేశాలకు వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశామనీ, మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని కృష్ణా ఎస్పీ గంగాధరరావు తెలిపారు.

కాగా, ఈ కేసుకు సంబంధించి పేర్ని జయసుధ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ఈనెల 24కి వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టులు పోలీస్‌‌స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పేందుకు పోలీసులు వారి ఇంటికి వెళ్లారు.

కాగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్టేషన్‌కి రావాల్సిందిగా ఇంటికి నోటీసులు అంటించారు పోలీసులు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)