SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
బంగారం ధర నిరంతరం పెరుగుతోంది. రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుత అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లో, ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు.
ఇందుకోసం భారీగా కొనుగోళ్లు జరుపుతున్నారు.
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఉపయోగించగల నమ్మకమైన, స్థిరమైన ఆస్తిగా బంగారాన్ని చాలాకాలంగా భావిస్తున్నారు.
కానీ, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పడుతూ, లేస్తున్న ప్రస్తుతం కాలంలో బంగారం నిజంగా సురక్షితమైన పెట్టుబడేనా?


ఫొటో సోర్స్, Reuters
కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర
అమెరికా సుంకాల ప్రకటన తర్వాత అతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న గందరగోళంతో, గత వారం వరకు బంగారం ధర ఒక గ్రాము రికార్డు స్థాయిలో రూ. 9,600 దాటింది.
ప్రపంచవ్యాప్తంగా సుంకాలు, వాణిజ్య యుద్ధం సృష్టించిన ఆందోళన కారణంగా, ఈ ఏడాది బంగారం ధరలు అనేకసార్లు కొత్త రికార్డులను సృష్టించాయి.
ఆర్థిక వ్యవస్థలో అస్థిరత ఉన్నప్పుడల్లా బంగారం ధరలు పెరుగుతుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
బంగారం ఎవరు కొంటున్నారు?
ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారాన్ని ఎవరు ఎక్కువగా కొంటున్నారు?
“ప్రభుత్వాలు, రిటైల్ పెట్టుబడిదారులు, సాధారణ పెట్టుబడిదారులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు” అని బెల్‌ఫాస్ట్ యూనివర్సిటీ ఆర్థిక చరిత్రకారుడు డాక్టర్ ఫిలిప్ ఫ్లైయర్స్ అన్నారు.
“ఇప్పుడు చాలామంది షేర్ల వంటి ఈక్విటీ సాధనాలను వదిలి బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. బంగారం ధరలు బాగా పెరగడానికి ఇదే కారణం” అని ఆయన అన్నారు.
అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లో అనిశ్చితి వాతావరణం ఏర్పడినప్పుడల్లా, ఇన్వెస్టర్ల సహజ ధోరణి బంగారంలో పెట్టుబడుల వైపు వెళ్తుంది.
2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమవుతున్నప్పుడు, బంగారం ధర చుక్కలను తాకడం మొదలయింది.
అయితే, అలాంటి అనిశ్చితి కొన్నిసార్లు బంగారం ధరలను దెబ్బతీస్తుంది కూడా.
2020 జనవరిలో బంగారం ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. కానీ అదే సంవత్సరం మార్చిలో ధరలు మళ్లీ తగ్గడం ప్రారంభించాయి.
“సురక్షిత పెట్టుబడులు అంటే ప్రమాదం లేదని అర్ధం కాదు.” అని డాక్టర్ ఫ్లైయర్స్ అంటున్నారు.
ఆర్థిక అనిశ్చితి కాలంలో, బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదిగా భావించడానికి కారణం గోల్డ్‌కు ఎప్పుడూ ప్రాముఖ్యత ఉండడం.

భారత్ నుంచి ఈజిప్టు దాకా…
చరిత్రలో ప్రతి సమయంలోనూ, ప్రతి సంస్కృతిలోనూ బంగారానికి ప్రాముఖ్యత ఉంది. అందుకే దాన్ని సులభంగా కొనవచ్చు, అమ్మవచ్చు.
పురాతన ఈజిప్టులోని టుటంకామన్ మాస్క్ నుంచి ఘనా దేశం అసాంతేలోని పీఠం, భారత్‌లోని అనంత పద్మనాభ ఆలయంలోని సింహాసనం వరకు చారిత్రక, సాంస్కృతికంగా బంగారానికున్న ప్రాముఖ్యతకు ఆధారాలు.
అందుకే బంగారాన్ని చాలామంది అత్యంత నమ్మదగ్గ ఆస్తిగా భావించి దానిని కూడబెట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనడంలో ఎంత రిస్క్ ఉంది?
ప్రపంచ మార్కెట్లో పరిస్థితి మారుతూనే ఉన్నప్పటికీ, బంగారపు వస్తువులు, ఆభరణాల ప్రాముఖ్యత చెక్కుచెదరలేదు.
కానీ బంగారంలో ఏదైనా పెద్ద పెట్టుబడి ఆర్థిక మార్కెట్‌లోని కీలక వ్యక్తుల దయపై ఆధారపడి ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి.
ఈ మార్కెట్లో కీలక వ్యక్తులు ఏమి చేసినా, ఆ ప్రభావం బంగారం ధరలపై కనిపిస్తుంది.
”ఈ వ్యక్తుల కార్యకలాపాల ఫలితంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు చాలా వేగంగా బంగారం కొనడం ప్రారంభించడంతో దాని ధర పెరుగుతోందని నేను భావిస్తున్నాను” అని ఫైయ్యర్స్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారీగా బంగారం కొంటున్న సెంట్రల్ బ్యాంకులు
మార్కెట్ అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా, సెంట్రల్ బ్యాంకులు ఈక్విటీ మార్కెట్లో తమ పెట్టుబడిని తగ్గించుకుని, బంగారాన్ని పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తాయి. వారి లక్ష్యం తమ బంగారు నిల్వలను పెంచుకోవడం.
ఈ పరిస్థితిలో, బంగారం కొనడం సాధారణ పెట్టుబడిదారులకు ప్రమాదకరం కావచ్చు.
“బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నప్పటికీ, దానిపై నమ్మకం పెట్టుకోవడం ప్రమాదకరం కావచ్చు. ఎందుకంటే మార్కెట్లు స్థిరత్వం సాధించిన వెంటనే, ప్రభుత్వాలు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించిన వెంటనే బంగారంలో పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం మొదలుపెడతారు”
“మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, దీర్ఘకాలిక కోణంలో కొనుగోలు చేయండని నేను చెబుతా” అని ఫ్లైయర్స్ అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS