SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, CHHATTISGARH POLICE
భారత్‌లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కగార్‌పై ఆసక్తికర చర్చకు తెలంగాణ కేంద్రమైంది.
మావోయిస్టులను చర్చలకు పిలవాలని తెలంగాణలో ప్రతిపక్షం బీఆర్ఎస్, మావోయిస్టులది శాంతి భద్రతల సమస్య కాదంటూ అధికార పక్షం కాంగ్రెస్ మాట్లాడుతున్నాయి.
మరోవైపు శాంతి చర్చల కోసం తెలంగాణ వేదికగా స్వతంత్ర కమిటీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాము చర్చలకు సిద్ధం అంటూ తాజాగా మావోయిస్టులు మరోసారి లేఖ విడుదల చేశారు.
మధ్య భారతదేశంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌ను ఆపి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటూ శాంతి చర్చల కమిటీ నాయకులు కొందరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఏప్రిల్ 27న సీఎం నివాసంలో ఆ సమావేశం జరిగింది.


ఫొటో సోర్స్, Telangana CMO
‘నక్సలిజాన్ని శాంతిభద్రతల అంశంగా పరిగణించం’
శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ ఇందులో ఉన్నారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని, కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రిని కోరారు కమిటీ నాయకులు. ఆ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు.
”నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతిభద్రతల అంశంగా పరిగణించదు. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉంది. ఈ అంశంపై ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటాం. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం” అని వారితో చెప్పారు సీఎం రేవంత్.

ఫొటో సోర్స్, @BRSparty
‘ఆపరేషన్ కగార్‌ను ఆపేయాలి’
అదే రోజు జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ ఆపరేషన్ కగార్ గురించి ప్రస్తావించారు.
”కేంద్రం కగార్ పేరుతో ఛత్తీస్‌గడ్‌లో యువత, గిరిజనులను ఊచకోత కోస్తోంది. ఇది ధర్మం కాదు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలకు సిద్ధంగా ఉన్నామని నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. బలం ఉంది కదా అని చంపుకుంటూపోవుడు కాదు. అది ప్రజాస్వామ్యం కాదు.
కగార్ ఆపరేషన్ వెంటనే ఆపేయండి. వాళ్లను పిలిచి డెమొక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్లేం మాట్లాడుతున్నారో చూడండి. అట్టా కాదు మొత్తం ఏరేస్తాం, కోసేస్తాం, నరికి పారేస్తాం అంటే.. మీ దగ్గర మిలటరీ ఉంది, కొడతారు. కానీ అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు” అని అన్నారు కేసీఆర్.
అదే సభలో దాన్ని తీర్మానంగా చెప్పి, కార్యకర్తల చప్పట్లతో ఆమోదించినట్టు ప్రకటించి, ఆ తీర్మానాన్ని దిల్లీకి లేఖ రూపంలో రాస్తానని కేసీఆర్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
మావోయిస్టుల నుంచి వరుసగా శాంతి చర్చల ప్రతిపాదనలు
గత కొద్ది నెలలుగా మావోయిస్టుల తరపు నుంచి చర్చల ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో మధ్య భారతదేశంలో ఎన్‌కౌంటర్ వార్తలు తరచుగా వస్తున్నాయి. వాటిలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతి చర్చల ప్రతిపాదనలు ఊపందుకున్నాయి.
ఈ చర్చల అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ హైదరాబాద్ కేంద్రంగా ఒక కమిటీ కూడా ఏర్పడింది. వారు మార్చి 24న హైదరాబాద్‌లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఆ తరువాత చర్చలకు సానుకూలత వ్యక్తం చేస్తూ మార్చి 28, 2025 తేదీతో మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. తాజాగా మరోసారి ఏప్రిల్ 24న ఇంకో లేఖ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైంది. గత లేఖలోని అంశాలను ప్రస్తావిస్తూనే మరోసారి కాల్పుల విరమణ, చర్చల ప్రస్తావన చేశారు మావోయిస్టులు.

లేఖలో ఏముందంటే…
”నేను మార్చి 28న లేఖ విడుదల చేశాను. మా పీఎల్జీఏ బలగాల సాయుధ చర్యలను నిలిపివేయాలని మా కామ్రేడ్స్ ఆదేశాలు జారీ చేశారు. శాంతి చర్చల కోసం మా పార్టీ వైపు నుంచి నేను ఇచ్చిన ప్రకటన, దండకారణ్యంలోని ఉత్తర్-పశ్చిమ్ సబ్ జోనల్ బ్యూరో వైపు నుంచి కామ్రేడ్ రూపేష్ ఇచ్చిన రెండు ప్రకటనలతో కలిసి ఇప్పటికే మూడు పత్రికా ప్రకటనలు విడుదలయ్యాయి.
కానీ ప్రభుత్వాలు మాత్రం హత్యలను కొనసాగిస్తూ మిగతా మావోయిస్టులు లొంగిపోకపోతే ఇదే గతి పడుతుందని హెచ్చరికలు చేస్తున్నాయి. ఆయుధాన్ని ఆయుధంతోనే ఎదుర్కొంటామని బహిరంగంగానే మాట్లాడుతున్నాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి.
కర్రెగుట్టలు ప్రాంతాన్ని దిగ్బంధించి, 10 వేల మంది బలగాలను మోహరించి, 5 రోజుల నుంచి పెద్ద ఆపరేషన్ సాగిస్తూ మా కామ్రేడ్స్ లో ఆరుగురిని హత్య చేయడమే కాకుండా పార్టీ నాయకత్వాన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం కోసం ఈ హత్యాకాండలను ఆపాల్సిందిగా, దేశవ్యాప్తంగా చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో సమయావధితో కూడిన కాల్పుల విరమణను ప్రకటించాల్సిందిగా మా పార్టీ కేంద్ర కమిటీ మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది” అని అభయ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చర్చల కోసం పెరుగుతున్న ఒత్తిడి
కొందరు పౌర సమాజ సభ్యుల పేరుతో ఏప్రిల్ 28న తాజాగా మరో లేఖ విడుదలైంది.
”తక్షణం భారత ప్రభుత్వం మావోయిస్టుల కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదనను అంగీకరించి, పారా మిలటరీ దళాల ఆపరేషన్లు నిలిపివేయాలి” అంటూ రెండు పేజీల లేఖ ఇంగ్లిష్, హిందీల్లో విడుదల చేశారు. తెలంగాణ నుంచి ప్రొఫెసర్ హరగోపాల్, ఛత్తీస్‌గఢ్ నుంచి సోని సోరి అనే ఆదివాసీ కార్యకర్త, ఇతరులు మరో నలుగురు దీనిపై సంతకం చేశారు.
అయితే ప్రస్తుతానికి దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)