SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, WTUK
బ్రిటన్‌లో గర్భాశయమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఓ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ శిశువును ‘మిరకిల్ బేబీగా’ భావిస్తున్నారు. ఇలా జరగడం ఇదే తొలిసారి.
పాప తల్లి 36 ఏళ్ల గ్రేస్ డేవిడ్‌సన్ గర్భాశయం లేకుండానే జన్మించారు. దీంతో 2023లో ఆమె సోదరి గర్భాశయాన్ని గ్రేస్‌కు అమర్చారు.
బ్రిటన్‌లో విజయవంతమైన తొలి గర్భాశయ మార్పిడి శస్త్రచికిత్స ఇదే.
ఈ ఆపరేషన్ జరిగిన రెండేళ్ల తర్వాత, ఫిబ్రవరిలో గ్రేస్ బిడ్డకు జన్మనిచ్చారు. గ్రేస్, అంగస్ దంపతులు తమకు జన్మించిన పాపకు అమీ అని పేరు పెట్టారు. గ్రేస్‌కు గర్భ సంచి దానం చేసిన ఆమె సోదరి పేరు కూడా అమీనే.
రెండు కిలోల బరువున్నబిడ్డను తొలిసారి చేతుల్లోకి తీసుకున్నగ్రేస్ “అద్భుతం”, ‘మహా అద్బుతం’ అని భావోద్వేగానికి లోనయ్యారు.
స్కాట్లండ్‌కు చెందిన గ్రేస్, అంగస్ ఉత్తర లండన్‌లో ఉంటున్నారు. వీరు మరో బిడ్డను కనాలని కూడా భావిస్తున్నారు.
ఈ జంట మొదట తమ గుర్తింపును బయట పెట్టేందుకు ఇష్టపడలేదు. అయితే బిడ్డ సురక్షితంగా జన్మించడంతో అమీని చేతుల్లోకి తీసుకుని ఇదొక ‘చిన్న అద్భుతం’ అని బీబీసీతో చెప్పారు.
గ్రేస్‌కు గర్భసంచి అమర్చిన తర్వాత, మరో ముగ్గురుకి కూడా చనిపోయిన వారి గర్బ సంచి అమర్చే ఆపరేషన్లు చేసినట్లు ఈ శస్త్ర చికిత్స చేసిన బృందం బీబీసీకి చెప్పింది.
క్లినికల్ ట్రయల్‌లో భాగంగా ఇలాంటివి 15 ఆపరేషన్లు చేయాలని ఈ టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.

గ్రేస్, మేయర్- రోకిటాన్స్కీ- కుస్టర్ హౌసర్( MRKH) సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో జన్మించారు. ఈ వ్యాధి సోకిన వారిలో గర్భసంచి కనిపించకపోవడం లేదంటే అభివృద్ధి చెందకపోవడమో జరుగుతుంది.
కానీ అండాశయాలు పని చేస్తాయి. 2018లో బీబీసీ మొదటిసారి ఆమెతో మాట్లాడినప్పుడు, తన తల్లి గర్భాశయం దానం చేస్తే, దాని ద్వారా బిడ్డలను కనాలని భావించినట్లు చెప్పారు.
అయితే తల్లి గర్భాశయం ఆమెకు సరిపోలేదు.
అయితే 2019లో గ్రేస్ ఆమె భర్త అంగస్‌ను బీబీసీ మరోసారి కలిసింది.
ఆ సమయంలో వారిద్దరూ గ్రేస్ ఇద్దరు సిస్టర్స్‌లో ఒకరైన అమీ పుర్డీ, తన గర్భాశయాన్ని సోదరికి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
ఎందుకంటే అప్పటికే అమీకి ఇద్దరు పిల్లలు. దీంతో అమీ, ఆమె భర్త తమకు ఇక పిల్లలు వద్దని నిర్ణయించుకున్నారు.

ఫొటో సోర్స్, WTUK
30 మంది డాక్టర్లు, 17 గంటల ఆపరేషన్
గర్భాశయ మార్పిడి శస్త్ర చికిత్సకు ముందే అక్కాచెల్లెళ్లిద్దరికీ వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చారు. గ్రేస్, అంగస్ కూడా సంతానోత్పత్తి చికిత్స తీసుకున్నారు. అప్పటికే వారి అండాలను భద్రపరిచారు. గ్రేస్‌కు సరోగసీ ద్వారా బిడ్డను పొందడం లేదా దత్తత తీసుకోవడం అనే ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఆమె తాను సొంతంగా బిడ్డను కనడం ‘ముఖ్యమని’ భావించారు.
“నాకు తల్లిని కావాలని ఎప్పుడూ ఆశ ఉండేది. అయితే అది కష్టం కాబట్టి నేను చాలా కాలంగా నాలోని ఆశలను అణచి వేస్తూ వచ్చాను” అని ఆమె చెప్పారు.
ప్రపంచంలో గర్భాశయ మార్పిడి ద్వారా తొలి బిడ్డ 2014లో స్వీడన్‌లో జన్మించారు. అప్పటి నుంచి అలాంటి సర్జరీలు అమెరికా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, తుర్కియే సహా డజనుకు పైగా దేశాల్లో 135కు పైగా జరిగాయి. గర్భాశయ మార్పిడి సర్జరీ ద్వారా 65 మంది మహిళలు బిడ్డలను కన్నారు.
వాస్తవానికి గ్రేస్‌కు గర్భసంచి మార్పిడి శస్త్ర చికిత్స 2019లోనే జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంగా ఏర్పడిన సందేహాల వల్ల కొన్నేళ్ల పాటు ఆలస్యం అయింది.
2023 ఫిబ్రవరిలో 30 మందికి పైగా వైద్యులు అమీ నుంచి గర్భసంచి తీసి గ్రేస్‌కు అమర్చడానికి 17 గంటల పాటు శ్రమించారు.
ఈ ప్రక్రియ అక్కాచెల్లెళ్లిద్దరి ప్రాణాలకు ముప్పేనని ఆక్స్‌ఫర్డ్‌లోని చర్చిల్ హాస్పిటల్‌లో ఈ ఆపరేషన్ చేసిన బృందానికి నాయకత్వం వహించిన సర్జన్ ఇసబెల్ క్విరోగా చెప్పారు.
“ఇది జీవితాన్ని మెరుగుపరుస్తుంది. జీవితాన్ని సృష్టిస్తుంది. ఇంతకంటే మంచిది ఏముంటుంది” అని ఆమె అన్నారు.
గర్భసంచి మార్పిడి ఆపరేషన్ తర్వాత మహిళగా ఏదో కోల్పోయిన భావన తనకు ఏమీ లేదని అమీ చెప్పారు. ఎందుకంటే తాను చేసిన దానం వల్ల తన సోదరికి ప్రయోజనం కలిగిందన్నారు.
గర్భసంచి మార్పిడి జరిగిన రెండు వారాల తర్వాత గ్రేస్‌కు పీరియడ్స్ వచ్చాయి. ఆమె ఐవీఎఫ్ ద్వారా తొలి ప్రయత్నంలోనే గర్భవతి అయ్యారు.
“గర్భంలో బిడ్డ లోపల నుంచి తొలిసారి తన్నినప్పుడు అదొక ‘అద్భుత అనుభూతి’ అని, తన గర్బం ‘నిజంగానే ప్రత్యేకమైనదని’ అన్నారు.
2025 ఫిబ్రవరి 27న పశ్చిమ లండన్‌లోని క్వీన్ షార్లెట్ ఆసుపత్రిలో గ్రేస్‌కు సిజేరియన్ చేశారు.
“ఇది అద్భుతమైన, ఆనందంతో నిండిన క్షణం” అని ఆపరేషన్ చేసిన సర్జన్ ఇసబెల్ క్విరోగా అన్నారు.

ఫొటో సోర్స్, WTUK
వైద్య బృందం తాము మరో బిడ్డను కనొచ్చని చెబితే అందుకు సిద్ధంగా ఉన్నామని గ్రేస్, అంగస్ చెప్పారు.
రెండో బిడ్డ పుట్టిన తర్వాత గ్రేస్‌కు అమర్చిన గర్బసంచిని తొలగిస్తారు. దీనివల్ల సోదరి గర్భసంచి తన శరీరం తిరస్కరించకుండా ఉండేందుకు ఆమె తీసుకుంటున్న రోగ నిరోధక ఔషధాలను నిలిపివేయవచ్చు.
గర్భసంచి అమర్చిన తర్వాత తీసుకోవాల్సిన మాత్రలను ప్రతి రోజూ తీసుకుంటే శరీరంలో కొన్ని రకాల క్యాన్సర్లు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే ఒకసారి గర్భసంచి తొలగించిన తర్వాత ఈ సమస్యలన్నీ సాధారణ స్థాయికి వస్తాయని డాక్టర్ ఇసబెల్ క్విరోగా చెబుతున్నారు.
గర్భసంచి మార్పిడి శస్త్ర చికిత్సలో పాల్గొన్న ప్రొఫెసర్ రిచర్డ్ స్మిత్, ఇంపీరియల్ కాలేజ్ హెల్త్‌కేర్‌లో గైనకాలజిస్టుగా పని చేస్తున్నారు. గర్భసంచిని తొలగించి, మరో శరీరంలో అమర్చే బృందానికి ఆయన నాయకత్వం వహించారు. గర్భసంచి మార్పిడి శస్త్ర చికిత్స మీద ఆయన 20 ఏళ్లుగా పరిశోధన చేస్తున్నారు.
అమీ పుట్టుకతో తమకు పట్టలేని సంతోషం కలిగిందని ఆయన చెప్పారు.
“నేను ఎప్పుడూ విపరీతంగా మాట్లాడుతూ ఉంటాను. అయితే పాప పుట్టిన తర్వాత నాకు మాటలు రాలేదు. ఆ రోజు ఆపరేషన్ థియేటర్లో అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి” అని ఆయన చెప్పారు.
“ఈ మొత్తం ప్రక్రియ అంతా అద్భుతం, కదిలించేలా ఉంది” అని ప్రొఫెసర్ స్మిత్ తెలిపారు.

అమీ పుట్టుక బ్రిటన్‌లో గర్భాశయం పనిచేయని, పిల్లల్ని కనే వయసున్న 15వేల మంది మహిళల్లో ఆశలు రేపిందని ఆయన అన్నారు. ఈ 15వేల మందిలో 5వేల మందిలో అసలు గర్భాశయం లేదు.
గ్రేస్ గర్భసంచి మార్పిడి ఆపరేషన్‌కు అవసరమైన డబ్బును వూంబ్ ట్రాన్స్‌ప్లాంట్ యూకే అనే స్వచ్చంధ సంస్థ చెల్లించింది. ఈ సంస్థకు స్మిత్ నాయకత్వం వహిస్తున్నారు. ఆపరేషన్ చేసిన వైద్య సిబ్బంది అంతా ఉచితంగా తమ సేవలందించారు.
ప్రస్తుతం పది మంది మహిళలు తమ అండాలను భద్రపరచుకున్నారని, వారంతా గర్భసంచి మార్పిడి శస్త్ర చికిత్స కోసం ఎదురు చూస్తున్నారని స్మిత్ చెప్పారు. గర్బాశయ మార్పిడి శస్త్ర చికిత్సకు 30వేల యూరోలు ఖర్చవుతుంది. మరో రెండు శస్త్ర చికిత్సలకు అవసరమైన నిధులు తమ వద్ద ఉన్నాయని స్మిత్ తెలిపారు.
క్లినికల్ ట్రయల్‌లో భాగంగా 15 గర్భాశయ మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు ఈ బృందానికి అనుమతులు ఉన్నాయి. అందులో పది మంది మరణించిన వారు, ఐదుగురు జీవించిన దాతల నుంచి గర్భాశయం తీసుకోవచ్చు.
మరణించిన దాతల నుంచి సేకరించిన గర్భాశయాన్ని అమర్చుకున్న ముగ్గురు మహిళల వివరాలను ఇంత వరకు బహిర్గతం చేయలేదు. ఇటువంటి దానం కోసం చనిపోయిన వారి కుటుంబ సభ్యుల అదనపు అనుమతి అడుగుతున్నామని ఎన్‌హెచ్‌ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ బీబీసీకి తెలిపింది.
తమను తల్లిదండ్రులను చేసినందుకు గ్రేస్ సోదరికి ఎప్పటికీ రుణపడి ఉంటామని బేబీ అమీ తండ్రి అంగస్ చెప్పారు. అమీకి తన చిన్నమ్మ పేరు పెట్టడానికి క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.
గ్రేస్‌కు పుట్టిన పాపకు అమీతో పాటు ఇసబెల్ పేరును కూడా కలిపి పెట్టారు. గర్భాశయ మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యురాలు పేరది.
బిడ్డ పుట్టిన తర్వాత గ్రేస్ తన సోదరికి మరింత చేరువయ్యారు.
“తను నా కోసం అలా చేయడం చాలా కష్టం. సోదరి ప్రేమకు ఇది నిదర్శనం” అని గ్రేస్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS