SOURCE :- BBC NEWS

మిస్ ఇంగ్లండ్ 2025 మిల్లా మాగీ

ఫొటో సోర్స్, missworld.com

ప్రపంచ సుందరి పోటీ చుట్టూ వివాదం అలుముకుంది. ఆ పోటీల నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన మిస్ ఇంగ్లండ్ 2025 మిల్లా మాగీ, పోటీల నిర్వహణపై ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనమైంది.

”నన్ను నేను ఒక వేశ్య అనుకునేలా చేశారు” అంటూ మిల్లా మాగీ ఒక బ్రిటన్ పత్రికతో చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్‌లో రాజకీయ దుమారం సృష్టిస్తున్నాయి.

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన వారిలో మిస్ ఇంగ్లండ్‌‌ విజేత మిల్లా మాగీ ఒకరు.

ఆమె పోటీల కోసం మే 7న హైదరాబాద్ వచ్చి, మే 16న తిరిగి వెళ్ళిపోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

బ్రిటన్‌కి చెందిన టాబ్లాయిడ్ ‘ది సన్’కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మిల్లా మాగీ ఏం చెప్పారంటే..

‘‘ఒక మార్పు చూపిద్దామని అక్కడకు వెళ్లాను. కానీ, ఏదో ఆటబొమ్మలా కూర్చోవాల్సి వచ్చింది. అక్కడ కొనసాగడానికి నా నైతికత ఒప్పుకోలేదు. ఏదో వినోదం పండించడానికే వచ్చినట్టు నిర్వాహకులు చూశారు. నన్ను నేను ఒక వేశ్య అనుకునేలా చేశారు. ధనవంతులైన మగ స్పాన్సర్ల ముందు నడిపించిన తరువాత, ఇక ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను” అని మాగీ చెప్పారు.

”ప్రపంచ సుందరి పోటీలకు కాలం చెల్లింది. ప్రపంచాన్ని మార్చడానికి నీ గొంతు విప్పడం ముందు ఆ కిరీటాలు, సాషేలు ఎందుకూ పనికిరావు. పొద్దున టిఫిన్ దగ్గర నుంచి రోజంతా మేకప్ వేసుకుని, బాల్ గౌన్స్ వేసుకుని ఉండమనే వారు” అని మిల్లా మాగీ తెలిపారు.

ప్రపంచ సుందరి వేడుకలు

ఫొటో సోర్స్, www.missworld.com

ధన్యవాదాల పేరుతో కొందరు మధ్య వయసు మగవారిని ఎంటర్‌టైన్‌ చేయమన్నప్పుడు మిల్లా విసిగిపోయినట్లు ‘ది సన్’ పత్రిక తన కథనంలో రాసింది.

”ఆరుగురు అతిథులు కూర్చున్న ప్రతీ టేబుల్ మీద ఇద్దరు అమ్మాయిలను కూర్చోబెట్టారు. సాయంత్రం అంతా వారితో కూర్చోవాలి, వారిని ఎంటర్‌టైన్ చేయాలి అన్నారు. నాకు అది చాలా తప్పు అనిపించింది. నేను జనానికి వినోదం పంచడానికి వెళ్లలేదు. మిస్ వరల్డ్‌కి కొన్ని విలువలు ఉండాలి. కానీ, ఆ పోటీలు చాలా పాతకాలం పద్ధతుల దగ్గరే ఆగిపోయాయి. ఔట్ డేటెడ్ అవి. నన్ను నేను ఒక వేశ్యలా భావించుకునేలా చేశాయి’’ అని మిల్లా మాగీ ‘ది సన్’తో అన్నారు.

‘‘నేను ఏ అంశంపై సేవా కార్యక్రమాల ప్రచారం చేస్తున్నానో దాని గురించి మాట్లాడాలనుకుంటే అక్కడున్న మగవారు మాత్రం ఏవో అనవసరమైన, సంబంధం లేనివి మాట్లాడడం ఇబ్బంది పెట్టింది. ఇలాంటివి ఊహించలేదు. మమ్మల్ని పెద్దరికంతో కాక, పిల్లల్లా చూశారు” అని మాగీ తెలిపారు.

ఆవిడ తన బాధను తల్లికి ఫోన్ చేసి చెప్పుకున్నారని, తనను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని చెప్పారని ‘ది సన్’ పత్రిక రాసింది.

ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ‘ది సన్’ కథనాన్ని షేర్ చేస్తూ ట్వీట్ చేసింది.

”తెలంగాణ ప్రజల సొమ్ము రూ. 250 కోట్లు ఖర్చు పెట్టి మరీ అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్ పరువు తీసిన కాంగ్రెస్ సర్కార్, బ్రోకర్ రేవంత్! హైదరాబాద్‌ – “మిస్ వరల్డ్ 2025 ఆర్గనైజర్లు నన్ను వేశ్యలా చూశారు” అంటూ అందాల పోటీల నుంచి తప్పుకుని మధ్యలోనే హైదరాబాద్ నుంచి ఇంగ్లాండ్ వెళ్లిపోయిన 2024 మిస్ ఇంగ్లాండ్ – మిల్లా మాగీ” అంటూ వ్యాఖ్యానించింది బీఆర్ఎస్.

మిల్లా మాగీ ఈ ఆరోపణలపై మిస్ వరల్డ్ నిర్వాహకులు స్పందించారు. ఆమె ఆరోపణలను తప్పు పట్టారు.

చార్లెట్ గ్రాంట్

ఫొటో సోర్స్, Telangana I&PR

”ఈ నెల ప్రారంభంలో తన తల్లి అనారోగ్యం కారణంతో అత్యవసరంగా వెళ్లాలంటూ పోటీల నుంచి వెళ్లిపోతానని మిస్ ఇంగ్లండ్ 2025 విజేత మిల్లా మాగీ కోరారు. ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకున్న మిస్ వరల్డ్ సంస్థ చైర్మన్, సీఈవో జూలియా మోర్లీ, ఆమె తిరిగి ఇంగ్లండ్ వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత ఆమె స్థానంలో చార్లెట్ గ్రాంట్ ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చారు. బుధవారమే ఆమె హైదరాబాద్ చేరుకున్నారు” అని ఆ ప్రకటనలో రాశారు.

”దురదృష్టవశాత్తూ కొన్ని బ్రిటన్ మీడియా సంస్థలు, భారత్‌లో తన అనుభవాల వార్తలు ప్రచురించినట్టు తెలిసింది. కానీ, ఇక్కడ ఆ అమ్మాయి ఉన్న పరిస్థితికీ, ఆ వార్తలకూ సంబంధం లేదు. ఆ వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆ అమ్మాయి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తాను స్వయంగా మాట్లాడిన అన్ ఎడిటెడ్ వీడియోలను మేం విడుదల చేస్తున్నాం. ఇక్కడ అంతా బావుందని, కృతజ్ఞతలు చెబుతూ ఆవిడ చెప్పడం మనం స్పష్టంగా చూడవచ్చు. ఇండియాలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకూ, అక్కడకు వెళ్లాక వస్తోన్న కథనాలకూ అసలు సంబంధమే లేదు” అని తమ ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, Telangana I&PR

”నిజానికి మిస్ వరల్డ్ గౌరవానికి, బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే విలువకు కట్టుబడి ఉంటుంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు వేసే ముందు మీడియా సంస్థలు పాత్రికేయ విలువలు పాటించాలని కోరుతున్నాం” అని మిస్ వరల్డ్ సంస్థ ప్రకటన విడుదల చేసింది.

మిస్ వరల్డ్ సంస్థ చైర్మన్, సీఈవో జూలియా మోర్లీ పేరిట ఈ ప్రకటన ఉంది.

గతంలో ఆమె ఇక్కడంతా బావుందని చెప్పిన వీడియోను ఆ ప్రకటనతో పాటు విడుదల చేశారు.

చౌమహల్లా ప్యాలస్‌లో ఒక్కచోట మాత్రమే మిల్లా మాగీ విందులో పాల్గొన్నారని, అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందని పేర్కొంటూ నిర్వాహకులు ఆ వీడియోలను విడుదల చేశారు.

ఆ వీడియోలో టేబుల్ దగ్గర మిల్లా మాగీకి రెండు వైపులా మహిళలే కూర్చుని ఉండగా, ఒకే ఒక మగ వ్యక్తి ఆ టేబుల్ వద్ద కనిపించారు.

ఈ వివాదం తర్వాత, మిల్లా మాగి స్థానంలో మిస్ ఇంగ్లండ్ రన్నరప్ చార్లెట్‌ ఈ పోటీల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)