SOURCE :- BBC NEWS

మీ ఆలోచనలను కంప్యూటర్ ఆదేశాలుగా అనువదించగల చిప్ మీ మెదడులో ఉండటం సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించవచ్చు. కానీ నోలాండ్ అర్బాగ్ విషయంలో మాత్రం అదే నిజం.
పక్షవాతానికి గురైన ఎనిమిదేళ్ల తర్వాత, 2024 జనవరిలో 30 ఏళ్ల నోలాండ్ అర్బాగ్ అమెరికా న్యూరోటెక్నాలజీ సంస్థ న్యూరాలింక్ నుంచి అలాంటి చిప్‌ను పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు. పక్షవాతం, సంక్లిష్ట నాడీ సంబంధిత చికిత్సల కోసం ఎలాన్‌మస్క్ న్యూరాలింక్ కంపెనీని ప్రారంభించారు
అయితే ఇలాంటి చిప్‌లు కొత్తేమీ కాదు. కొన్ని ఇతర కంపెనీలు కూడా వాటిని అభివృద్ధి చేసి అమర్చాయి. కానీ మస్క్ కారణంగా నోలాండ్‌పై అందరి దృష్టి పడింది.
కానీ ఇదంతా తనకో, మస్క్‌కో సంబంధించిన విషయం కాదని, అది సైన్స్‌కు చెందిన అంశమంటారు నోలాండ్.
తాను చేస్తున్నదాంట్లోని ప్రమాదం ఏమిటో తెలుసని ఆయన బీబీసీకి చెప్పారు. కానీ ”మంచైనా చెడైనా, ఏదైనా సరే, నేను సహాయం చేస్తాను” అని ఆయన అన్నారు.
”అంతా సవ్యంగా జరిగితే, న్యూరాలింక్‌లో భాగమవ్వడానికి నేను సహాయం చేయగలను” అని ఆయన చెప్పారు.
”ఏదైనా భయంకరమైన సంఘటన జరిగితే, వారు దాని నుంచి నేర్చుకుంటారని నాకు తెలుసు”అని ఆయనన్నారు.


ఫొటో సోర్స్, Reuters
గోప్యత లేదు
అరిజోనాకు చెందిన నోలాండ్, 2016లో జరిగిన డైవింగ్ ప్రమాదంలో భుజాల కింద నుంచి పక్షవాతానికి గురయ్యారు.
తన గాయాలు చాలా తీవ్రంగా ఉండటంతో మళ్ళీ చదువుకోలేనని, పని చేయలేనని, ఆటలు ఆడుకోలేనని భయపడినట్టు నోలాండ్ చెప్పారు.
”మీకు మీపై నియంత్రణ ఉండదు. గోప్యత ఉండదు..అది చాలా కష్టమైన విషయం” అని ఆయన చెప్పారు.
”ప్రతిదానికీ ఇతరులపై ఆధారపడడం మీరునేర్చుకోవాలి” అని నోలాండ్ గుర్తుచేసుకున్నారు.
మెదడు ద్వారా కంప్యూటర్‌ను నియంత్రించగల న్యూరాలింక్ చిప్ ఆయనకు గతంలో ఉన్న స్వేచ్ఛను కొంతమేర పునురుద్ధరించగలదనిపిస్తోంది.
దీనిని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (బీసీఐ) అని పిలుస్తారు. మనుషులు కదలాలని ఆలోచించినప్పుడు ఉత్పన్నమయ్యే చిన్న విద్యుత్ ప్రేరణలను గుర్తించి, వాటిని డిజిటల్ కమాండ్‌లోకి అనువదించడం ద్వారా ఇది పనిచేస్తుంది. స్క్రీన్‌పై కర్సర్‌ను కదిలించడం ద్వారా ఆలోచనలను డిజిటల్ కమాండ్‌లోకి అనువదిస్తుంది.
శాస్త్రవేత్తలు అనేక దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్న సంక్లిష్టమైన అంశం ఇది.
ఈ రంగంలోకి ఎలాన్ మస్క్ ప్రవేశించడంతో అనివార్యంగా టెక్, నోలాండ్ అర్బాగ్, ముఖ్యాంశాలుగా మారాయి.
న్యూరాలింక్ అనేక పెట్టుబడులను ఆకర్షించడంలో ఇది సాయపడింది. అలాగే అత్యంత హానికరమైన ఈ ప్రక్రియ భద్రత, ప్రాముఖ్యతపై పరిశీలనకు కూడా దోహదపడింది.
నోలాండ్‌కు చిప్ అమర్చినట్టు ప్రకటించినప్పుడు నిపుణులు దీన్ని కీలక మైలురాయిగా అభివర్ణించారు. అదే సమయంలో దాని పనితీరు, ఉపయోగాలను నిజంగా అంచనా వేయడానికి సమయం పడుతుందని హెచ్చరించారు.
ముఖ్యంగా మస్క్ ”తన కంపెనీకి ప్రచారం కల్పించడంలో” కనబర్చే నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిపుణులు ఈ హెచ్చరిక చేశారు.
ఆ సమయంలో మస్క్ బహిరంగంగా దీనిపై ప్రకటన చేయకుండా, ”ప్రారంభ ఫలితాలు న్యూరాన్ స్పైక్ గుర్తింపును ఆశాజనకంగా చూపిస్తున్నాయి” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
శస్త్రచికిత్సకు ముందు, తరువాత తనతో మాట్లాడిన ఎలాన్ మస్క్ చాలా ఆశావాదంగా ఉన్నారని నోలాండ్ అన్నారు.
”ఇది మొదలుపెట్టడానికి నేనెంత ఉత్సాహంగా ఉన్నానో ఆయన కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారనుకుంటున్నా” అని నోలాండ్ చెప్పారు.
అయినప్పటికీ, న్యూరాలింక్‌కు దాని యజమాని కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉందని, దానిని ”ఎలాన్ మస్క్ పరికరం”గా తాను పరిగణించనన్నారు.

న్యూరాలింక్ లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు
పరికరాన్ని అమర్చిన శస్త్రచికిత్స తర్వాత స్పృహలోకి వచ్చినప్పుడు, మొదట తన వేళ్లను తిప్పడం గురించి ఆలోచించడం ద్వారా స్క్రీన్‌పై కర్సర్‌ను నియంత్రించగలిగానని నోలాండ్ వివరించారు.
”నిజాయితీగా చెప్పాలంటే నాకు ఏమి ఆశించాలో తెలియదు – ఇది సైన్స్ ఫిక్షన్‌లా అనిపిస్తుంది” అని ఆయనన్నారు.
కానీ తర్వాత తన ఆలోచనలతోనే తాను కంప్యూటర్‌ను నియంత్రించగలనన్న విషయం ఒక విధంగా అర్థం అయిందని నోలాండ్ గుర్తచేసుకున్నారు. చిప్ పనితీరు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠతో ఉన్న న్యూరాలింక్ ఉద్యోగులు ఆ సమయంలో ఆయన చుట్టూ ఉన్నారు.
తర్వాత తర్వాత ఇంకా మంచి జరిగింది. కాలక్రమేణా చిప్‌ను ఉపయోగించగల సామర్థ్యం పెరిగింది, ఇప్పుడు ఆయన చెస్, వీడియో గేమ్‌లు ఆడగలిగే స్థాయికి చేరుకున్నారు.
“నేను ఆటలు ఆడుతూ పెరిగాను, పక్షవాతానికి గురయినప్పుడు ఆటలు ఆడడం వదులుకోవాల్సి వచ్చింది” అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
“ఇప్పుడు నేను ఆటల్లో నా స్నేహితులను ఓడిస్తున్నాను, అది నిజంగా సాధ్యమయ్యేది కాదు… కానీ అది జరుగుతోంది’’ అని ఆయనన్నారు.
జీవితాలను మార్చగల సాంకేతికత సామర్థ్యానికి నోలాండ్ ఒక శక్తివంతమైన నిదర్శనం. అయితే కొన్ని లోపాలు కూడా ఉండవచ్చు.
“ప్రధాన సమస్యలలో ఒకటి గోప్యత” అని సస్సెక్స్ విశ్వవిద్యాలయంలోన న్యూరోసైన్స్ ప్రొఫెసర్ అనిల్ సేథ్ అన్నారు.
‘‘చిప్ వల్ల మన మెదడు కార్యకలాపాలు ఎలా ఉంటాయంటే.. మనం ఏమి చేస్తామో అది మాత్రమే కాకుండా మనం ఏమి ఆలోచిస్తామో, మనం ఏం నమ్ముతామో, మనం ఏ అనుభూతి చెందుతున్నామో కూడా బయటకు తెలుస్తుంది” అని ఆయన బీబీసీకి చెప్పారు.
ఒక్కసారి మీరు మీ తలలో చిప్ అమర్చుకున్న తర్వాత, ఇక వ్యక్తిగత గోప్యత అనేదే ఉండదు.
కానీ నోలాండ్‌కు ఇవి సమస్యలు కావు. చిప్స్ ఏమి చేయగలవో దాని పరంగా మరింత ముందుకు వెళ్లాలని ఆయన కోరుకుంటున్నారు.
ఆ పరికరం చివరికి తన వీల్‌చైర్‌ను లేదా భవిష్యత్‌లో రోబోను నియంత్రించడానికి వీలు కల్పిస్తుందని తాను ఆశిస్తున్నట్టు నోలాండ్ బీబీసీకి చెప్పారు.
ఈ సాంకేతికత ప్రస్తుతం బాగా పరిమిత స్థితిలో ఉన్నప్పటికీ, అంతా సజావుగా సాగడం లేదు.
ఒకానొక సమయంలో, ఆ పరికరంలో సమస్య తలెత్తడంతో ఆయన కంప్యూటర్‌కు, మెదడుకు మధ్య పాక్షికంగా సంబంధాలు తెగిపోయాయి. దీంతో కంప్యూటర్‌పై ఆయన నియంత్రణ కోల్పోయారు.
“అది నిజంగా బాధ కలిగించింది” అని ఆయన చెప్పారు.
“నేను మళ్ళీ ఎప్పుడైనా న్యూరాలింక్‌ని ఉపయోగించగలనో లేదో అప్పటికి నాకు తెలియదు”
ఇంజనీర్లు సాఫ్ట్‌వేర్‌ను సర్దుబాటు చేసినప్పుడు కనెక్షన్ మరమ్మతు అయింది. తరువాత పనితీరు మెరుగుపడింది. అయితే సాంకేతికత పరిమితులపై నిపుణులు తరచుగా వ్యక్తం చేస్తున్న ఆందోళనకు ఇది ఉదాహరణ.

ఫొటో సోర్స్, Getty Images
సాంకేతికతతో మార్పు
మన మెదడు శక్తిని డిజిటల్‌గా ఎలా ఉపయోగించుకోవాలో అన్వేషిస్తున్న అనేక కంపెనీలలో న్యూరాలింక్ ఒకటి.
అలాంటి సంస్థలలో సింక్రాన్ ఒకటి. మోటార్ న్యూరోన్ వ్యాధి ఉన్నవారికి సహాయం చేసేందుకు రూపొందించిన స్టెంట్రోడ్ పరికరాన్ని ఇంప్లాంట్ చేయడానికి చిన్నస్థాయి శస్త్రచికిత్స చాలు అని సింక్రాన్ చెబుతోంది.
ఓపెన్ బ్రెయిన్ సర్జరీతో పనిలేకుండా, ఒక వ్యక్తి మెడలోని సిరలోకి దీన్ని అమర్చుతారు. తరువాత రక్తనాళం ద్వారా మెదడుకు చేరుస్తారు.
న్యూరాలింక్ లానే, ఈ పరికరం మెదడు పనిచేసే ప్రాంతానికి అనుసంధానంగా ఉంటుంది.
”ఎవరైనా తమ వేలు నొక్కాలని లేదా నొక్కకూడదని ఆలోచిస్తున్నప్పుడు అది స్పందిస్తుంది” అని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రికీ బెనర్జీ అన్నారు.
“ఆ తేడాలను గ్రహించగలగడం ద్వారా మనం డిజిటల్ మోటార్ అవుట్‌పుట్‌గా పిలిచే స్థితిని సృష్టించగలదు” అని ఆయన చెప్పారు.
ఆ అవుట్‌పుట్ కంప్యూటర్ సిగ్నల్స్‌గా మారుతుంది. ప్రస్తుతం దీనిని 10 మంది ఉపయోగిస్తున్నారు.
ఆపిల్ విజన్ ప్రో హెడ్‌సెట్‌తో ఆ పరికరాన్ని ఉపయోగించిన మొదటి వ్యక్తి తానేనని తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి బీబీసీకి చెప్పారు.
దీనివల్ల ఆస్ట్రేలియాలోని జలపాతాలలో నిలబడటం నుంచి న్యూజిలాండ్‌లోని పర్వతాల మీదుగా నడవడం వరకు సుదూర ప్రాంతాలలో వర్చువల్‌గా సెలవులు గడపడానికి వీలు కలిగిందని మార్క్ చెప్పారు.
”ఇలాంటి వ్యాధి లేదా పక్షవాతం ఉన్నవారికి..సాంకేతికత నిజమైన మార్పు తీసుకురాగల ప్రపంచాన్ని భవిష్యత్తులో నేను చూడగలను” అని ఆయన అన్నారు.
అయితే నోలాండ్‌కి తన న్యూరాలింక్ చిప్ విషయంలో ఒక హెచ్చరిక ఉంది. ఆరేళ్ల కోసం ఇన్‌స్టాల్ చేసిన చిప్ అధ్యయనంలో భాగం కావడానికి ఆయన అంగీకరించారు. అయితే ఆ తర్వాత భవిష్యత్తు ఏంటి అన్నదానిపై స్పష్టత లేదు.
తనకు ఏమి జరిగినప్పటికీ, తన అనుభవం ఒకరోజు వాస్తవం కాగలదన్న విషయానికి దారి ఏర్పరుస్తోందని నమ్ముతున్నానని ఆయనన్నారు.
“మనకు మెదడు గురించి చాలా తక్కువ తెలుసు. మనం చాలా ఎక్కువ నేర్చుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది” అని ఆయనన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)