SOURCE :- BBC NEWS
హైదరాబాద్ మాదాపూర్ గూగుల్ ఆఫీసు దగ్గర ఒక ఆటో ఆగి ఉంది. ఆ ఆటోను ఎక్కడో చూశానే అని అనుకున్నారు యోహాన్ అనే వ్యక్తి. గుర్తు పట్టిన వెంటనే షాక్ అయ్యారు. బోరబండ పోలీసులకు ఫోన్ చేశారు.
యోహాన్ చూసిన ఆటో తన బావదే. కానీ, తన బావ మాత్రం ఏడాదిగా కనపడటం లేదు. కానీ, ఆయన ఆటో అకస్మాత్తుగా కనిపించింది. అది కూడా వేరే నంబరుతో. తనకు బాగా తెలిసిన ఆటో కాబట్టి బంపర్ చూసి గుర్తుపట్టారు యోహాన్.
బోరబండ పోలీసులు ఆటో నంబర్ చూశారు. అది ఒరిజినల్ రిజిస్ట్రేషన్ నంబర్ కాదని తేలింది. తరువాత టెక్నాలజీ ఉపయోగించి నకిలీ నంబరుతో తిరుగుతోన్న ఆటో డ్రైవర్ వివరాలు పట్టుకున్నారు. ఆయన పేరు మురళీ రెడ్డి.
ఆటో యజమానిని చంపి ఆయన ఆటోనే నడుపుతున్నారు మురళీ రెడ్డి. అయితే, ఆటో యజమానిని చంపింది మాత్రం ఆటో కోసం కాదని, ఆయన కూతురి కోసమని వెల్లడించారు బోరబండ పోలీసులు.
అసలేం జరిగింది?
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాకి చెందిన అలవాల మురళీరెడ్డి, ద్వారక దంపతులకు 14 ఏళ్ల కూతురు ఉంది. వీరు హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఉండేవారు. క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవారు మురళీ.
ప్రభుత్వ స్కూల్లో చదుకువునే పిల్లలకు ఒక స్వచ్ఛంద సంస్థ ట్యాబ్‌లు ఇచ్చింది. అలా మురళీ కూతురికి కూడా ట్యాబ్ రాగా అందులో కొన్ని యాప్‌లు వేసుకుని రీల్స్ చేసేవారు.
ఆ క్రమంలో ఈ 14 ఏళ్ల అమ్మాయికి 30 ఏళ్ల ఆటోడ్రైవర్ కుమార్ పరిచయం అయ్యారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన కుమార్‌కు అప్పటికే పెళ్లయింది.
భార్యతో గొడవల కారణంగా ఆమెను వదిలేసి, హైదరాబాద్‌లోని బోరబండలో సోదరి ఇంటి దగ్గర ఉంటున్నారు.
బాలికను నమ్మించి..
అయితే, తనకు సినిమా పరిశ్రమలో చాలామంది తెలుసనీ, వారికి చెప్పి అవకాశాలు ఇప్పిస్తానని కుమార్ ఆ బాలికకు చెప్పినట్లు పోలీసులు చెప్పారు. ఆ మాటలను నమ్మిన బాలిక 2023 సంక్రాంతి సమయంలో ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత కుమార్‌ను కలిసిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి వివరించారు.
అయితే తర్వాత ఆ అమ్మాయి, కుమార్ గొడవపడ్డారు. కుమార్ తనను వేధించేవాడనేది బాలిక కథనం. దీంతో బాలిక, కుమార్ నుంచి తప్పించుకుంది. తన తల్లిదండ్రుల వివరాలు చెప్పకుండా అనాథనని అబద్ధం చెప్పి, పోలీసుల సాయంతో ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి వెళ్లిందా బాలిక.
మరోవైపు కూతురు తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే అవమానం అని భావించిన మురళీ..ఎవరికీ చెప్పకుండా సొంతంగానే కూతురు కోసం వెతకడం ప్రారంభించారు. అప్పుడే కూతురు వాడిన ట్యాబ్ చూశారు.
‘‘ఆ ట్యాబ్‌లో వాట్సాప్‌లో ఉన్న కుమార్ నంబరుతో మురళీ టచ్‌లోకి వెళ్లారు. అయితే ఇక్కడే మురళీ తన తెలివి చూపించారు. తన భార్యతో వాట్సాప్ ద్వారా కుమార్‌తో సంప్రదింపులు జరిపారు. అలా వాట్సాప్‌లో కుమార్‌తో టచ్‌లో ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలసి కుమార్‌ను పూర్తిగా నమ్మించారు’’ అని సదరు పోలీసు అధికారి తెలిపారు.
ఒక రోజు పిలిచి..
ఇంకా పోలీసులు ఏం చెప్పారంటే…
కుమార్‌కి నమ్మకం కలిగించడం కోసం మురళీ భార్య ద్వారక తనకు పెళ్లికాక ముందు దిగిన ఫోటోలు కూడా అతనికి పంపించింది. ఇక కుమార్ తమను పూర్తిగా నమ్మిన తరువాత అంటే కూతురు వెళ్లిపోయిన దాదాపు రెండు నెలల తరువాత, 2023 మార్చిలో కుమార్ హత్యకు ప్రణాళిక వేసింది ఈ జంట.
అనుకున్న ప్రకారం, ద్వారక ద్వారా కుమార్‌ను మియాపూర్‌లోని బంధువుల ఇంటికి రప్పించారు. ఆ సమయంలో ఆ ఇంటి వారు ఊరిలో లేరు. దీంతో ఆ ఇల్లు ఎంచుకున్నారని వివరించారు సదరు పోలీసు అధికారి. అక్కడకు వచ్చిన కుమార్‌ను భార్యా భర్తలు ఇద్దరూ కలిసి తాళ్లతో కట్టేసి, బాగా కొట్టారు. కూతురు ఆచూకీ చెప్పమంటూ చావబాదారు. కానీ, అప్పటికే తప్పించుకున్న ఆ బాలిక గురించి కుమార్ నుంచి ఏ సమాధానమూ రాలేదు.
కుమార్ స్పృహ తప్పడంతో చనిపోయాడనుకుని ఆయన్ను కారు డిక్కీలో వేసుకుని కోదాడ వెళ్లారు. మార్చి 11వ తేదీన కోదాడ దగ్గర్లోని నాగార్జున సాగర్ కాలువలో కుమార్‌ను పారేశారని పోలీసుల కథనం. కుమార్ బతికి ఉన్నాడని తెలిసినప్పటికీ అతనికి రాళ్లు కట్టి కాలువలో పారేశారని పోలీసులు వారిపై అభియోగం మోపారు. ఆ తరువాత ఆ జంట ఏమీ తెలియనట్టుగా వెనక్కు వచ్చారు.
కుమార్ ఆటో డ్రైవర్ కావడంతో అతను వేసుకుని వచ్చిన ఆటోను మురళీ తీసుకుని, నంబర్ ప్లేట్ మార్చి నడపడం మొదలుపెట్టారు. మరోవైపు కుమార్ కనపడటం లేదని అతని కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ కేసు, తరువాత కొత్తగా పెట్టిన బోరబండ పోలీస్ స్టేషన్‌కి బదిలీ అయింది.
ఇన్నాళ్ల తరువాత కుమార్‌కు బావమరిది వరుసయ్యే యోహాన్ ఆ ఆటోను మాదాపూర్‌లో చూశారు. అది తన బావ ఆటోయేనని గుర్తించి పోలీసులకు చెప్పారు. పోలీసులు మురళీని పట్టుకుని ప్రశ్నించడంతో కుమార్‌ను చంపేసిన విషయం బయట పడింది.
కూతురు ఏమైంది?
కాగా, ఏ కూతురు కోసం ఇదంతా చేశారో ఆమె 2023 డిసెంబరులోనే తండ్రి దగ్గరకు వచ్చింది.
అటు ఇటూ తిరిగి చివరకు సూర్యాపేట ప్రభుత్వ పిల్లల సంరక్షణ కేంద్రానికి చేరిన ఆ అమ్మాయి, అక్కడి అధికారులకు తన తల్లిదండ్రుల వివరాలు చెప్పగా, మురళీ తన కూతుర్ని తెచ్చుకున్నారు.
కుమార్ హత్య సంగతి ఇక బయటకు రాదు అనుకున్నారు. కానీ, చివరకు ఆటో ఇలా పట్టించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)