SOURCE :- BBC NEWS
50 వేల ఏళ్ల నాటి బుజ్జి ఏనుగు అవశేషాలను రష్యా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
సైబీరియాలోని మారుమూల యకుటియా రీజియన్‌లో ఈ అవశేషాలను వారు ఈ మధ్యే గుర్తించారు.
థావింగ్ పెర్మాఫ్రాస్ట్ (ఆర్కిటిక్ రీజియన్‌లో శాశ్వతంగా ఘనీభవించిన నేలలోని మంచు కరగడం) కారణంగా బుజ్జి ఏనుగు అవశేషాలు బయటపడ్డాయి.
దీనికి వారు ‘యానా’ అనే పేరు పెట్టారు. అవశేషాలు లభ్యమైన నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా ఈ పేరు పెట్టారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ స్థితిలో లభ్యమైన మామూత్ మృతదేహం ఇదేనని వారు అంటున్నారు.
100 కేజీలకు పైగా బరువు, 120 సెం.మీ ఎత్తు, 200 సెం.మీ పొడవు ఉన్న యానా, ఏడాది వయస్సున్నప్పుడు మరణించి ఉంటుందని అంచనా వేశారు.
దీనికంటే ముందు ప్రపంచంలో ఇలాంటి ఆవిష్కరణలు ఆరు మాత్రమే జరిగాయి. రష్యాలో అయిదు, కెనడాలో ఒక దాన్ని గుర్తించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద పెర్మాప్రోస్ట్ ‘బటగైకా క్రేటర్’లో యానాను అక్కడి స్థానికులు మొదట చూశారు.
అక్కడి స్థానికులు సరైన సమయంలో యానాను గుర్తించారని లాజరెవ్ మామూత్ మ్యూజియం లాబోరేటరీ హెడ్ మ్యాక్సిమ్ షెర్పసోవ్ అన్నారు.
”మంచు కరిగిపోయి బుజ్జి ఏనుగు అవశేషాలు దాదాపు పొడిగా మారిన సమయంలో ఇది స్థానికులకు కనిపించింది. వెంటనే స్ట్రెచర్‌పై పైకి తీసుకొచ్చారు. మంచు కరగడం వల్ల మొదట తొండం బయటపడుతుంది. కొన్ని పక్షి జాతులు సాధారణంగా దీన్ని తింటాయి. కానీ, యానా తల మాత్రం చాలా భద్రంగా ఉంది” అని వార్తా సంస్థ రాయిటర్స్‌తో ఆయన చెప్పారు.
”ఈ బుజ్జి ఏనుగు బహుశా ఒక బుడుగులో కూరుకుపోయి ఉండొచ్చు. అలా వేల ఏళ్ల పాటు సురక్షితంగా, భద్రంగా ఉండొచ్చు” అని వార్తాసంస్థ రాయిటర్స్‌తో మ్యూజియానికి చెందిన రీసర్చర్ గావ్రిల్ నోవ్‌గోరోడోవ్ చెప్పారు.
రాజధాని యకుట్స్క్‌లోని నార్త్ ఈస్ట్రన్ ఫెడరల్ యూనివర్సిటీలో యానాపై అధ్యయనాలు చేస్తున్నారు. అది ఎప్పుడు చనిపోయిందో నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రష్యాలో విస్తృతంగా ఉన్న పెర్మాప్రోస్ట్‌లో ఇటీవలి కాలంలో బయల్పడిన ప్రి-హిస్టారిక్ (చరిత్ర పూర్వ యుగపు) ఆవిష్కరణ ఇదొక్కటే కాదు.
గత నెలలో ఇదే రీజియన్‌లో 32 వేల ఏళ్ల నాటి అవశేషంగా భావిస్తున్న, పాక్షికంగా పాడైన సాబర్ టూత్ జాతి పిల్లి అవశేషాలను శాస్త్రవేత్తలు ప్రదర్శించారు.
ఈ ఏడాది ఆరంభంలో 44వేల ఏళ్ల నాటి తోడేలు అవశేషాలు కూడా బయటపడ్డాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)