SOURCE :- BBC NEWS
నిమిష ప్రియ ఓ భారతీయ నర్సు. యెమెన్‌లో తన వ్యాపార భాగస్వామిని చంపారనే ఆరోపణలపై ఆ దేశ సుప్రీం జ్యూడిషియల్ కౌన్సిల్ ఆమెకు మరణ శిక్ష విధించింది.
యెమెన్ అధ్యక్షుడు రషద్ ముహమ్మద్ అల్-అలిమి కూడా ఈ మరణ శిక్షకు ఆమోదం తెలిపారు. ఆమె మరణ శిక్షకు ఆమోదం తెలపడంతో కోచిలో నివసిస్తున్న నిమిష కుటుంబం ఆందోళన చెందుతోంది.
బాధిత కుటుంబంతో చర్చలు జరిపి, నిమిషను క్షమించమని కోరే అవకాశం ఉందని ఆమె తరఫున న్యాయవాది అన్నారు. యెమెన్ షరియా చట్టాన్ని అనుసరించే దేశం.
న్యాయవాది ఏం చెప్పారు?
”షరియా చట్టాన్ని అనుసరించే దేశాల్లో ఒకవేళ బాధిత కుటుంబం నుంచి దోషులు క్షమాభిక్ష పొంది, ఆ కుటుంబానికి ‘బ్లడ్ మనీ'(పరిహారం) చెల్లిస్తే, ఆయా ప్రభుత్వాలు మరణ శిక్షను రద్దు చేయచ్చు.బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపి బ్లడ్ మనీని కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని నిమిష కుటుంబం తరఫున న్యాయవాది సుభాష్ చంద్రన్ అన్నారు.
”మేము బాధిత కుటుంబంతో చర్చలు జరపడం ముఖ్యం. కానీ, భారత ప్రభుత్వ సహకారం లేకుండా అది సాధ్యం కాదు. సొంతంగా భాదిత కుంటుంబాన్ని మేము ఆశ్రయించే అవకాశం లేదు” అని ఆయన అన్నారు.
యెమెన్‌లో హూతీ రెబెల్స్ మధ్యలో అంతర్యుద్ధ్యం మొదలైన అనంతరం, ఏప్రిల్ 2015లో రాజధాని సనాలో ఉన్న దౌత్య కార్యాలయాన్ని భారత ప్రభుత్వం అక్కడి నుంచి తరలించింది.
”మేం ఇప్పటికే 40,000 డాలర్లు (38 లక్షల రూపాయలు) చెల్లించాం. భాదిత కుంటుంబ తరపు న్యాయవాదికి ఈ మొత్తాన్ని 2 విడతల్లో చెల్లించాం. మొదట 20,000 డాలర్లు (19 లక్షల రూపాయలు) ఆ తర్వాత, గత శుక్రవారమే మరో 20,000 డాలర్లు చెల్లించాం” అని నిమిష తరఫు న్యాయవాది చంద్రన్ అన్నారు.
”మొదటి సారి డబ్బును జిబౌటీ కరెన్సీలో ఇచ్చాం. ఆ తర్వాత, రాయబార కార్యాలయాన్ని సౌదీ అరేబియాలోని రియాద్‌కు మార్చారు. రెండోసారి డబ్బును అక్కడ చెల్లించాం” అని చెప్పారు.
నిమిష ప్రియ కథ ఏంటి?
కోచిలో పలువురు ఇల్లలో పనికి వెళ్లే తన తల్లికి సాయంగా ఉండాలని నిర్ణయించుకున్న నిమిష ప్రియ 19 ఏళ్లు కూడా నిండకుండానే 2008లో యెమెన్‌కు వెళ్లారు.
కానీ ఈ రోజు నిమిష ప్రియ తల్లి 57 ఏళ్ల ప్రేమ కుమారి తన కూతురు క్షమాభిక్ష పొంది తిరిగి తన దగ్గరకు రావాలని ఎదురు చూస్తున్నారు.
యెమెన్‌కు వెళ్లిన మూడేళ్లకి, కోచికి తిరిగి వచ్చిన నిమిష, టామీ థామస్ అనే ఆటో డ్రైవర్‌ను పెళ్లాడారు. పెళ్లయిన తర్వాత థామస్ కూడా నిమిషతో కలిసి యెమెన్ వెళ్లారు. అక్కడ ఒక ఎలక్ట్రీషియన్‌కు అసిస్టెంట్‌గా పని చేశారు. అయితే 2012లో నిమిషకు ఒక కూతురు పుట్టాక, యెమెన్‌లో బిడ్డను పెంచడం కష్టమవుతుందని, థామస్ పాపతో కలిసి భారత్‌కు తిరిగి వచ్చేశారు.
రెండేళ్ల తర్వాత, 2014లో ఒక బిజినెస్ పార్టనర్‌తో నిమిష సొంతంగా ఒక క్లినిక్‌ను ప్రారంభించారు. యెమెన్‌లో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలంటే స్థానికులు కచ్చితంగా భాగస్వామిగా ఉండాలి.
నిమిషకు తలాల్ అబ్దో మాహ్ది అనే వ్యక్తి స్థానిక వ్యాపార భాగస్వామిగా ఉన్నారు.
దిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ప్రకారం నిమిష కూతురి బాప్టిజం కోసం భారత్‌కు వచ్చినప్పుడు, మాహ్ది కూడా ఆమెతో వచ్చారు. నిమిష ఇంటికి వెళ్ళినప్పుడు తన పెళ్లి ఫోటోలను మాహ్ది దొంగిలించారు. తరువాత నిమిషాతో తనకి పెళ్లయినట్లు చిత్రీకరించారు.
నిమిషను చిత్రహింసలు పెట్టి, క్లినిక్ ఆదాయం మొత్తం అక్రమంగా తీసేసుకునేవారనే ఆరోపణలు మాహ్ది మీద ఉన్నాయి.
” అంతర్యుద్ధం మొదలైనప్పుడు, భారత ప్రభుత్వం యెమెన్‌కు రాకపోకలు నిలిపేసింది. అప్పటి నుంచి మాహ్ది ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. నిమిషా యెమెన్‌లో క్లినిక్ తెరిచేందుకు అక్కడక్కడ కొన్ని అప్పులు చేశారు. కాబట్టి ఆ దేశాన్ని విడిచి రాలేకపోయింది. కానీ, మాహ్ది మా ఇంటికి వచ్చినప్పుడు మా అందరితో మంచిగా కలిసిపోయాడు. ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు” అని నిమిషా భర్త థామస్ బీబీసీతో చెప్పారు.
మాహ్దికు హానికరమైన మోతాదులో మత్తు మందు ఇచ్చి, తన మృతదేహాన్ని ఛిద్రం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొని, 2017లో నిమిష జైలుకు వెళ్లారు.
నిమిష భర్త ఏం చెబుతున్నారు?
నిమిష భర్త ఇప్పుడు కోచిలో ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు.
‘‘మా అమ్మాయి డిసెంబర్ 27న 13వ పుట్టిన రోజు జరుపుకుంది. అమ్మతో మీరెవరైనా మాట్లాడారా? అని అడుగుతుంది. పాపకు రెండేళ్లు ఉన్నపటి నుంచి వాళ్ల అమ్మని చూడలేదు. చేయని నేరానికి అమ్మ జైలులో ఉందమ్మా అని చిన్నప్పుడు నచ్చచెప్పాం. నేను ఆటో నడుపుతున్నప్పుడు ఆమెను చూసుకునేవాళ్లు లేక పాపను హాస్టల్‌లో చేర్పించాం’’ అని థామస్ చెప్పారు.
‘‘ప్రతి మంగళవారం నిమిషతో పాప మాట్లాడుతుంది. అమ్మ ఎప్పుడు వస్తుంది అనేదే ఆమె మొదటి ప్రశ్న. వాళ్ళమ్మకి ఫోన్ చేయడం మరిచిపోతే నాపై కోప్పడుతుంది. తల్లి ప్రేమను నా కూతురు పొందలేకపోతోంది. పాపకి తల్లి ప్రేమ అవసరం’’ అని ఆయన అన్నారు.
‘‘నిన్న మధ్యాహ్నమే నా భార్యతో మాట్లాడాను. కొద్దిసేపటి తరువాత సాయంత్రం, యెమెన్ అధ్యక్షుడు మరణ శిక్ష ఆమోదం తెలిపినట్లు వార్త తెలిసింది.’’ అని చెప్పారు.
‘‘నిమిష ఫోన్ చేసిన ప్రతిసారీ, పాప ఏం చేస్తుంది? ఎలా ఉంది? అని అడుగుతుంది. ఆమె జైలులో ఉంది. బయట పరిస్థితులేవీ ఆమెకు తెలియవు’’ అని థామస్ అన్నారు.
బాధిత కుటుంబానికి ఇచ్చిన ‘బ్లడ్ మనీ’ ‘సేవ్ నిమిషా ఇంటర్నేషనల్ కౌన్సిల్’ ద్వారా సమకూర్చినవి.
యెమెన్ చట్టాల వల్ల థామస్ కానీ, సేవ్ నిమిష ఇంటర్నేషనల్ కౌన్సిల్ కానీ బాధిత కుటుంబాన్ని నేరుగా ఆశ్రయించలేవు.
‘‘అంతర్యుద్ధం వాళ్ల బాధిత కుటుంబాన్ని కలుసుకోలేకపోయాం. అక్కడ చట్టం ప్రకారం, ఎవరిదైనా ప్రాణం పోతే, దోషికి మరణ శిక్ష తప్పదు. అది అక్కడి వ్యవస్థ. అందుకే స్థానిక నేతలు, షేక్‌లతో మాట్లాడుతున్నాం. మాకు అండగా నిలవాలని కోరుతున్నాం’’ అని థామస్ చెప్పారు.
నిమిష తిరిగొస్తుందన్న ఆశ థామస్‌కు ఇంకా ఉంది.
‘నిమిషను కాపాడగలమని నా మనసు చెబుతోంది’ అని థామస్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS