SOURCE :- BBC NEWS

మొహంజోదారో, హరప్పా నాగరికత, సింధునది

ఫొటో సోర్స్, Alamy

ఒక భారతీయ పురాతత్వ శాస్త్రవేత్త. మేధస్సు, వివాదాలతో నిండిన కెరీర్ ఆయనది. ప్రపంచంలోని గొప్ప చారిత్రక విషయాల్లో ఒకదానిని ఆయన ఆవిష్కరించారు. కానీ, ఇప్పటికే చాలామంది ఆయనను మరిచిపోయారు.

1900ల ప్రారంభంలో రాఖాల్‌ దాస్ బెనర్జీ మొహంజోదారోను గుర్తించారు. సింధీ భాషలో దీన్ని ”శవాల దిబ్బ”గా పిలుస్తారు. ప్రస్తుతం ఇది పాకిస్తాన్‌లో ఉంది. హరప్పా నాగరికతలో ఇది చాలా పెద్ద నగరం. రాగి యుగంలో ఈశాన్య అఫ్గానిస్తాన్ నుంచి వాయువ్య భారత్ వరకు ఇది విస్తరించి ఉంది.

ధైర్యవంతుడైన అన్వేషకుడు, ప్రతిభావంతమైన శిలాశాసన శాస్త్రవేత్త అయిన బెనర్జీ బ్రిటిష్ వలస పాలనలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)లో పనిచేశారు. ఉపఖండంలోని సుదూర ప్రాంతాలకు నెలల తరబడి ప్రయాణిస్తూ, పురాతన కళాఖండాలు, శిథిలాలు, లిపుల కోసం అన్వేషించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

అయితే, మొహంజోదారోను గుర్తించడం సంచలనం సృష్టించినప్పటికీ, బెనర్జీ కెరీర్ అనేక వివాదాలతో నిండిపోయింది. స్వతంత్రంగా వ్యవహరించడం, వలస పాలన ప్రోటోకాల్స్‌ను ధిక్కరించడం తరచూ ఆయనకు సమస్యలు తెచ్చిపెట్టింది. ఆయనకు రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాకుండా చేసింది.

మొహంజోదారో, హరప్పా నాగరికత, సింధు నది

ఫొటో సోర్స్, Getty Images

బెనర్జీకి గుర్తింపు రాకుండా అడ్డుకుంది ఎవరు?

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బెనర్జీ ఆవిష్కరణలను ఏఎస్ఐ ఎప్పుడూ ప్రచురించలేదు. బెనర్జీ ఏదైనా చారిత్రక విషయాన్ని కనుగొన్నప్పుడు, అప్పటి ఏఎస్ఐ అధ్యక్షులు జాన్ మార్షల్ ఆ విషయం బయటకు రాకుండా చేసి, తాను గుర్తించినట్టుగా చెప్పుకునేవారని పురాతత్త్వ శాస్త్రవేత్త పీకే మిశ్రా తర్వాతి కాలంలో ఆరోపించారు.

”శిథిలమైన నాగరికత ఆనవాళ్లను మార్షల్ గుర్తించినట్టు ప్రపంచానికి తెలుసు, విద్యాసంస్థల్లో అదే బోధిస్తారు. బెనర్జీ గుర్తింపు లభించని ఒక ఫుట్‌నోట్‌లా మిగిలిపోయారు” అని ప్రొఫెసర్ మిశ్రా ద టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్‌పేపర్‌కు చెప్పారు.

”లౌక్యం, చాకచక్యం లేకపోవడం, అహంకారం ప్రదర్శించినట్టుగా కనిపించడం వల్ల బెనర్జీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు” అని ”ఫైండింగ్ ఫర్‌గాటెన్ సిటీస్: హౌ ది ఇండస్ సివిలైజేషన్ వాజ్ డిస్కవర్డ్” అనే తన పుస్తకంలో చరిత్రకారిణి నయన్‌జోత్ లాహిరి రాశారు. ఏఎస్ఐలో ఉన్నప్పుడు ఆయనపై వచ్చిన వివాదాలను కూడా ఈ పుస్తకం వెలుగులోకి తెస్తుంది.

మొహంజోదారో, హరప్పా నాగరికత, సింధు నది

ఫొటో సోర్స్, Getty Images

బెనర్జీ చుట్టూ ఉన్న వివాదాలేంటి?

ఓసారి ఈశాన్య భారత్‌లో ఉన్న మ్యూజియం నుంచి తన బాస్‌కు చెప్పకుండా శాసనాలు, చిత్రాలను తీసుకెళ్లడానికి బెనర్జీ ప్రయత్నించారని ఆ పుస్తకంలో ఉంది.

మరోసారి, అవసరమైన అనుమతులు తీసుకోకుండా రాతి శిల్పాలను బెంగాల్‌లోని మ్యూజియం నుంచి తాను పనిచేస్తున్న మ్యూజియంకు తరలించేందుకు ప్రయత్నించారు.

ఇంకోసారి, పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఒక పురాతన పెయింటింగ్‌ను కొంత మొత్తానికి కొన్నారు. ఆ పెయింటింగ్‌కు బెనర్జీ ఎక్కువ ధర పెట్టారని పైఅధికారులు భావించారు.

”బెనర్జీకి ఉన్న అనేక రకాల ప్రతిభల్లో, ఎదుటివారిని తప్పుదారి పట్టించడం కూడా ఉంది” అని లహరి తన పుస్తకంలో రాశారు.

మొహంజోదారో, హరప్పా నాగరికత, సింధునది

ఫొటో సోర్స్, Getty Images

హరప్పా నాగరికతను ఎలా గుర్తించారు?

అయితే, మొహంజోదారోతో ఉన్న సంబంధం కారణంగా.. బెంగాల్‌లోని ప్రపంచ ప్రసిద్ధ చరిత్రకారులు, పరిశోధకుల్లో ప్రముఖ వ్యక్తిగా బెనర్జీ గుర్తుండిపోతారు.

బెంగాల్‌లోని ఓ సంపన్న కుటుంబంలో, 1885లో బెనర్జీ జన్మించారు.

బహరంపూర్ నగరంలో పెరిగి పెద్దయ్యారు. ఆ నగరంలో ఉన్న మధ్యయుగంనాటి స్మారక చిహ్నాలు బెనర్జీపై ప్రభావం చూపాయి. కాలేజ్‌లో ఆయన చరిత్ర సబ్జెక్టు ఎంచుకునేలా చేశాయి. ఆయన ఎప్పుడూ సాహసోపేతంగా ఉండేవారు.

భారత చరిత్రలోని, సిథియన్ కాలం గురించి వ్యాసం రాయాలని చెప్పినప్పుడు ఆ యుగంనాటి శిలలు, లిపుల గురించి తెలుసుకునేందుకు ఆయన పక్కరాష్ట్రంలోని మ్యూజియంకు వెళ్లారు.

1910లో తవ్వకాల సహాయకుడిగా చేరిన ఆయన, 1917 నాటికి పశ్చిమ భారతదేశ సూపరింటెండెండింగ్ పురాతత్వ శాస్త్రవేత్తగా అనతికాలంలోనే ఎలా ఎదిగారో తన పుస్తకం ‘ద లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ రాఖాల్‌ దాస్ బెనర్జీ’లో రచయిత్రి యామా పాండే రాశారు.

ఆ పోస్టులో ఉన్నప్పుడే 1919లో తొలిసారి ఆయన దృష్టి సింధ్‌లోని మొహంజోదారోపై పడింది. ఆ ప్రాంతంలో వరుసగా తవ్వకాలు నిర్వహించారు. ఆ తవ్వకాల్లో బౌద్ధుల స్థూపాలు, నాణేలు, ముద్రలు, కుండలు, సూక్ష్మశిలలు వంటి అద్భుత ఆవిష్కరణలు జరిగాయి.

1922, 1923 మధ్య ఈ ప్రాంతంలో అనేక రకాల పట్టణాలకు సంబంధించిన ఆధారాలున్న రకరకాల శిథిలాల పొరలను ఆయన గుర్తించారు. వాటన్నింటిలో చాలా ముఖ్యమైనది దాదాపు 5,300 ఏళ్ల క్రితం ఉనికిలో ఉన్న ప్రాచీన సింధు లోయ నాగరికత.

ఆ సమయానికి సింధు నాగరికత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉందనే విషయాన్ని చరిత్రకారులు గుర్తించలేదు. సింధు నది లోయ వెంబడి దాదాపు 9,99,735 చదరపు మైళ్ల విస్తీర్ణంలో నాగరికత ఉందని ఇప్పుడు మనకు తెలుసు.

బెనర్జీ తవ్వకాల నుంచి వచ్చిన మూడు ముద్రలు ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న పంజాబ్ ప్రావిన్సులోని హరప్పా చిత్రాలు, లిపిని పోలి ఉంటాయి. రెండు ప్రాంతాలకు ఓ సంబంధం ఏర్పరచడానికి ఇది ఉపయోగపడింది. దీని ద్వారా సింధు నాగరికత విస్తృత పరిధి వెల్లడైంది.

మొహంజోదారో, హరప్పా నాగరికత, సింధునది

ఫొటో సోర్స్, Getty Images

బదిలీకి కారణం అదేనా?

”అయితే 1924 నాటికి పరిస్థితులు మారిపోయాయి. ఈ ప్రాజెక్టు కోసం బెనర్జీకి కేటాయించిన నిధులు అయిపోయాయి. ఆయన్ను తూర్పు భారత్‌కు బదిలీ చేశారు. ఆ ప్రదేశంతోనూ, ఆ తర్వాత అక్కడ జరిపిన ఏ తవ్వకాలతోనూ ఆయనకు సంబంధాలు లేకుండాపోయాయి.” అని పాండే తన పుస్తకంలో రాశారు.

కానీ, తవ్వకాలకు ఆయన పెట్టిన ఖర్చుపై అనేక ప్రశ్నలు వస్తుండడంతో, తనను బదిలీ చేయాలని బెనర్జీనే కోరారని నయన్‌జోత్ లాహిరి రాశారు. ఉద్యోగానికి సంబంధించి చేసిన ఖర్చుల్లో చాలావాటికి ఆయన లెక్కలు చెప్పలేకపోయారు.

తవ్వకాల కోసం కేటాయించిన నిధులను ఆఫీస్ ఫర్నీచర్ కొనడానికి ఉపయోగించారని, ఆయన ప్రయాణ ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయని తేలింది.

ఆయన ఇచ్చిన వివరణ ఉన్నతాధికారులను ఒప్పించలేకపోయింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. కొన్ని సంప్రదింపుల తర్వాత ఆయన విజ్ఞప్తి మేరకు మరో ప్రాంతానికి బదిలీ చేశారు.

తూర్పు భారత్‌లో ఏఎస్ఐ కోసం బెనర్జీ పనిచేశారు. తన సమయంలో ఎక్కువ భాగం ఆయన కలకత్తా(కోల్‌కతా)లో గడిపారు. అనేక ముఖ్యమైన స్మారక చిహ్నాల పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు.

1927లో ఆయన ఏఎస్ఐకి రాజీనామా చేశారు. కానీ, ఆయన రాజీనామా వివాదాలతో ముడిపడి ఉంది. ఏఎస్ఐ నుంచి వెళ్లిపోయే ముందు సంవత్సరాల్లో ఒక విగ్రహం దొంగతనం కేసులో ఆయన ప్రధాన అనుమానితునిగా ఉన్నారు.

మొహంజోదారో, హరప్పా నాగరికత, సింధునది

ఫొటో సోర్స్, Getty Images

రాజీనామా ఎందుకు చేయాల్సివచ్చింది?

”మధ్యప్రదేశ్‌లోని ఒక హిందూ పుణ్యక్షేత్రాన్ని బెనర్జీ సందర్శించినప్పుడు, 1925 అక్టోబరులో ఇదంతా మొదలైంది. ఆ ఆలయంలో బౌద్ధ దేవత రాతి విగ్రహం ఉంది. బెనర్జీ ఆలయానికి వెళ్లినప్పుడు ఆయన వెంట తన కింది ఉద్యోగులు ఇద్దరు, ఇద్దరు సహాయకులు ఉన్నారు” అని లహరి తన పుస్తకంలో రాశారు.

బెనర్జీ పర్యటన తర్వాత, ఆ విగ్రహం కనిపించకుండాపోయింది. ఆ దొంగతనంలో బెనర్జీ ప్రమేయమున్నట్టు వార్తలొచ్చాయి. తనకెలాంటి సంబంధం లేదని ఆయన చెప్పినప్పటికీ, విచారణ మొదలైంది.

తర్వాత ఆ విగ్రహం అప్పటి కలకత్తాలో దొరికింది. బెనర్జీపై కేసు ఎత్తేసినప్పటికీ, ఆయనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని తేలినప్పటికీ, బెనర్జీ రాజీనామాకు మార్షల్ పట్టుబట్టారు.

మొహంజోదారో, హరప్పా నాగరికత, సింధునది

ఫొటో సోర్స్, Getty Images

45 ఏళ్లకే మృతి

ఏఎస్ఐ నుంచి బయటకు వచ్చిన తర్వాత బెనర్జీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. కానీ, తన విలాసవంతమైన జీవనశైలి కారణంగా ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మంచి ఆహారం, గుర్రపు బండ్లు, స్నేహితుల కోసం బెనర్జీ విపరీతంగా ఖర్చు పెట్టారని చరిత్రకారుడు తపతి గుహ-ఠాకుర్తా టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్‌తో చెప్పారు.

ఆయన 1928లో బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. రెండేళ్ల తర్వాత 45 ఏళ్ల వయసులో చనిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)