SOURCE :- BBC NEWS
కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు వాడే సింథటిక్ రంగు ‘రెడ్ డై 3’ని అమెరికా నిషేధించింది.
రెడ్ డై 3 అనేది ఇది ఆహార పదార్థాలకు చెర్రీ పండ్లలాంటి ఎర్రని రంగు కలిగిస్తుంది.
రెడ్ నంబర్ ౩ అని కూడా పిలిచే ఈ సింథటిక్ రంగును లాబొరేటరీలో మగ ఎలుకలపై ప్రయోగించి అధ్యయనం జరిపినప్పుడు అందులో క్యాన్సర్ కారక లక్షణాలు ఉన్నాయని తేలింది.
దీంతో ఇకపై ఈ రెడ్ డై 3 ఉపయోగించరాదని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ప్రకటించింది.
అయితే, ఈ అధ్యయనాల్లో ఉపయోగించే రెడ్ డై పరిమాణం.. సాధారణంగా ఇది ఆహారపదార్థాలు, పానీయాల తయారీలో ఉపయోగించే పరిమాణం కంటే చాలా ఎక్కువ. కానీ, అమెరికా చట్టం ప్రకారం క్యాన్సర్‌కు ఏదైనా లింక్ కనుగొంటే అలాంటి పదార్థాలపై నిషేధం తప్పనిసరి.
రెడ్ డైను ప్రధానంగా మిఠాయిలు, కేకులు, కుకీలు, ఫ్రోజెన్ డెజర్ట్స్, ఫ్రాస్టింగ్‌తో పాటు కొన్ని మందులలో ఉపయోగిస్తారని ఎఫ్‌డీఏ తెలిపింది.
‘సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ పబ్లిక్ ఇంటరెస్ట్’ సహా అనేక గ్రూపులు 2022లో పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడీ రెడ్ డై 3పై నిషేధం విధించారు.
అమెరికాలో వినియోగదారులు.. ప్రత్యేకించి పిల్లలు తినే తినుబండారాలలో దీనిని విస్తృతంగా ఉపయోగించడం వల్ల, క్యాన్సర్‌తో లింక్ ఉన్న ఈ రంగును నిషేధించాలని వారు వాదించారు.
కాస్మొటిక్స్‌లో రెడ్ డై 3 ఉపయోగించకుండా 35 సంవత్సరాల కిందటే అమెరికా నిషేధం విధించింది.
అక్టోబర్ 2023లో కాలిఫోర్నియా రాష్ట్రం ఆహార ఉత్పత్తులలో రెడ్ డై వాడకాన్ని నిషేధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ యూరోపియన్ యూనియన్ దేశాలు ‘రెడ్ డై’పై ఆంక్షలు విధించాయి.
తాజా ఎఫ్‌డీఏ నిషేధాన్ని “చాలా ఆలస్యం” అని ‘సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ ది పబ్లిక్ ఇంటరెస్ట్’ పేర్కొంది. ఇది వినియోగదార మేలు కోసం పనిచేసే లాభాపేక్షలేని సంస్థ.
“లిప్‌స్టిక్‌లో రెడ్ 3 ఉపయోగించడం చట్టవిరుద్ధమని చెప్పిన ప్రభుత్వాలు పిల్లలు తినే మిఠాయిల్లో మాత్రం వాడొచ్చని ఇంతకాలం అనుమతించడం ఆందోళన కలిగించే విషయం” అని సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పీటర్ ఒక ప్రకటనలో అన్నారు.
రెడ్ 3ని ఉపయోగించే ఆహార తయారీదారులకు 2027 జనవరి వరకు.. ఔషధ తయారీ సంస్థలకు 2028 జనవరి వరకు గడువు ఇచ్చారు.
అమెరికాలో దిగుమతి అయ్యే ఆహార పదార్ధాలు కూడా కొత్త నిషేధానికి లోబడి ఉండాలని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది.
నిషేధంపై స్పందించిన అమెరికాలోని నేషనల్ కన్ఫెక్షనర్స్ అసోసియేషన్ (ఎన్‌సీఏ) ఎఫ్‌డీఏ మార్గదర్శకాలను స్వాగతించింది.
“అమెరికాలో మిఠాయి కంపెనీలకు ఆహార భద్రత తొలి ప్రాధాన్యం” అని ఎన్‌సీఏ ఒక ప్రకటనలో తెలిపింది.
రెడ్ డై 3 ని ఎరిత్రోసిన్ అని కూడా పిలుస్తారు. ఇది అనేక క్యాండీలు, బేకరీ ఫుడ్స్, ఫ్రూట్ ఫ్లేవర్డ్ డ్రింక్స్, ఇతర పానీయాలలో ఉపయోగిస్తారు.
దగ్గు సిరప్‌లు, విటమిన్ గమ్మీలు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో కనిపించేందుకు దీన్ని ఉపయోగిస్తారు.
కొంతమంది తయారీదారులు ఇప్పటికే రెడ్ డై 3 ఉపయోగాన్ని నిలిపివేశారు. బదులుగా, కొన్ని కంపెనీలు రెడ్ డై 40ని ఉపయోగించడం ప్రారంభించాయి. ఇది రెడ్ డై 3 కంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణించినా, ఎలుకలపై చేసిన ఓ ప్రయోగంలో జీర్ణ సంబంధిత వ్యాధులకు ఇది కారణం కావొచ్చని తేలింది.
బ్రిటన్ ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ చేసిన మరో అధ్యయనం రెడ్ డై 40 పిల్లలలో హైపర్ యాక్టివిటీకి లింక్ ఉందని పేర్కొంది. గత ఏడాది రెడ్ డై 4౦ ని కాలిఫోర్నియా అక్కడి పాఠశాలల్లో నిషేధించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)