SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Pankaj Nangia/Anadolu Agency via Getty Images
2 గంటలు క్రితం

రోహింజ్యా శరణార్థులను భారత నౌకాదళానికి చెందిన నౌకలో నుంచి మియన్మార్ తీరంలో, బలవంతంగా సముద్రంలో దించేశారనే వాదనలపై దర్యాప్తు చేయనున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.
దీనికి సంబంధించి ఐక్యరాజ్యసమితి గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. గత వారం అండమాన్ సముద్రంలో భారత నౌక నుంచి రోహింజ్యా శరణార్థులను బలవంతంగా దించేసినట్లు వచ్చిన రిపోర్టులపై ఐక్యరాజ్యసమితి ఆ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.
”ఆమోదయోగ్యం కాని ఇలాంటి ఘటనపై” నిపుణుడొకరు దర్యాప్తు ప్రారంభిస్తున్నారని అందులో పేర్కొంది.
అంతకుముందు, రోహింజ్యా శరణార్థులను వారి శిబిరాల వద్ద నుంచి దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి.
అయితే, ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం గానీ, భారత నౌకాదళంగానీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
మరోవైపు, రోహింజ్యా శరణార్థులను బహిష్కరిస్తున్నారనే వాదనలకు సంబంధించిన కేసుపై భారత సుప్రీం కోర్టులో కూడా మే 16న విచారణ జరిగింది. ఈ కేసులో పలు సందేహాలు వ్యక్తం చేసిన న్యాయస్థానం, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.

ఫొటో సోర్స్, YOSHIKAZU TSUNO/Gamma-Rapho via Getty Images
ఐక్యరాజ్యసమితి ఏమంది?
”రోహింజ్యా శరణార్థులను నౌకల నుంచి సముద్రంలోకి నెట్టేయాలనే ఆలోచన దారుణం. ఈ ఘటనలకు సంబంధించి మరింత సమాచారం, సాక్ష్యాలు సేకరిస్తున్నా. ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు అందించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా” అని మియన్మార్‌లో మానవ హక్కుల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితికి నివేదించే ప్రత్యేక ప్రతినిధి థామస్ ఆండ్రూస్ ఒక ప్రకటనలో కోరారు.
“ఇలాంటి క్రూరమైన చర్యలు మానవత్వానికి అవమానం. ఇలాంటి చర్చలు.. వ్యక్తుల జీవితం లేదా స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్న ప్రదేశానికి వారిని తిరిగి పంపడాన్ని అనుమతించని అంతర్జాతీయ చట్టంలోని ప్రాథమిక సూత్ర ఉల్లంఘనకు అద్దంపడతాయి” అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP via Getty Images
అసలేం జరిగింది?
ఈ వ్యవహారం గురించి ఐక్యరాజ్యసమితి వివరాలు తెలియజేస్తూ తన ప్రకటనలో, ”గత వారం దిల్లీలో నివసిస్తున్న రోహింజ్యా శరణార్థులను పదుల సంఖ్యలో భారతీయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో చాలామందికి లేదా అందరికీ శరణార్థుల గుర్తింపు పత్రాలు ఉన్నాయి” అని పేర్కొంది.
”వారిలో దాదాపు 40 మంది కళ్లకు గంతలుకట్టి అండమాన్, నికోబార్ దీవులకు తరలించి, అక్కడి నుంచి భారత నేవీకి చెందిన నౌకలో ఎక్కించారని నివేదికలు చెబుతున్నాయి” అని తెలిపింది.
“అండమాన్ సముద్ర హద్దులు దాటిన తర్వాత, మియన్మార్ భూభాగంలోని ద్వీపానికి ఈత కొట్టుకుంటూ వెళ్లేలా, శరణార్థులకు లైఫ్ జాకెట్లు ఇచ్చి, సముద్రంలో బలవంతంగా దించేసినట్లు నివేదికలు అందాయి.”
సముద్రంలో చిక్కుకున్న శరణార్థులను రక్షించినట్లు ఐక్యరాజ్యసమితి తన ప్రకటనలో పేర్కొంది.
“శరణార్థులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరి, ప్రాణాలతో బయటపడ్డారని సమాచారమందింది. కానీ, వారు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు” అని ఆ ప్రకటనలో తెలిపింది.
భారత అధికారులు అసోంలోని ఒక నిర్బంధ కేంద్రం నుంచి దాదాపు 100 మంది రోహింజ్యా శరణార్థుల బృందాన్ని బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతానికి తరలించినట్లు కూడా ఆ ప్రకటన తెలిపింది. ఈ బృందం ఎక్కడుంది, వారి పరిస్థితి ఏంటనే దానిపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది.
”రోహింజ్యా శరణార్థులపై అమానవీయ చర్యలను భారత ప్రభుత్వం వెంటనే ఖండించాలి, అన్ని బహిష్కరణలను నిలిపివేయాలి. ఇంటర్నేషనల్ కమిట్‌మెంట్స్ ఉల్లంఘనలకు బాధ్యులైనవారిని జవాబుదారులను చేయాలి” అని థామస్ ఆండ్రూస్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీం కోర్టుకు చేరిన కేసు
అసోంలోని మాటియా, గోవాల్పారా డిటెన్షన్ సెంటర్స్ నుంచి రోహింజ్యా శరణార్థులతో సహా విదేశీయులను ఇటీవల సామూహికంగా తరలిస్తున్నారని సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ ఒక నివేదికలో తెలిపింది.
ఈ సంఘటనకు సంబంధించిన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చిందని లైవ్ లా, కోర్ట్‌బుక్ వెబ్‌సైట్స్‌లో ఉంది.
భారత ప్రభుత్వం 43 మంది రోహింజ్యాలను బలవంతంగా మియన్మార్‌కు తిప్పిపంపిందని, వారిని నౌక నుంచి బలవంతంగా అంతర్జాతీయ జలాల్లో దింపేసిందని పిటిషన్ పేర్కొంది. వారిలో పిల్లలు, మహిళలు వృద్ధులు, కేన్సర్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఉన్నారని పిటిషన్‌లో తెలిపింది.
విచారణ సందర్భంగా, పిటిషన్‌లో పేర్కొన్న అంశాలపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటిశ్వర్ సింగ్ సందేహాలు వ్యక్తం చేశారు.
రోహింజ్యాల బహిష్కరణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ వాదనలను కోర్టు తిరస్కరించింది.
మే 8న విచారణ జరిగిన ఇలాంటి మరో కేసును ప్రస్తావిస్తూ, ఆ కేసులో మధ్యంతర ఉత్తర్వులివ్వలేదని తెలిపింది. తక్షణ విచారణ కోసం చేసిన అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరిస్తూ, విచారణను జూలై 31కి వాయిదా వేసింది.
పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది ఐక్యరాజ్యసమితి ప్రకటనను ఉటంకిస్తూ, ఈ విషయంలో త్వరగా జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. “ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టినప్పుడు ఐక్యరాజ్యసమితి నివేదికపై వ్యాఖ్యానిస్తాం” అని కోర్టు పేర్కొంది.
సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రస్తావించిన మే 8 నాటి పిటిషన్‌లో, ఈ దేశ పౌరులు కాని వారికి కూడా ప్రాథమిక హక్కులు వర్తిస్తాయా? లేదా?, ఆర్టికల్ 21 ప్రకారం.. రోహింజ్యా ముస్లింలను బహిష్కరించాలన్న ప్రతిపాదన వారి జీవించే హక్కును ఉల్లంఘిస్తుందా? లేదా? అనేదానిపై సమీక్షించాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)