SOURCE :- BBC NEWS

నాసా, తోకచుక్క, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, బ్రిటన్

ఫొటో సోర్స్, Don Pettit/NASA

ప్రకాశవంతమైన తోక చుక్క ఒకటి లక్షా 60 వేల ఏళ్లలో తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఆకాశంలో కనిపించనుంది.

రానున్న రోజుల్లో ఇది ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తుందో అంచనా వేయడం కష్టమని నాసా తెలిపింది. అయితే ఆ తోకచుక్క (C/2024 G3 అట్లాస్ తోకచుక్క పేరు) నేరుగా కంటితో చూడగలిగేంత ప్రకాశవంతంగా ఉంటుందని వెల్లడించింది.

2025 జనవరి 13న ఈ తోక చుక్క సూర్యుడికి బాగా దగ్గరగా ఉన్న పెరిహెలియన్ వద్ద ఉంది. దీని వల్ల తోక చుక్క కూడా వెలుగులు వెదజిమ్ముతూ కనిపించింది. ఆ రోజు రాత్రి నుంచే ఇది కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

కచ్చితంగా ఎక్కడ కనిపిస్తుందనేది తెలియకపోయినా దక్షిణార్థ గోళంలో ఇది శుక్రగ్రహం మాదిరిగా ప్రకాశిస్తూ కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

నాసాకు చెందిన ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలెర్ట్ సిస్టమ్ ద్వారా ఈ తోకచుక్కను 2024లో గుర్తించారు.

ఈ తోక చుక్కను లక్షా 60 వేల ఏళ్లకు ఒకసారి కనిపిస్తుందని లండన్‌లోని కింగ్స్ కాలేజీలో ఆస్ట్రోపార్టికల్ ఫిజిక్స్ కాస్మోలజీ పరిశోధకుడు డాక్టర్ శ్యామ్ బాలాజీ చెప్పారు.

“స్థానిక పరిస్థితులు, తోకచుక్క గమనాన్ని బట్టి అది పెరిహిలియన్ చుట్టూ ఉన్నప్పుడు” దాన్ని ఆకాశంలో చూసే అవకాశం ఉందని డాక్టర్ బాలాజీ చెప్పారు.

“ఇతర తోకచుక్కల మాదిరిగానే అది కనిపించే తీరు, దాని నుంచి వచ్చే వెలుగును ఊహించలేము” అని ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు

దక్షిణార్ధ గోళంలో నివశించేవారు సూర్యోదయానికి ముందు తూర్పు వైపు, సూర్యాయస్తమం పశ్చిమానికి చూస్తే తోక చుక్క బాగా కనిపిస్తుందని బాలాజీ చెప్పారు.

తోక చుక్క వెలుగులు వెదజిమ్ముతూ కనిపిస్తుందని అంచనా వేసినా, ఆ వెలుగు ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడం కష్టమని బాలాజీ తెలిపారు. ముందుగా ఊహించినంత ప్రకాశవంతంగా కనిపించలేదని అనేక మంది చెప్పారు.

బ్రిటన్‌తో పాటు ఉత్తరార్ధగోళంలో ఉన్న వారు ఈ తోకచుక్కను చూడటం సూర్యుడిని చూసినంత కష్టం.

మీరు ఉన్న ప్రాంతంలో ఆకాశం నిర్మలంగా ఉందా లేదా, అక్కడ నుంచి తోక చుక్క కనిపిస్తుందా, లేదా అనేది బీబీసీ వెదర్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

తోకచుక్కను చూడాలని భావించేవారు కాంతి కాలుష్యం నుంచి దూరంగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని బైనాక్యులర్స్ లేదా చిన్న టెలిస్కోప్ ద్వారా చూడవచ్చని బాలాజీ చెప్పారు.

ఆకాశంలో తోక చుక్క ఎక్కడ కనిపిస్తుందో తెలుసుకునేందుకు, దాన్ని ట్రాక్ చేసేందుకు ప్రయత్నించేవారు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో అప్రమత్తంగా ఉండాలని బాలాజీ హెచ్చరించారు.

తోకచుక్క గమనాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు అనుసరిస్తున్నారు.

నాసా వ్యోమగామి డాన్ పెట్టిట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన తోకచుక్క ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

“కక్ష్య నుంచి తోకచుక్కను చూడటం చాలా అద్భుతంగా ఉంది. అట్లాస్ C2024-G3 మనల్ని చూడటానికి వస్తోంది” అని ఆయన తన సందేశంలో రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)