SOURCE :- BBC NEWS

లాస్‌ ఏంజలెస్‌లో నిరసనలు

అమెరికాలో రెండో అతిపెద్ద నగరమైన లాస్‌ ఏంజలెస్‌లో వలసదారులపై దాడులకు వ్యతిరేకంగా హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో 2 వేల మంది నేషనల్ గార్డ్స్‌ను అక్కడికి పంపినట్లు యూఎస్ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు డోనల్డ్ ట్రంప్ తెలిపారు.

నేషనల్ గార్డ్స్‌ను అక్కడికి పంపాలనే ట్రంప్ నిర్ణయం కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ అధికారాన్ని తోసిపుచ్చుతోంది. ట్రంప్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని గావిన్ విమర్శించారు.

దాడుల్లో భాగంగా గత వారం రోజులుగా నగరవ్యాప్తంగా సుమారు 118 మంది వలసదారుల్ని అరెస్ట్ చేశారు.

దాడులు జరిగినట్లు భావించిన వ్యాపార దుకాణాల వెలుపల నిరసనకారులు గుమిగూడటంతో ఈ హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

నిరసనకారులు తీవ్ర కోపోద్రిక్తులయ్యారని, చేతికి అందిన వస్తువులతో విరుచుకుపడ్డారని, దీంతో హింసాత్మక వాతావరణం చోటు చేసుకుందని లాస్‌ ఏంజలెస్‌ కంట్రీ షెరిఫ్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

ఈ నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బాష్పవాయువును, స్టన్ గ్రనేడ్లను ప్రయోగించారు.

స్థానిక పోలీసులు ఈ నిరసనలను సమర్థంగా అడ్డుకోగలరని భావిస్తున్నట్లు గవర్నర్ న్యూసమ్‌తో పాటు లాస్‌ ఏంజలెస్ మేయర్, కాలిఫోర్నియా కాంగ్రెస్‌వుమెన్ చెప్పారు.

21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని స్థానిక అధికారులు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నేషనల్ గార్డ్స్‌ను అధ్యక్షుడు మోహరించగలరా?

పెరుగుతోన్న అశాంతిని అణచివేసేందుకు అరుదైన సందర్భాల్లో వాడే ‘ఫెడరల్ లా’ను ఉపయోగించి అధ్యక్షుడు ఈ ఆదేశాలు జారీ చేశారు.

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నేషనల్ గార్డ్స్‌ను ఫెడరలైజ్ చేసేందుకు అధ్యక్షుడికి అనుమతి ఉంటుంది.

నేషనల్ గార్డ్స్ అటు రాష్ట్రాలకు, ఇటు ఫెడరల్ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తూ.. హైబ్రిడ్ సంస్థగా ఉంటుంది. గవర్నర్ అభ్యర్థన మేరకు రాష్ట్రంలో నేషనల్ గార్డు దళాలు పనిచేస్తాయి.

కానీ, ఈ కేసులో 10 U.S.C. 12406 పేరుతో ఉన్న యూఎస్ కోడ్ ఆఫ్ ఆర్మర్డ్ సర్వీసెస్‌కు చెందిన ప్రత్యేక మార్గదర్శకాలను ఉపయోగించి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీనిలో మూడు ప్రత్యేక సందర్భాల్లో అధ్యక్షుడు నేషనల్ గార్డ్స్ మోహరించవచ్చని ఉంది.

ఏదైనా దేశం అమెరికాను ఆక్రమించుకున్నా లేదా ఆక్రమించుకునే ప్రమాదం ఉన్నా లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా లేదా తిరుగుబాటు ముప్పు ఉన్నా లేదా అమెరికాలో చట్టాలను అమలు చేసేందుకు అధ్యక్షుడు సాధారణ బలగాలను వాడలేకపోతున్న సందర్భంలో నేషనల్ గార్డ్స్‌ను అధ్యక్షుడు రంగంలోకి దింపేందుకు అనుమతి ఉంటుంది.

లాస్ ఏంజలెస్‌‌లో నెలకొన్న ఉద్రిక్తతలు అమెరికా ప్రభుత్వ అధికారానికి వ్యతిరేకంగా నెలకొన్న తిరుగుబాటుగా నేషనల్ గార్డ్స్ రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు.

లాస్‌ ఏంజలెస్‌లో నేషనల్ గార్డుల పాత్ర.. అక్కడి ఫెడరల్ ఏజెంట్లను అంటే అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను (ఐసీఈ), హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీని కాపాడాలి. వారి పనులను వారు చేసుకోనివ్వాలి.

అయితే, వలసదారులపై ఎలాంటి దాడులను లేదా పౌరులపై ఎలాంటి చర్యలను తీసుకునేందుకు ఈ దళాలకు అనుమతి ఉండదు.

‘ఇన్‌సరెక్షన్ యాక్ట్’ వంటి కొన్ని చట్టాల మినహాయించి పౌర చట్టాల అమలు కోసం ఫెడరల్ దళాలను ఉపయోగించడాన్ని అమెరికా చట్టాలు సాధారణంగా నిషేధిస్తాయి.

నిపుణులు చెప్తున్న ప్రకారం, 1965 నుంచి ఒక రాష్ట్ర గవర్నర్ అనుమతి లేకుండా నేషనల్ గార్డు దళాలను ఉపయోగించడం ఇదే తొలిసారి.

గతంలో బ్లాక్ వాహనదారుడు రాడ్నీ కింగ్‌ను కొట్టిన కేసులో పోలీసు అధికారులు నిర్దోషులుగా విడుదలైన తర్వాత జరిగిన దాడుల సమయంలో లాస్‌ ఏంజలెస్‌కు నేషనల్ గార్డ్స్‌ను పంపించారు.

అప్పుడు కాలిఫోర్నియా గవర్నర్ వీట్ విల్సన్ అభ్యర్థన మేరకు అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

2020లో జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత నెలకొన్న నిరసనల సమయంలో కూడా కొన్ని రాష్ట్రాలకు నేషనల్ గార్డు దళాలను పంపారు.

నిరసనలు

ట్రంప్ ఆదేశాలకు అధికారులు ఎలా స్పందించారు?

నేషనల్ గార్డును మోహరించే అధ్యక్షుడి నిర్ణయానికి ట్రంప్ కార్యాలయంలోని సీనియర్లు మద్దతుగా నిలిచారు. ఇది ‘కామన్ సెన్స్’ అని సోషల్ మీడియా వేదికగా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేథ్ చెప్పారు.

ఫెడరల్ ఏజెంట్లపై, కార్యాలయాలపై హింస, విధ్వంసాన్ని అసలు సహించేది లేదన్నారు.

”నిరసనలు అదుపులో ఉన్నట్లు మీకనిపిస్తున్నాయా? కచ్చితంగా కాదు.” అని ఓక్లహోమా రిపబ్లికన్ సెనేటర్ మార్క్‌వేన్ ముల్లిన్ చెప్పారు.

నగర పోలీసులు ఈ నిరసనలను సమర్థవంతంగా అదుపులోకి తేగలరని, మిలటరీ ప్రమేయం అవసరం లేదని కొందరు కాలిఫోర్నియా అధికారులు చెప్పారు.

నేషనల్ గార్డు పరిస్థితులను మరింత దారుణంగా మారుస్తుందని కాలిఫోర్నియా కాంగ్రెస్‌ సభ్యురాలు నానెట్ బారాగన్ అన్నారు.

” కాలిఫోర్నియా నేషనల్ గార్డ్స్‌ను ఫెడరల్ గవర్నమెంట్ తన నియంత్రణలోకి తీసుకుంది. లాస్‌ ఏంజలెస్‌లోకి 2 వేల మంది సైనికులను పంపుతోంది. ఇక్కడ చట్టం అమలు సరిగ్గా లేదని కాదు. వారు ఒక పరిస్థితిని కోరుకుంటున్నారు.” అని న్యూసమ్ ఎక్స్‌ వేదికగా రాశారు.

లాస్ ఏంజలెస్ మేయర్ సైతం నేషనల్ గార్డ్స్ అవసరం లేదన్నారు.

లాస్ ఏంజలెస్‌లో ఐసీఈ ఏం చేస్తోంది? ఎందుకీ నిరసనలు?

అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపేందుకు లాస్ ఏంజలెస్‌లోని లాటినో ప్రాంతాలపై ఐసీఈ అధికారులు ఎక్కువగా దాడులు నిర్వహించారు.

44 మందిని అరెస్ట్ చేసినట్లు ఐసీఈ బ్రాంచ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ అధికార ప్రతినిధి చెప్పారు.

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టాలని అధ్యక్షుడు పెట్టుకున్న లక్ష్యాలలో భాగంగా ఇవి జరుగుతున్నాయి.

లాస్ ఏంజలెస్‌లో మూడింట ఒక వంతు మందికి పైగా విదేశాల్లో జన్మించినవారే.

మే ప్రారంభంలో లాస్ ఏంజలెస్‌ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమంలో డాక్యుమెంట్లు లేని 239 మంది వలసదారుల్ని అరెస్ట్ చేశారు.

అయితే, ఈ మొత్తం అరెస్ట్‌లు, తరలింపులు ట్రంప్ అంచనాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి.

ఆ తర్వాత నెలలో, రోజుకు కనీసం 300 మందిని అరెస్ట్ చేసేలా ఐసీఈ అధికారులకు వైట్‌హౌస్ లక్ష్యంగా పెట్టింది.

దీంతో, రెస్టారెంట్లు, రిటైల్ దుకాణాలు వంటి పని ప్రదేశాల్లో అధికారులు తమ వెతుకులాటను మరింత పెంచారు.

లాస్‌ ఏంజలెస్‌లో దాడులు హోల్‌సేల్ క్లాతింగ్ సప్లయిర్, హోమ్ డిపోట్ అవుట్‌లెట్ దగ్గర నిరసనలకు దారితీశాయి.

లాస్ ఏంజలెస్‌లో శనివారం ఉద్రిక్తతలు

ఫొటో సోర్స్, Reuters

దాడులకు లాస్ ఏంజలెస్ ఎలా స్పందించింది?

దుస్తుల హోల్‌సేల్ దుకాణం బయట ఫెడరల్ ఏజెంట్లతో నిరసనకారులు ఘర్షణకు దిగారు. ఏజెంట్ల పైకి చేతికి అందిన వస్తువులను విసిరారు.

వలసదారుల్ని అరెస్ట్ చేయకుండా ఫెడరల్ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో, అధికారులు ఫ్లాష్ బ్యాంగ్ గ్రెనేడ్లను, పెప్పర్ స్ప్రేను ప్రయోగించారు.

లాస్ ఏంజలెస్‌కు సుమారు 20 మైళ్ల దూరంలో ఉన్న పారామౌంట్‌లోని ఒక హోమ్ డిపోట్ స్టోర్‌లో నిరసనకారులు మరోసారి గుమిగూడటంతో వారికి వ్యతిరేకంగా బాష్పవాయువును, ఫ్లాష్ బ్యాగులను మోహరించారు.

”ధైర్యవంతులైన అధికారులు చాలా ఎక్కువ మందే ఉన్నారు. కానీ, వెయ్యి మందికి పైగా నిరసనకారులు ఫెడరల్ భవనాన్ని చుట్టుముట్టి దాడి చేశారు.” అని శనివారం జరిగిన ఘటనను వర్ణిస్తూ ఐసీఈ పేర్కొంది. ఆదివారం కూడా ఈ నిరసనలు కొనసాగాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)