SOURCE :- BBC NEWS
అమెరికాలోని లాస్ ఏంజలెస్ ప్రాంతంలో కార్చిచ్చు తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది. పారిస్ హిల్టన్, బిల్లీ క్రిస్టల్, ఆడమ్ బ్రాడీ సహా పలువురు సెలబ్రిటీల ఇళ్లు కాలిపోయాయి.
సినీ తారల బంగ్లాలతో కళకళలాడే ఈ నగరం లోపల, చుట్టూతా ఆరు చోట్ల చెలరేగిన అగ్నికీలలతో వెయ్యికి పైగా నిర్మాణాలు కాలిపోయాయి.
పసిఫిక్ పాలిసాడ్స్‌లోని అందమైన ఎన్‌క్లేవ్‌లో తీవ్ర విధ్వంసం జరిగింది. గాలి తీవ్రంగా వీస్తుండటంతో మంటలు వేగంగా విస్తరించాయి.
శాంటా మోనికా పర్వతాలకు ఎదురుగా ‘స్వర్గధామం’లా ఉండే కొండ ప్రాంతాలు, పసిఫిక్ మహా సముద్రం తీర ప్రాంతాలు బూడిదగా మారాయి.
నిక్సాన్, క్యాసినో వంటి సినిమాల్లో నటించిన నటుడు జేమ్స్ వుడ్స్, పసిఫిక్ పాలిసాడ్స్‌లో ఉన్న ఇంటిని కోల్పోయినట్లు చెబుతూ సీఎన్ఎన్ టీవీలో కన్నీళ్లు పెట్టుకున్నారు.
”ఒక రోజు మీరు పూల్‌లో ఈత కొడతారు. ఆ తర్వాత రోజు అందంతా పోతే, ఎలా ఉంటుందో ఊహించండి..” అంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.
పసిఫిక్ పాలిసాడ్స్‌లో 1979 నుంచి తాము నివసిస్తున్న ఇంటిని కోల్పోవడం వల్ల తమ గుండె బద్ధలైందని నటుడు బిల్లీ క్రిస్టల్ తెలిపారు. తమ పిల్లల్ని, మనవళ్లను ఇక్కడే పెంచామని చెప్పారు.
”మా ఇంట్లో ప్రతి అంగుళం ప్రేమతోనే నిండి ఉంటుంది. మా నుంచి విడదీయలేని ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి” అని బిల్లీ తెలిపారు.
మలిబులో ఉన్న తన ఇల్లు కాలిపోయి, కూలిపోవడాన్ని లైవ్ టీవీలో చూశానని ప్రముఖ వ్యాపారవేత్త పారిస్ హిల్టన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
”ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఎన్నో విలువైన జ్ఞాపకాలను పోగేసుకున్న ఇల్లు ఇది. ఈ కార్చిచ్చు వల్ల ప్రభావితులైన ప్రతి ఒక్క కుటుంబం కోలుకోవాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తాస్తున్నాను” అని ఆమె చెప్పారు.
నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ‘నోబడీ వాంట్స్ దిస్’లో నటించిన ఆడమ్ బ్రాడీ, ఆయన భార్య ‘గాసిప్ గర్ల్’ నటి లైటన్ మీస్టర్ ఇల్లు కూడా ధ్వంసమైనట్లు కథనాలు వచ్చాయి.
‘ది హిల్స్’ నటులు స్పెన్సర్ ప్రాట్, హెడీ మోంటాగ్‌లు కూడా ఈ కార్చిచ్చులో తమ ఇంటిని కోల్పోయారు.
వారి ఇంటి వెనుక మంటలు ఎగిసిపడుతుండటం టిక్‌టాక్‌లో ప్రాట్ పోస్టు చేసిన వీడియోలో కనిపించింది.
”సెక్యూరిటీ కెమెరాల్లో మా ఇల్లు కాలిపోవడాన్ని నేను చూశాను” అని మరో పోస్టులో ఆయన చెప్పారు.
”మా ఇంటికి మంటలు అంటుకున్నాయి. సమయానికి మేం ఆ ఇంటి నుంచి బయటపడ్డాం. కానీ, నేను తీసుకురావాల్సిన వాటి గురించి పదేపదే ఆలోచించాను. మేం సురక్షితంగా బయటపడ్డాం. అదే అత్యంత ముఖ్యమైన విషయం. నా వెనకాలే స్పెన్సర్ ఉన్నారు” అని మోంటాగ్ తెలిపారు.
తమ ఇంటిని కోల్పోయినట్లు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి కొనుక్కున్న వస్తువులన్నీ కోల్పోయామని చెప్పారు.
అమెరికా నటి, గాయని మాండీ మూర్ ఈ విధ్వంసం నుంచి బయటికి వచ్చే సమయంలో తీసిన వీడియోను పోస్టు చేశారు.
”ఆలస్యం కాకముందే నా కుటుంబం, పెంపుడు జంతువులను గత రాత్రే బయటికి రావడం అదృష్టం. (మమ్మల్ని ఈ విపత్తు నుంచి బయటికి తీసుకొచ్చి, బట్టలు, దుప్పట్లు ఇచ్చిన స్నేహితులకు ఎంతో రుణపడి ఉంటాను)” అని చెప్పారు.
”నేను షాక్‌లో ఉన్నాను. నా కుటుంబంతో పాటు చాలా వాటిని నేను కోల్పోయాను. నాకిప్పుడు ఏమీ తోచడంలేదు. నా పిల్లల స్కూల్ కూడా మంటల్లో కాలిపోయింది” అని తెలిపారు.
తన కలల సౌధాన్ని కోల్పోయినట్లు టీవీ హోస్ట్ రికీ లేక్ తన ఫాలోవర్లకు తెలిపారు. ”ఈ పెను విపత్తులో నష్టపోయిన వారందరితో పాటు నేను కూడా బాధను భరిస్తున్నాను” అని చెప్పారు.
నటుడు సర్ ఆంటోనీ హాప్కిన్స్, జాన్ గుడ్‌మాన్, అన్నా ఫరిస్, క్యారీ ఎల్వెస్‌లు కూడా తమ ఇళ్లను ఈ కార్చిచ్చులో కోల్పోయారు.
టాప్ గన్: మావెరిక్‌లో తన పాత్రతో ఎక్కువ ప్రాచుర్యం పొందిన మైల్స్ టెల్లర్, ఆయన భార్య కెలీగ్ స్పెర్రీలు పసిఫిక్ పాలిసాడ్స్‌లో ఉన్న తమ ఇంటిని కోల్పోయినట్లు చెప్పారు.
స్పెర్రీ ఈ విషయాన్ని తెలుపుతూ కార్చిచ్చు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
ఇళ్లను విడిచిపెట్టి వస్తున్న ప్రజలు జంతువుల కోసం గిన్నెలలో నీటిని పెట్టాలని ప్రజలకు చెప్పారు.
కార్చిచ్చు కారణంతో ఇళ్లను విడిచిపెట్టిన వారిలో స్టార్ వార్స్ నటుడు మార్క్ హమిల్ వంటి వారు ఉన్నారు.
కాన్యన్ సమీపంలో పెద్ద ఎత్తున నల్లటి, దట్టమైన పొగ వ్యాప్తించినట్లు స్థానిక మీడియాలో పేర్కొన్నట్లు యూజీన్ లెవీ చెప్పారు.
”నేనెలాంటి అగ్నికీలలను చూడలేదు. కానీ, పొగ మాత్రం చాలా దట్టంగా, నల్లగా ఉంది” అని లాస్ ఏంజలెస్ టైమ్స్‌కు చెప్పారు.
తన ఇల్లు సురక్షితంగానే ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని జేమీ లీ కర్టిస్ చెప్పారు.
”చాలా ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగాయి. మేం ఉండే ప్రాంతంలోని మార్కెట్, నేనెళ్లే షాపు, నా పిల్లల స్కూల్స్ అన్నీ కాలిపోయాయి. నా స్నేహితులందరూ ఇళ్లను కోల్పోయారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రముఖ పాటల రచయిత డియన్ వారెన్ కూడా తమ ఇంటిని కోల్పోయారు. మూడు దశాబ్దాలుగా తనకు ఉన్న ఆస్తిని కోల్పోయినట్లు తన ఇంటి సమీపంలో ఉన్న బీచ్ ముఖద్వారపు ఫోటోను షేర్ చేశారు.
ఫైర్ ట్రక్కులు వెళ్లేందుకు దారి చూపేందుకు కార్లను పక్కకు తీసుకెళ్తూ అగ్నిమాపక సిబ్బందికి సాయం చేశారు స్టీవ్ గుట్టెన్‌బర్గ్.
పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతవాసులు రోడ్లపై వదిలిపెట్టి వెళ్తున్న కార్లకు తాళాలను అక్కడే పెట్టాలని, అప్పుడైతేనే వాటిని అగ్నిమాపక సిబ్బంది తొలగించేందుకు వీలుంటుందని ప్రజలను కోరారు.
ఈ కార్చిచ్చు వల్ల ఆస్కార్ నామినేషన్లు కూడా వాయిదాపడ్డాయి. ఇతర నటీనటుల కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి.
అన్‌స్టాపబుల్, బెటర్ మ్యాన్, వోల్ఫ్‌మాన్ వంటి సినిమా ప్రీమియర్లు రద్దయ్యాయి. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డుల లైవ్ కార్యక్రమం, ఆస్కార్ నామినేషన్స్ వాయిదాపడ్డాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)