SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర, పశ్చిమ భారత్‌లోని మిలటరీ స్థావరాలే లక్ష్యంగా బుధవారం – గురువారం మధ్య రాత్రి పాకిస్తాన్ ”డ్రోన్లు, క్షిపణులను” ప్రయోగించిందని, పాకిస్తాన్ ప్రయత్నాలను తిప్పికొడుతూ వాటిని నేలకూల్చినట్లు భారత్ ఒక ప్రకటనలో తెలిపింది.
పాకిస్తాన్‌లోని ”వేర్వేరు ప్రాంతాల్లో” ఉన్న ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, సిస్టమ్స్ లక్ష్యంగా దాడులు చేసినట్లు భారత్ పేర్కొంది.
”లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను నాశనం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది” అని ఆ ప్రకటనలో తెలిపింది.
అయితే, ఎలా దాడి చేసిందనే వివరాలను భారత్ ఆ ప్రకటనలో పేర్కొనలేదు.


ఫొటో సోర్స్, Getty Images
25 డ్రోన్లను కూల్చేశామన్న పాకిస్తాన్
బుధవారం రాత్రి నుంచి 25 భారతీయ డ్రోన్లను కూల్చేసినట్లు పాకిస్తాన్ ఆర్మీ పీఆర్ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది.
అంతకుముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆ సంఖ్య 12గా చెప్పారు.
అయితే, బీబీసీ వీటిని స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
తీవ్రతరం చేసే ఉద్దేశం లేదు, కానీ: జైశంకర్
పాకిస్తాన్‌తో ”పరిస్థితులను మరింత తీవ్రతరం చేసే ఉద్దేశం” భారత్‌కు లేదని, కానీ ఏదైనా సైనిక దాడి జరిగితే మాత్రం ”ప్రతిస్పందన చాలా చాలా బలంగా ఉంటుంది’’ అని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు.
దిల్లీలో జరిగిన 20వ ఇండియా – ఇరాన్ జాయింట్ కమిషన్ సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీకి స్వాగతం పలికారు.
పహల్గాం దాడి ఘటనను గుర్తుచేస్తూ, ”దుర్మార్గమైన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందిస్తున్న సమయంలో మీరు భారత్ సందర్శిస్తున్నారు” అని జైశంకర్ అన్నారు. ఈ దాడిని పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదుల దాడిగా భారత్ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది.
పాకిస్తాన్, పాకిస్తాన్ పాలిన కశ్మీర్‌పై భారత వైమానిక దాడుల గురించి మాట్లాడుతూ, ”భారత్ నిర్దేశిత స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది” అన్నారు.
”పరిస్థితిన మరింత తీవ్రతరం చేయడం మా ఉద్దేశం కాదు. కానీ, మాపై సైనిక దాడికి పాల్పడితే మాత్రం చాలా చాలా బలమైన ప్రతిస్పందన ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.”
”పొరుగువారిగా, భాగస్వామిగా ఈ పరిస్థితిని మరింత బాగా అర్థం చేసుకోవడం చాలా కీలకం” అని ఇరాన్ విదేశాంగ మంత్రిని ఉద్దేశించి జైశంకర్ అన్నారు.
భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు గతంలో ఇరాన్ ముందుకొచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
మళ్లీ భారత్ దూకుడు: పాక్ ఆరోపణ
ఇస్లామాబాద్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి మాట్లాడుతూ, భారత్ రెండోసారి సైనిక దుందుడుకు చర్యకు దిగిందని అన్నారు. బుధవారం రాత్రి నుంచి భారత్ ప్రయోగించిన 12 డ్రోన్లను పాకిస్తాన్ కూల్చివేసిందని ఆయన తెలిపారు.
రావల్పిండి, లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాలకు సమీపంలో ఇవి జరిగాయని, వాటి ఫలితంగా ఒక పౌరుడు మరణించడంతో పాటు మరొకరు గాయపడ్డారని లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదురి పేర్కొన్నారు. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా శిథిలాలను సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు.
దీనిపై ప్రతిస్పందన కోసం బీబీసీ భారత సైన్యాన్ని సంప్రదించింది.
ఇంతలోనే, కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, సియాల్‌కోట్‌లోని ప్రధాన విమానాశ్రయాలు స్థానిక సమయం సాయంత్రం 6 గంటల వరకూ మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికార ప్రతినిధి తెలిపారు, కానీ అందుకు కారణాలు వెల్లడించలేదు.
ఇకపై ఉద్రిక్తతలు తలెత్తకుండా సంయమనం పాటించాలని భారత్, పాకిస్తాన్‌కు ఐక్యరాజ్యసమితి, అమెరికా పిలుపునిచ్చాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)