SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
17 ఏప్రిల్ 2025, 07:00 IST
వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది.
ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై పలు వ్యాఖ్యలు చేసింది.
ఈ పిటిషన్లపై గురువారం మళ్లీ విచారణ జరుగనుంది.
అలాగే, ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
హిందువులకు చెందిన మతపరమైన ట్రస్టుల్లో ముస్లింలు లేదా హిందూయేతరులకు స్థానం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఈ వ్యవహారంలో ఏవైనా ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు తమ వాదన కూడా వినాలని కోర్టును కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.


ఫొటో సోర్స్, Getty Images
విచారణలో ఏం జరిగింది?
వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తొలిరోజు విచారణ బుధవారం సుప్రీంకోర్టులో జరిగింది.
ఈ విచారణకు పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్, రాజీవ్ ధవన్, అభిషేక్ మను సింఘ్వి వంటి సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు.
వక్ఫ్ సవరణ చట్టంలోని అనేక సవరణలు మతపరమైన వ్యవహారాలకు సంబంధించిన ప్రాథమిక హక్కులను ప్రభావితం చేస్తాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.
అలాగే, వక్ఫ్ బై యూజర్, ఒక ఆస్తి ప్రభుత్వానిదా? కాదా? అని నిర్ణయించే హక్కును ప్రభుత్వ అధికారికి ఇవ్వడం, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌తో పాటు రాష్ట్రాల వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యులను చేర్చడాన్ని కూడా వారు సవాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ చట్టాన్ని సమర్థించారు.
పార్లమెంటులో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో జరిగిన చర్చ సందర్భంగా కూడా ఈ ఆందోళనలన్నీ లేవనెత్తారని, వీటిని కేంద్ర ప్రభుత్వం తమ పరిశీలనలోకి తీసుకుందని ఆయన వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ గురువారం కూడా జరుగనుంది.
దీనికి సంబంధించి బుధవారం సుప్రీంకోర్టు చాలా విషయాలు చెప్పింది.
- ఈ అంశంలో కొన్ని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
- కోర్టు వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేయకూడదు.
- ఒకవేళ ఏదైనా ఆస్తిపై ‘ప్రభుత్వ ఆస్తి’ అనే వివాదం ఉంటే, నియమిత అధికారి ఆ వివాదాన్ని పరిష్కరించేవరకు ఆ ఆస్తిని ‘వక్ఫ్ ఆస్తి’గా పరిగణించలేరనే నిబంధనపై స్టే విధించేందుకు యోచిస్తున్నట్లు తెలిపింది.
- వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమేతర సభ్యులు ఉండాలనే నిబంధనపై కూడా స్టే విధించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
ఈ చట్టానికి ఆమోదం పొందిన తర్వాత జరిగిన హింస ఆందోళనకరమైన అంశమని జస్టిస్ ఖన్నా అన్నారు.
చట్టంలోని సానుకూల అంశాలను తప్పనిసరిగా అందరికీ చెప్పాలని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
పిటిషనర్లు ఎవరు?
ప్రతివాదుల తరఫున చాలామంది న్యాయవాదుల వాదనలు వినలేకపోయినందున, గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేసును మళ్లీ విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.
ఇటీవల పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పదికి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి.
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై పిటిషనర్లు ప్రశ్నలు లేవనెత్తారు.
పిటిషనర్లలో ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, సమస్తా కేరళ జమియతుల్ ఉలేమా సంస్థ, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా ఉన్నారు.
ఈ పిటిషన్లు దాఖలైన తర్వాత, ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ ఆరు బీజేపీ పాలిత రాష్ట్రాలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిలో హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అసోం రాష్ట్రాలు ఉన్నాయి.
ఈ చట్టం రద్దు తర్వాత కలిగే చట్టపరమైన పరిణామాలను పేర్కొంటూ ఈ రాష్ట్రాలన్నీ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS