SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
జీవితంలో ఒక వయసుకు వచ్చాక చాలా మంది పెళ్లి గురించి మాట్లాడడం మొదలుపెడతారు. మంచి లేదా ఉత్తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అదే స్థాయిలో కష్టమైనది కూడా.
ప్రస్తుత కాలంలో ప్రతి విషయం ఇంటర్నెట్ మీద ఆదారపడే జరుగుతోంది. అలాగే, పెళ్లి విషయంలో కూడా చాలామంది సాంకేతికత సాయం తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ మ్యాచ్ మేకింగ్, వెబ్‌సైట్ల ద్వారా భాగస్వామిని ఎంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ లేదా ఆన్‌లైన్ ద్వారా భాగస్వామిని ఎంచుకునే ప్రయత్నంలో కొన్నిసార్లు మోసాలు ఎదురవుతున్నాయి.
కొన్నిసార్లు నకిలీ ప్రొఫైళ్లతో మోసం జరుగుతోంటే, మరికొన్నిసార్లు ట్రాప్‌లో పెట్టి బ్లాక్‌మెయిల్ చేయడం వంటివి జరుగుతున్నాయి.
పెళ్లిచేసుకోవాలనుకుంటున్న అబ్బాయి, అమ్మాయికి సంబంధించిన వివరాలను మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు అందిస్తాయి. సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి ఈ సమాచారం ఉపయోగకరమే. కానీ, వెబ్‌సైట్ నమ్మదగినది కాకపోతే.. మోసానికి అవకాశం ఉంది.
మోసాలకు పాల్పడే స్కామర్లు తప్పుడు సమాచారంతో తమ ప్రొఫైల్స్ క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆన్‌లైన్ ద్వారా భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సైబర్ నేరాలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్న సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ మోసాల నివారణకు కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.


ఫొటో సోర్స్, cybercrime.gov.in

మన ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే ముందు, ఏదైనా మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకునే ముందు, ఆ వెబ్‌సైట్ విశ్వసనీయతను చెక్ చేసుకోవాలి. ఆ వెబ్‌సైట్‌పై యూజర్ల అభిప్రాయాలు కూడా ఇందుకు ఉపయోగపడతాయి.
ఏ వెబ్‌సైట్‌లో మన ప్రొఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నామనే విషయంపై స్నేహితులు, బంధువులు, పెళ్లి సంబంధాలు కుదిర్చే వృత్తిలో ఉన్నవారి సలహాలు తీసుకోవడం వల్ల ఉపయోగముంటుంది.
ఆన్‌లైన్ ద్వారా పెళ్లిసంబంధం కుదుర్చుకున్న వారు ఎవరైనా మీకు తెలిసుంటే, వారి అనుభవాల నుంచి కూడా సమాచారం సేకరించవచ్చు.
సెక్యూర్డ్ వెబ్‌సైట్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం.

ఫొటో సోర్స్, Getty Images

వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా, లేదా మరేదైనా వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలనుకున్నా ఈ మెయిల్ కావాలి. మన ఈ-మెయిల్ ఉపయోగించి ఆ మ్యాట్రిమోనల్ సైట్లలో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
దీనికోసం సాధారణంగా మనం అన్నింటికీ ఉపయోగించే మెయిలే వాడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు మనకు సమస్యలు ఏర్పడతాయి. ఆ మెయిల్ ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మన సమాచారం అంతా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.
కాబట్టి, మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేముందు కొత్త ఈ-మెయిల్ ఓపెన్ చేసుకోవాలి.
మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో కమ్యూనికేషన్ కోసం ఆ కొత్త ఈ-మెయిలే ఉపయోగించాలి.
ఫోటోలు, ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని వీలైతే ఆ వెబ్‌సైట్‌లో షేర్ చేయకపోవడమే మంచిది. మనకు పూర్తిగా నమ్మకం అనిపిస్తేనే అలాంటి సమాచారం షేర్ చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images

వెబ్‌సైట్ ప్రొఫైల్ ద్వారా ఓ వ్యక్తి గురించి సమాచారం తెలిస్తే, తర్వాతి దశకు వెళ్లేముందు ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడం చాలా ముఖ్యం.
ప్రొఫైల్‌లో ఉన్న వ్యక్తి ఇచ్చిన సమాచారం కచ్చితమైనదా, కాదా, ఆ వ్యక్తి నేపథ్యం ఏమిటన్నది చెక్ చేసుకోవడం ముఖ్యం.
ఆ వ్యక్తి పనిచేసే చోటు, కుటుంబం, స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వారి నుంచి సమాచారం సేకరించే ప్రయత్నం చేయాలి.
దీనివల్ల ఆ వ్యక్తి ప్రొఫైల్ నిజమా కాదా అనేది తెలియడమే కాకుండా, ఆ వ్యక్తి గురించి వీలైనంత ఎక్కువ సమాచారం పొందవచ్చు.

ఫొటో సోర్స్, cybercrime.gov.in

ఆన్‌లైన్ ద్వారా భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఆ విషయాన్ని కుటుంబానికి తెలియజేయాలి. వారు తన అనుభవం ఆధారాంగా కొన్ని సూచనలిస్తారు.
మనం ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ కలుసుకోబోతున్నాం అన్నది మన కుటుంబ సభ్యులకు తెలిస్తే, ప్రమాదాలు జరిగే అవకాశాలు బాగా తగ్గుతాయి. అంతేకాకుండా మనకు కావాల్సిన సాయం తక్షణమే అందుతుందన్న భరోసా ఉంటుంది.

ఫొటో సోర్స్, cybercrime.gov.in

ప్రొఫైల్ ఆధారంగా ఓ వ్యక్తి సరిపోతారని మనకు అనిపించినప్పుడు, ప్రాథమికంగా కొంత చర్చ జరిగిన తర్వాత ఒకరినొకరు కలవాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.
మనం కలవబోతున్న వ్యక్తి గురించి ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారం తప్ప మిగిలిన ఏ విషయాలు మనకు తెలియదు. వారి వ్యక్తిత్వం సహా ఇతర విషయాలపై మనకు అవగాహన ఉండదు. కాబట్టి అందరూ ఉండే ప్రాంతంలో కలవడం మంచిది.
మనం ఎవరిని కలవడానికి వెళ్తున్నామన్న సమాచారాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేయాలి.

ఫొటో సోర్స్, cybercrime.gov.in

ఒక వ్యక్తి ప్రొఫైల్ మనకు నచ్చితే, మనకు తగ్గ సంబంధం అనిపిస్తే, ఈ విషయంలో మనకొచ్చే సందేహాలన్నింటినీ ఆ వ్యక్తిని అడగాలి.
ఆ వ్యక్తిని వీలయినంతగా అర్ధం చేసుకోవడానికి చాలా ప్రశ్నలు అడగాలి. అది ఈ మెయిల్ ద్వారా అయినా కావొచ్చు. లేదా కలిసే అవకాశం ఉంటే అప్పుడైనాగానీ.
ఆ వ్యక్తి చెబుతుంది, నిజమా కాదా, ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తున్నారా వంటివి అర్ధం చేసుకోవడానికి వీలయినన్ని ఎక్కువ ప్రశ్నలు అడగడం ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images

మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పరిచయం అయినవారితో మాట్లాడేటప్పుడు, చాటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా అవతలి వ్యక్తి ఏదైనా వ్యక్తిగత సమాచారం గురించి అడుగుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి సమాచారాన్ని ఇవ్వకూడదు. నంబర్, ఈ మెయిల్ ఐడీ, అడ్రస్ వంటివి అవతలి వ్యక్తి అడగొచ్చు. కానీ, అవతలి వ్యక్తికి ఏదైనా విషయాన్ని చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి.
ఆ వ్యక్తి నేపథ్యం, ఇతర విషయాల గురించి పూర్తి సమాచారం లేకుండా మన వ్యక్తిగత సమాచారం చెప్పకూడదు.

ఫొటో సోర్స్, Getty Images

ఆన్‌లైన్ నేరాల్లో ఫోటోలను బ్లాక్‌మెయిలింగ్‌కు, వేధింపులకు క్రిమినల్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఒకరి ఫోటోలను అభ్యంతరకరరీతిలో మార్చి, వాటిని బయటపెట్టి పరువుతీస్తామని బెదిరిస్తుంటారు.
నకిలీ ప్రొఫైల్ ద్వారా ఓ స్కామర్ మనల్ని కాంటాక్ట్ అయినట్టు తెలిస్తే, ప్రైవేట్, సున్నితమైన ఫోటోలను షేర్ చేయకూడదు. వారికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడాలి.
ఈ ఫోటోల ద్వారా బ్లాక్‌మెయిల్ చేసేందుకు క్రిమినల్స్ ప్రయత్నిస్తుంటారు. అభ్యంతరకర రీతిలో మార్చిన ఫోటోలను ఇంటర్నెట్‌లో పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ఫోటోల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images

అలాగే, ఆర్థిక లావాదేవీలు జరపకూడదు. ఎలాంటి డబ్బూ ఇవ్వకూడదు. డబ్బుల విషయంలో మోసానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎవరైనా, ఏదైనా కారణంతో డబ్బులు అడిగితే, వారి వ్యవహారాన్ని కాస్త అనుమానించాల్సిన అవసరం ఉంది. ఏదైనా తేడాగా అనిపిస్తే ఆ వ్యక్తితో తర్వాత జరిగే సంభాషణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇలాంటిది ఏదైనా జరిగితే, ఆ వ్యక్తి గురించి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత మాత్రమే ఏం చేయాలన్నది మీరు నిర్ణయించుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images

జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు మనం మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు, లేదా ఆన్‌లైన్‌లో ఇతర మార్గాలు ఉపయోగిస్తున్నప్పుడు తప్పకుండా ఎన్నారై ప్రొఫైళ్లు కనిపిస్తాయి. కానీ, ఆ ప్రొఫైళ్లలోని వ్యక్తులను కాంటాక్ట్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఆ ప్రొపైళ్లను పరిశీలిస్తున్నప్పుడు, ఆన్‌లైన్ సంభాషణలు జరుపుతున్నప్పుడు హామీలు, వాగ్ధానాలు ఇవ్వడం వంటివి చేయకుండా ఉంటే మంచిది.
పెళ్లి లేదా ఇతర ఏ విషయాలకు సంబంధించిన హామీని ఫేస్ టు ఫేస్ కలవకుండా ఇవ్వకూడదు. ఆ వ్యక్తి కుటుంబం గురించి, బంధువుల గురించి, ఆ వ్యక్తి ఉద్యోగం గురించి పూర్తి సమాచారం సేకరించకుండా ఈ విషయంలో ముందుకు వెళ్లకూడదు.
ఎవరన్నా విదేశాల అడ్రస్, సమాచారం ఇస్తే, అది సరైనదా కాదా అన్నది చెక్ చేసుకోవడం చాలాముఖ్యం.
ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆన్‌లైన్ పార్టనర్‌ని ఎంపిక చేసుకునేప్పుడు మోసాల బారిన పడకుండా తప్పించుకోగలం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)