SOURCE :- BBC NEWS

లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణ, వర్జీనియా జిఫ్రై, ప్రిన్స్ ఆండ్రూ, జెఫ్రీ ఎప్‌స్టీన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రిన్స్ ఆండ్రూ, జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వర్జీనియా జిఫ్రై ఆత్మహత్య చేసుకున్నారని ఆమె కుటుంబం తెలిపింది. ఆమె వయసు 41 ఏళ్లు.

లైంగిక నేరాలకు పాల్పడిన ఎప్‌స్టీన్, ఆయన మాజీ ప్రియురాలు గిస్లైన్ మాక్స్‌వెల్ మీద జిఫ్రై గతంలో అనేక ఆరోపణలు చేశారు.

17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనను డ్యూక్ ఆఫ్ యార్క్‌ ప్రిన్స్ ఆండ్రూ వద్దకు పంపించారని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణల్ని ప్రిన్స్ అండ్రూ తిరస్కరించారు.

“లైంగిక వేధింపులపై పోరాటంలో ఆమె తిరుగులేని యోధురాలు. వేధింపుల వల్ల కలిగిన వేదన ఆమెకు భరించలేనిదిగా మారింది” అని ఆమె గురించి బంధువులు ఒక ప్రకటనలో తెలిపారు

“ఆమె అనేకమంది బాధితుల్ని కాపాడేందుకు ఒక మార్గం చూపించారు. జీవితాంతం లైంగిక వేధింపులు, సెక్స్ ట్రాఫికింగ్ బాధితురాలిగా మిగిలిన ఆమె ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించారు” అని వారు వెల్లడించారు.

వెస్ట్రన్ ఆస్ట్రేలియా రాష్ట్రంలోని తన ఫామ్‌లో ఆమె శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణ, వర్జీనియా జిఫ్రై, ప్రిన్స్ ఆండ్రూ, జెఫ్రీ ఎప్‌స్టీన్

ఫొటో సోర్స్, Getty Images

జిఫ్రై మరణంపై దర్యాప్తు

ఓ ఫోన్ కాల్‌తో తాము ఆమె ఇంటికి చేరుకున్నామని, అక్కడ జిఫ్రై అచేతన స్థితిలో పడి ఉన్నారని వెస్ట్రన్ ఆస్ట్రేలియా పోలీసులు చెప్పారు. “ఆమె మరణం అనుమానాస్పద మృతి కాదు” అని వారు ప్రకటించారు.

అమెరికాలో జన్మించిన జిఫ్రై, భర్త రాబర్ట్, ముగ్గురు పిల్లలతో కలిసి పెర్త్ శివార్లలో ఉండేవారు. 22 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆమె భర్త నుంచి విడిపోయారని తాజా కథనాలు చెబుతున్నాయి.

మూడు వారాల కిందట కారు ప్రమాదంలో తాను తీవ్రంగా గాయపడినట్లు జిఫ్రై తన ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు. అయితే ఈ విషయం అందరికీ చెప్పాలని ఆమె కోరుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ ప్రమాదం అంత తీవ్రమైనది కాదని స్థానిక పోలీసులు తెలిపారు.

“నాకు తెలిసిన అసాధారణమైన వ్యక్తి ఆమె. లైంగిక వేధింపుల నుంచి బయటపడిన అనేకమందికి, బాధితులకు ఆమె మార్గదర్శి లాంటివారు. ఆమెకు జీవితకాలం పాటు ప్రతినిధిగా ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తాను” అని జిఫ్రై రిప్రజెంటిటివ్‌గా పని చేసిన ముఫ్ఫెలింగ్ అన్నారు.

లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణ, వర్జీనియా జిఫ్రై, ప్రిన్స్ ఆండ్రూ, జెఫ్రీ ఎప్‌స్టీన్

ఫొటో సోర్స్, Getty Images

సెక్స్ ట్రాఫికింగ్ బాధితురాలు

తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా వెల్లడించిన తర్వాత ఆమె ఒక ఉద్యమకారిణిగా మారారు. Me Too మూవ్‌మెంట్‌లో పని చేశారు.

తనకు 17ఏళ్లు ఉన్నప్పుడు ఎప్‌స్టీన్, మాక్స్‌వెల్‌లు తనను ప్రిన్స్ అండ్రూ వద్దకు పంపించారని ఆమె ఆరోపించారు. ఆమె ఆరోపణలను తిరస్కరించిన ప్రిన్స్ ఆండ్రూ 2022లో ఆమెతో కోర్టు బయట ఒప్పందం చేసుకున్నారు.

ఈ ఒప్పందంలో భాగంగా ఆయన ఒక ప్రకటన చేశారు.

ఎప్‌స్టీన్‌తో తన స్నేహం గురించి ఈ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. అయితే తాను తప్పు చేసినట్లుగానీ, క్షమాణలు చెప్పడంగానీ ఆయన చేయలేదు.

2000 సంవత్సరంలో జరిగిన బ్రిటిష్ సోషలైట్ కార్యక్రమంలో తాను మాక్స్‌వెల్‌ను కలిశానని, అప్పటి నుంచి ఆమె తనను అమెరికన్ ఫైనాన్షియర్ ఎప్‌స్టీన్‌కు పరిచయం చేస్తానని చెప్పారని, ఎప్‌స్టీన్, ఆయన సహచరులు తనను ఏళ్ల తరబడి లైంగికంగా వేధించారని ఆమె చెప్పారు.

లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణ, వర్జీనియా జిఫ్రై, ప్రిన్స్ ఆండ్రూ, జెఫ్రీ ఎప్‌స్టీన్

ఫొటో సోర్స్, Reuters

జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై కేసు ఏంటి?

ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌కు చెందిన పోలీస్ డిటెక్టివ్ జోసెఫ్ రెకారీ తన వాంగ్మూలంలో 2016లో జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు చెందిన బీచ్‌ఫ్రంట్ కమ్యూనిటీలోని నివాసానికి వెళ్లిన 30 మంది మహిళలు తనతో మాట్లాడారని చెప్పారు.

మసాజ్ చేయడం, పని చేయడం కోసం తాము వెళ్లినట్లు వారు జోసెఫ్‌కు చెప్పారు. వారిని ఆ ఊబిలోకి దించింది మ్యాక్స్‌వెల్ అని కూడా చెప్పారు.

ఆ 30 మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే మసాజ్ చేసిన అనుభవం ఉందని, వారిలో ఎక్కువమంది బాలికలేనని చెప్పారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు అంత భారీ సంఖ్యలో బాలికలను రప్పించడం ఎలా సాధ్యమైంది? అన్న ప్రశ్నకు డిటెక్టివ్ సమాధానం ఇస్తూ, “ఆ నివాసానికి వెళ్లిన ప్రతి బాలికకు ఆమెతో పాటు స్నేహితురాళ్లను కూడా తీసుకురావాల్సిందిగా చెప్పేవారు. అందుకోసం కొంతమందికి డబ్బు కూడా అందేది. మసాజ్ చేయడానికి వెళ్లిన వారితో ఎప్‌స్టీన్ లైంగిక ఆనందం పొందేవారు” అని చెప్పారు.

ఎప్‌స్టీన్‌పైనా, మ్యాక్స్‌వెల్‌పైనా బాధితురాలు వర్జీనియా దాఖలు చేసిన పరువునష్టం కేసులో పేర్కొన్న 150 మందికి పైగా వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచాలనేందుకు ఎలాంటి చట్టబద్ధమైన కారణం కనిపించడం లేదని, కోర్టుకు సమర్పించిన పత్రాలను బ్యాచ్‌ల వారీగా బహిర్గతం చేయాలని న్యాయమూర్తి లొరెట్టా ప్రెస్కా 2023 డిసెంబర్‌లో తీర్పు ఇచ్చారు.

ఆ కేసులో పేర్కొన్న వ్యక్తులు న్యాయపరంగా తమ అభ్యంతరాలను తెలుపుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చని, ఎప్‌స్టీన్‌తో వారి పేరు చెప్పినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదని అన్నారు.

లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణ, వర్జీనియా జిఫ్రై, ప్రిన్స్ ఆండ్రూ, జెఫ్రీ ఎప్‌స్టీన్

ఫొటో సోర్స్, Reuters

ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు..

న్యాయమూర్తి తీర్పులో భాగంగా విడుదల చేసిన పత్రాల్లో ప్రిన్స్ ఆండ్రూతోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ పేరు కూడా ఉంది.

లండన్, న్యూయార్క్, ఎప్‌స్టీన్ ఐలాండ్‌లో ఓ బాలికను ప్రిన్స్ ఆండ్రూ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

తమను లైంగికంగా వేధించాలని ప్రిన్స్ ఆండ్రూ‌కు మ్యాక్స్‌వెల్ చెప్పినట్లు బాధితురాలు ఒకరు వాంగ్మూలంలో చెప్పారు. అయితే, ఈ ఆరోపణలు తప్పని గతంలోనే ఖండించారు ఆండ్రూ.

మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా తనపేరు ప్రస్తావనకు రావడంపై గతంలోనే స్పందించారు. ఎప్‌స్టీన్‌తో తనకు స్నేహం ఉండడంతో ఆయనతో కలిసి ప్రైవేట్ జెట్‌లో ప్రయాణాలు చేశానని, కానీ, ఆయన పాల్పడిన నేరాలు, తప్పుల గురించి తనకు తెలియదని చెప్పారు.

కోర్టు పత్రాల్లో కూడా క్లింటన్‌పై అభియోగాలేవీ లేవు.

2008లో మైనర్‌ను వ్యభిచారంలోకి దించిన ఆరోపణల కేసులో ఎప్‌స్టీన్‌ తన నేరాన్ని అంగీకరించారు. దానితోపాటు సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై విచారణ కొనసాగుతున్న సమయంలో 2019లో ఆత్మహత్య చేసుకున్నారు.

ఆయనకు సహకరించి, మహిళలను ఆ ఊబిలోకి దింపినందుకు గానూ అరెస్టయిన ఆయన మాజీ ప్రియురాలు మాక్స్‌వెల్‌పై నేరారోపణ రుజువు కావడంతో ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.

గమనిక: ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)