SOURCE :- BBC NEWS
- రచయిత, చెరీలాన్ మొలాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
4 జనవరి 2025
స్పాట్‌లైట్‌లో ఒక మహిళ నృత్యం చేస్తూ ఉంది. ఆమె వేసుకున్న డ్రెస్‌పై ఉన్న చమ్కీలు మెరుస్తూ, ఆమె కదలికలకు అనుగుణంగా ఊగుతూ ఉన్నాయి.
కానీ, ఆమె చేతులు మాత్రం పైనుంచి పడుతున్న వెలుగును ఆకర్షించేలా, ఫ్యాన్ రెక్కల కంటే వేగంగా కదులుతున్నాయి.
ఇవి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల విడుదలైన ‘వాక్ గర్ల్స్’ వెబ్ సిరీస్‌లోని ప్రారంభ దృశ్యాలు.
తమ నగరంలో మొట్టమొదటి మహిళా వాకింగ్ బృందంగా మారడానికి ఒక కొత్త నృత్యాన్ని నేర్చుకునే ఆరుగురు మహిళల చుట్టూ ఈ డ్రామా నడుస్తుంది.
చాలామందికి ఈ డాన్స్ గురించి తెలియదు. అందుకే, దీనికోసం ఈ మహిళలు సమాజాన్ని, తమ కుటుంబాన్ని ఎదిరించి గట్టిగా పోరాడాలనుకుంటారు. ఈ డాన్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. కానీ, వాకింగ్ అనేది ఒక గిఫ్ట్. దీన్ని ఇస్తూనే ఉండాలి.
వాకింగ్‌పై భారత్‌లో చిన్న, పెద్ద నగరాలన్ని మళ్లీ ఆసక్తి కనబరుస్తోన్న సమయంలో ఈ సిరిస్ విడుదలైంది. దీనికి సూని తారాపొరేవాలా దర్శకత్వం వహించారు.
”ఆ నృత్య శైలికి, స్వీయ వ్యక్తీకరణకు ఇది ఇచ్చే ప్రాధాన్యతకు నేను ముగ్దురాలినయ్యాను.” అని ఈ సిరీస్‌ను ఎందుకు తీశారో తెలుపుతూ తారాపొరేవాలా చెప్పారు.
వాకింగ్ డ్యాన్స్ కోసం వర్క్‌షాపులు, అండర్‌గ్రౌండ్ వాకింగ్ జామ్‌లు, ఈ నృత్య కదలికలను నేర్చుకునేందుకు డ్యాన్సర్ల కోసం పలు ఈవెంట్లు నగరాల్లో పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి.
ఈ డ్యాన్స్‌ను నేర్పించేందుకు అంతర్జాతీయంగా ఉన్న వాకింగ్ లెజెండ్లు సైతం భారత్‌కు వస్తున్నారు.
1970, 80ల్లో న్యూయార్క్‌లో క్లబ్ డ్యాన్సర్‌గా పని చేసిన ఆర్చీ బర్నెట్, వాకింగ్ జామ్ కోసం భారత్‌కు వచ్చారు. ఈయన్ను వాకింగ్ కమ్యూనిటీలో గౌరవప్రదమైన వ్యక్తిగా పరిగణిస్తారు.
దేశంలో వాకింగ్‌కు ఈ వెబ్ సిరీస్ మరింత ఆసక్తిని, విజిబిలిటీని అందిస్తుందని, క్లాసికల్, హిప్-హాప్, బాలీవుడ్‌లతో పోలిస్తే ఈ డ్యాన్స్‌కు మరింత ఆదరణ ఉందనడానికి ఇది ఉదాహరణ అని డ్యాన్సర్లు భావిస్తున్నారు.
ఎల్‌జీబీటీక్యూ ప్లస్ విమోచన ఉద్యమంలో, డిస్కో మ్యూజిక్ ద్వారా స్వాతంత్య్రం పొందిన చరిత్ర వాకింగ్‌కు ఉంది. హోమోసెక్సువాలిటీ విషయంలో ఎన్నో అపోహలు ఉన్న సమయంలో, 1970ల్లో లాస్ ఏంజెలెస్‌కు చెందిన గే క్లబ్‌లలో ఈ నృత్య రూపం ఉద్భవించింది.
నృత్య వేదికపై తమల్ని తాము చూపించుకునేందుకు గే పురుషులు వాకింగ్‌ను ఆయుధంగా వాడారు. వారు తాము ఎదుర్కొన్న ద్వేషాన్ని, వివక్షను ఈ డ్యాన్స్ ద్వారా గట్టిగా ప్రతిఘటించారు.
అందుకే, ఈ నృత్య శైలి చాలా వేగంగా, శక్తిమంతమైన కదలికలతో ఉంటుంది. అచ్చం కామిక్ బుక్‌లలో యాక్షన్ హీరోలు విలన్లను కొట్టే మాదిరి. ‘కా-పౌ’, ‘బామ్’ వంటి శబ్దాలు కూడా ఈ నృత్యానికి తోడయ్యాయి.
”వాకింగ్ అనేది ‘వాక్'(Waack) అనే ఒనోమాటోపోయిక్ పదం నుంచి వచ్చింది. దీని ఎఫెక్ట్స్‌ను కామిక్ బుక్‌లలో గుర్తించవచ్చు” అని దశాబ్దానికి పైగా వాకింగ్‌పై అధ్యయనం చేస్తోన్న ముంబయికి చెందిన డ్యాన్సర్ తేజస్వి పాటిల్ చెప్పారు.
హాలీవుడ్ డ్రామాలు, వాటిలో ప్రముఖ పాత్రలు పోషించిన మహిళల గ్లామర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ నృత్య శైలి రూపొందింది.
నాటకీయ భంగిమలు, వేగంగా కాళ్లను కదపడం, ఆకర్షణీయంగా చేతులను కదపడం వంటివి వాకింగ్ నృత్యానికి ఉన్న లక్షణం. కానీ, దీనికి కొత్త కొత్త కదలికలను డ్యాన్సర్లు కలుపుకుంటూ వచ్చారు. స్వతంత్రత, స్వీయ వ్యక్తీకరణ అనేవి ఈ నృత్యానికి కేంద్ర బిందువులు.
ఈ కీలకమైన నైతికత ఆధారంగానే, భారత ఎల్‌జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీ సాధికారత, స్వీయ వ్యక్తీకరణకు వాకింగ్ అనేది ఒక సాధనంగా కొనసాగుతోంది.
”వాస్తవంగా, నృత్య శైలి ద్వారానే చాలామంది వారి సెక్సువల్ ఐడెంటిటీని అన్వేషిస్తూ ఉంటారు. ఎందుకంటే, ఆత్మశోధన, వ్యక్తీకరణకు ఇది ఒక స్థానం కల్పిస్తుంది.” అని 2012 నుంచి వాకింగ్ నృత్యాన్ని ప్రాక్టీస్ చేస్తోన్న ఆయుషి అమృతే చెప్పారు. రెడ్ బుల్‌కు చెందిన ‘యువర్ హౌస్ ఈజ్ వాక్’ కి తరచూ హోస్ట్‌గా చేస్తుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న డ్యాన్సర్లకు ఇదొక వాకింగ్ జామ్.
”మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వాకింగ్ కమ్యూనిటీ ఎప్పుడూ ఒక సురక్షితమైన ప్లేస్ కోసం చూస్తుంది. దీంతో, ప్రజలు సౌకర్యవంతంగా వారి అభిప్రాయాలను వ్యక్తపరచగలరు” అని అమృతే చెప్పారు.
తన డ్యాన్స్ టీచర్ వాకింగ్‌ను అమృతేకి పరిచయం చేసినప్పుడు, భారత్‌లో ఈ నృత్య శైలి గురించి ఎవరికీ తెలియదు. ఈ డ్యాన్స్ వీడియోలను చూడాలని, దీని గురించి మరింత తెలుసుకునేందుకు విదేశాల్లో ఉన్న డ్యాన్సర్లను కలవాలని తన టీచర్ తనని ప్రోత్సహించేవారని అమృతే తెలిపారు.
”దశాబ్దం కింద వాకింగ్‌ను ప్రారంభించిన భారతీయ డ్యాన్సర్లమైన మేము, వాకింగ్‌ను చాలా కష్టపడి నేర్చుకున్నాం. సొంతంగా ఈ నృత్యంపై పరిశోధన చేశాం. డ్యాన్స్ చరిత్రను తెలుసుకున్నాం. వాకింగ్ ఎక్కడ పాపులర్ అయ్యిందో ఆ దేశాల్లోని డ్యాన్సర్లను కలుసుకుని, వారితో మాట్లాడాం” అని అమృతే చెప్పారు.
ఇదే విధంగా వాకింగ్‌ను నేర్చుకోవడాన్ని పాటిల్ కూడా గుర్తు చేసుకున్నారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గత ఐదేళ్లలో ఈ నృత్య శైలి చాలా పాపులారిటీ సంపాదించుకుంది. మరింత మంది యువత దీన్ని నేర్చుకునేందుకు క్లాస్‌లకు వస్తున్నారు.
ఇక సంగీతం విషయానికి వస్తే, భారత్ ఇప్పటికీ ఒక శైలి కోసం తన సౌండ్‌స్కేప్‌ను కనుగొంటోందన్నారు. డిస్కో క్వీన్ డోనా సమ్మర్, అమెరికన్ పాప్ లెజెండ్ డయానా రోజ్ పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. అలాగే, 1983కు చెందిన స్టేయింగ్ అలైవ్‌కు చెందిన ట్రాక్స్ కూడా ఉన్నాయి.
బాలీవుడ్‌కు కూడా సొంతంగా డిస్కో కాలం ఉంది. కోయి యహా అహ నాచే నాచే, ఆప్ జైసా కోయి వంటి పాటలు 1980ల్లో ఎక్కువగా వినే పాటల జాబితాలో ఉండేవి. కానీ, నేటి వాకింగ్ జామ్స్‌లలో వాటికి పెద్దగా చోటు దక్కడం లేదు.
వాక్ గర్ల్స్ సిరీస్ కోసం సొంతంగా సౌండ్‌ట్రాక్‌ల ఆల్బమ్‌ను రూపొందించేందుకు ఇండి ఆర్టిస్టులను తీసుకొచ్చారు తారాపొరేవాలా. ఇండి ఆర్టిస్టులంటే.. ఎలాంటి మేజర్ రికార్డు లేబుల్‌తో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా మ్యూజిక్‌ను రికార్డు చేసుకుని, ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్ చేసుకునే వారు.
వీరు భారత్‌లో వాకర్లకు సరికొత్త, ఆశాజనకమైన సౌండ్‌స్కేప్‌ను రూపొందించారని పాటిల్ చెప్పారు.
”ప్రజలు మిమ్మల్ని మీరు పూర్తిగా స్వీకరించేందుకు ఇదే సరైన సమయం. మీరు కనుగొన్న దాన్ని చూపించేందుకు వాకింగ్ అనేది సరైన వేదిక” అని పాటిల్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS