SOURCE :- BBC NEWS
”వెళ్లిపోతున్నాం.. మీరందరూ జాగ్రత్త. ఎవరూ ఏడవొద్దు, నేను పోయిన తర్వాత” అంటూ వీడియో తీసుకుని, దానిని వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేసి తమ వివాహ వార్షికోత్సవం రోజునే, పెళ్లిబట్టలు ధరించి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మార్టిన్ నగర్‌కు చెందిన జెరీల్, యానీ దంపతులు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగం లేకపోవడంతో పాటు పిల్లలు లేరన్న తీవ్ర నిరాశతో ఈ జంట బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు.
అసలు ఏం జరిగిందనే విషయాలను పరిశీలిస్తే..
అసలేమైంది?
జెరీల్ అలియాస్ టోనీ ఆస్కర్ మాన్‌క్రిప్, ఆయన భార్య యానీ జెరీల్ మాన్‌క్రిప్ జనవరి 6న తమ 26వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. 54 ఏళ్ల జెరీల్, 45 ఏళ్ల యానీ తమ పెళ్లిబట్టలు ధరించారు.
పోలీసుల కథనం ప్రకారం, జనవరి 7వ తేదీ ఉదయం 5.45 గంటల ప్రాంతంలో బంధువులను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఆ వీడియో చూసి ఇంటికి సమీపంలోనే ఉంటున్న బంధువులు వెంటనే వారి ఇంటికి వెళ్లి చూడడంతో ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది.
7వ తేదీ ఉదయం సుమారు 7.30 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
”జెరీల్ మృతదేహం వంటగదిలో వేలాడుతూ కనిపించింది. ఆయన భార్య యానీ మృతదేహం ఇంట్లో మంచంపై తెల్లటి వస్త్రంలో చుట్టి ఉంది. ఆమె శవంపై పూలు పెట్టి ఉన్నాయి. మొదట జెరీల్ భార్య యానీ ఉరి వేసుకుని చనిపోయిన తర్వాత, ఆమె మృతదేహాన్ని తెల్లని వస్త్రంలో చుట్టి మంచంపై పడుకోబెట్టి, మృతదేహంపై పూలు పెట్టి, ఆ తర్వాత జెరీల్ ఆత్మహత్యకు పాల్పడ్డారని అనిపిస్తోంది” అని పోలీసులు తెలిపారు.
వారి ఇంట్లో సూసైడ్ నోట్‌తో పాటు స్టాంప్ పేపర్, 75 వేల రూపాయల నగదును పోలీసులు గుర్తించారు. తమ అంత్యక్రియల కోసం ఈ నగదు సిద్ధం చేసి ఉంచినట్లు సూసైడ్ నోట్‌లో ఉంది.
తాము చనిపోయిన తర్వాత, తమ ఇల్లు ఎవరికి చెందాలనుకుంటున్నారో ఆ స్టాంప్ పేపర్‌పై రాసి ఉంది.
వివాహ వార్షికోత్సవం రోజునే భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడడం కాలనీ వాసులను షాక్‌కి గురిచేసింది.
ఆత్మహత్యకు కారణమేంటి?
సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ క్షీరసాగర్ బీబీసీతో మాట్లాడుతూ, ”జెరీల్, యానీ ఇంట్లో సూసైడ్ నోట్ దొరికింది. అందులో ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలేవీ రాయలేదు. తమ మీద ఎలాంటి ఒత్తిడి లేదని, తామే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉంది” అని చెప్పారు.
అయితే, పెళ్లై ఇన్నేళ్లవుతున్నా పిల్లలు లేకపోవడంతో జెరీల్, యానీ డిప్రెషన్‌లో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
యానీ ఆరోగ్యం అంత బాలేదు. ఏడాదిన్నర కిందట ఆమెకు ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో గర్భాశయాన్ని తొలగించారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదు.
అందువల్ల జెరీల్, యానీ ఆత్మహత్య నిర్ణయానికి వచ్చి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు బీబీసీతో చెప్పారు.
జెరీల్ గతంలో ఒక హోటల్‌లో పనిచేసేవారు. ఆయన భార్య ఇంటిపనులు చూసుకునేవారు. కొన్నేళ్లుగా జెరీల్ ఉద్యోగానికి కూడా వెళ్లడం లేదని, ఖాళీగానే ఉంటున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
అసలు ఆ ఆలోచనలు ఎందుకొస్తాయి?
ఆత్మహత్య చేసుకునే కొన్ని వారాల ముందు తమకు దగ్గరి వారితో తమకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని సదరు వ్యక్తులు చెబుతుంటారని ఆత్మహత్యలపై జరిగిన అధ్యయనాల్లో వెల్లడైంది.
ఇలా ఎవరికైనా జరగొచ్చు. దీని వెనుక మూడు రకాల కారణాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
వీటిలో మొదటిది శరీరానికి సంబంధించిన కారణాలు. అంటే, మెదడులో సెరెటోనిన్ లాంటి హార్మోన్లు పెరగడం వల్ల ఈ ఆలోచనలు వస్తుంటాయి.
ఇక రెండోది మానసిక కారణాలు. ఇవి సదరు వ్యక్తి వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటాయి. మూడోది సామాజిక కారణాలు.
ఈ మూడు రకాల కారణాలు విడివిడిగా ఉండవు. ఇవన్నీ కలిసే ఆత్మహత్యలు చేసుకునేలా సదరు వ్యక్తులను ప్రేరేపిస్తుంటాయి.
ఆ ఆలోచనలు ఉన్నవారిని ఎలా గుర్తించాలి?
ఆత్మహత్య గురించి పదేపదే మాట్లాడుతుండటం, తనకు తాను హాని కలిగించుకునేందుకు ప్రయత్నించడం, తీవ్ర ఒత్తిడితో చికాకు పడుతుండటం, ఒంటరి తనాన్ని ఇష్టపడటం, నిరాశా నిస్పృహలు, ప్రతి విషయం గురించీ ప్రతికూలంగా ఆలోచించటం, నిద్రపోకుండా ఉండటం, చేసే ప్రతి పనిపట్లా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం.. ఇలాంటి మార్పులు ఒక వ్యక్తిలో కనిపిస్తే, అతను/ఆమె ఆత్మహత్య గురించి ఆలోచనలు చేస్తుండొచ్చని భావించాలి.
మాట్లాడడం చాలా ముఖ్యం..
“ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించే వారితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అన్నది ముఖ్యం కాదు. వారితో ఎంత తొందరగా సంభాషణ ప్రారంభించామన్నదే అత్యంత ముఖ్యం” అని రీథింక్ యూకే సంస్థ ప్రతినిధి ఎమ్మా క్యారింగ్టన్ బీబీసీతో చెప్పారు.
ఇలాంటి వారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు నిరంతరం ధైర్యం చెప్పాలని, వారితో తరచూ మాట్లాడుతూ ధైర్యం చెబుతుండాలని ఎమ్మా సూచిస్తున్నారు.
ఆత్మహత్య ఆలోచనతో ఉన్నవారితో ఎలా మాట్లాడాలి?
ప్రదేశం ఏదైనా సరే, నిశ్శబ్దంగా ఉన్న చోట, అవతలి వ్యక్తికి సౌకర్యవంతంగా అనిపించే చోట మాట్లాడండి.
మీ ఇద్దరికీ మాట్లాడుకునేందుకు తగినంత సమయం ఉందని ముందుగా నిర్ధారించుకోండి.
మీరు ఏదైనా తప్పుగా మాట్లాడినా భయపడొద్దు.
ఎదుటి వ్యక్తి కళ్లలో కళ్లు పెట్టి స్నేహపూర్వకంగా మాట్లాడండి.
మీరు పూర్తిగా ఆ సంభాషణ మీదే దృష్టి పెట్టాలి. కాబట్టి, మీ ఫోన్‌ను దూరంగా పెట్టండి.
ఎక్కువసేపు ఓపికగా వినండి. ఎందుకంటే, ఆ వ్యక్తి తన మనసు విప్పి చెప్పేందుకు కాస్త ఎక్కువ సమయం పట్టొచ్చు.
అవును లేదా కాదు అనే సమాధానాలు వచ్చేలా ఎక్కువగా ప్రశ్నలు అడగండి. వాళ్ల సమస్య మీకు అర్థమైందో కాలేదో చూసుకోండి.
ఆ వ్యక్తి మాట్లాడుతుంటే మీరు మధ్యలో అంతరాయం కలిగించొద్దు.
వారికి మానసిక నిపుణుల కౌన్సెలింగ్ అవసరమా? లేక ఇంట్లోనే వారి ఆలోచనలను మార్చొచ్చా? అన్నది గుర్తించండి.
ముఖ్య గమనిక..
మెడిసిన్, థెరపీతో మానసిక సమస్యలకు చికిత్స ఇస్తారు. దీని కోసం సైకియాట్రిస్ట్ నుంచి సాయం తీసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ హెల్ప్‌లైన్లను సంప్రదించవచ్చు.
- కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ – 1800-599-0019 (13 భాషల్లో అందుబాటు)
- హ్యుమన్ బిహేవియర్, అలయిడ్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ – 9868396824, 9868396841, 011-22574820
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 080 2699 5000
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరోసైన్స్ – 080 – 26995000
- హిట్‌గుజ్ హెల్ప్‌లైన్, ముంబయి – 022- 24131212
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)