SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, @realDonaldTrump/Truth Social
సంపన్న విదేశీయులకు వేగంగా అమెరికా వీసాలను అందించే పథకాన్ని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రారంభించారు. ఈ వీసా పొందేందుకు 1 మిలియన్ డాలర్లు అంటే, భారత కరెన్సీలో దాదాపు 9 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కార్డు “అర్హత కలిగిన, అన్ని రకాల వెరిఫికేషన్లు పూర్తయిన వారికి నేరుగా అమెరికా పౌరసత్వం పొందే మార్గం. చాలా ఉత్సాహకరం, మన గొప్ప అమెరికన్ కంపెనీలు తమ అమూల్యమైన ప్రతిభను నిలుపుకోగలవు” అని ట్రంప్ బుధవారం సోషల్ మీడియాలో రాశారు.
ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన ది ట్రంప్ గోల్డ్ కార్డ్ అమెరికాకు “భారీ ఎత్తున ప్రయోజనం” కలుగుతుందని నిరూపించుకోగలిగిన వారికి ఇచ్చే వీసాగా ఈ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.
వర్క్ వీసా ఫీజుల పెంపు, ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని తిప్పిపంపడం వంటి వలస నియంత్రణ చర్యలను తీవ్రతరం చేస్తున్న సమయంలో ఈ స్కీమ్‌ను ప్రకటించారు.

గోల్డ్ కార్డ్ స్కీమ్ కింద “రికార్డు సమయం”లో అమెరికాలో నివాస హక్కు లభిస్తుందని, అందుకోసం 1 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని, “ఇది ఆ వ్యక్తి అమెరికాకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుస్తారనేందుకు సాక్ష్యం” అని వెబ్‌సైట్ పేర్కొంది.
కంపెనీలైతే ఉద్యోగుల కోసం 2 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 18 కోట్ల రూపాయాలు చెల్లించాల్సి ఉంటుంది. దానితో పాటు అదనపు ఫీజులు కూడా ఉంటాయి. ప్రత్యేక పన్ను రాయితీలు కల్పించే “ప్లాటినం” వెర్షన్ త్వరలో 5 మిలియన్ డాలర్లకు(సుమారు రూ.45 కోట్లు) అందుబాటులోకి వస్తుందని వెబ్‌సైట్ తెలిపింది.
ప్రభుత్వ అదనపు ఫీజులు వ్యక్తిని బట్టి మారొచ్చు. అలాగే దరఖాస్తు పరిశీలనకు ముందు నాన్‌రీఫండ్ కింద 15,000 డాలర్లు ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఫొటో సోర్స్, Getty Images
ఫిబ్రవరి మొదట్లో ఈ గోల్డ్ కార్డ్ స్కీమ్ ప్రకటించినప్పటి నుంచి దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఇది అన్యాయమైనదిగా, సంపన్నులకు అనుకూలమైనదిగా కొందరు డెమోక్రాట్లు పేర్కొన్నారు.
ఈ వీసాలు కూడా వివిధ ఆదాయ స్థాయిలు కలిగిన వలసదారులకు అమెరికాలో శాశ్వత నివాసం, పనిచేసుకునే అవకాశం కల్పించే గ్రీన్ కార్డుల వంటివేనని ఈ స్కీమ్ ప్రకటించిన సమయంలో ట్రంప్ అభివర్ణించారు. సాధారణంగా, గ్రీన్‌కార్డులు పొందిన వారు ఐదేళ్లకు అమెరికా పౌరసత్వానికి అర్హలవుతారు.
కానీ, ఈ గోల్డ్ కార్డ్ లక్ష్యం “హై లెవెల్ ప్రొఫెషనల్స్” అని ట్రంప్ చెప్పారు. “మాకు ఉత్పాదకత పెంచేవారు కావాలి” అన్నారు.
“5 మిలియన్ డాలర్లు చెల్లించగలిగేవారు ఉద్యోగాలను సృష్టించగలరు. అవి బాగా అమ్ముడవుతాయి. ఇదో మంచి ఒప్పందం” అని ట్రంప్ అన్నారు.
అయితే, ఈ స్కీమ్ అక్రమ వలసదారులను దేశం నుంచి తిప్పి పంపించేందుకు గణనీయంగా నిధులు వెచ్చిస్తున్న సమయంలో వచ్చింది.
గత సెప్టెంబర్‌లో హెచ్ 1బీ వీసా ఫీజులను లక్ష డాలర్లకు పెంచుతూ అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నిర్ణయం అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, టెక్ కంపెనీలకు ఆందోళన కలిగించింది. ఆ తర్వాత, ఈ పెంచిన ఫీజు ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS







