SOURCE :- BBC NEWS

పహల్గాం, కాల్పులు, వినయ్ నర్వాల్

ఫొటో సోర్స్, Arranged

47 నిమిషాలు క్రితం

పహల్గాం కాల్పుల్లో భారత నేవీకి చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చనిపోయారు.

ఏప్రిల్ 16న వినయ్‌కు వివాహమైంది. ఈ నెల 19న రిసెప్షన్ జరిగింది. హనీమూన్ కోసం ఆయన కశ్మీర్ వెళ్లారు.

”పెళ్లి తర్వాత వినయ్ స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్నారు. వీసా రాకపోవడంతో కశ్మీర్ వెళ్లారు” అని ఆయన తాత హవా సింగ్ నర్వాల్ చెప్పారు.

హరియాణాలోని కర్నాల్ జిల్లాకు చెందిన వినయ్ రెండేళ్ల కిందట నేవీలో చేరారు. కోచీలో ఆయన ఉద్యోగం చేస్తున్నారని బీటెక్ పూర్తయిన తర్వాత ఆయన నావికాదళంలోకి వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
పహల్గాం, కాల్పులు, వినయ్ నర్వాల్

ఫొటో సోర్స్, indiannavy

హనీమూన్‌కు వెళ్లిన మరుసటి రోజే మృతి

”పహల్గాంలో జరిగిన పిరికిపంద దాడిలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చనిపోవడం నావికాదళం విభాగాధిపతి దినేశ్ త్రిపాఠితో పాటు నేవీ సిబ్బంది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది” అని నేవీ ప్రకటించింది.

వినయ్ కుటుంబానిది కర్నాల్‌లోని భుస్లీ గ్రామం. ప్రస్తుతం వారు కర్నాల్‌లోని సెక్టర్ 7లో నివసిస్తున్నారు. వినయ్‌కు ఒక చెల్లెలు ఉన్నారు. ఆమె సివిల్స్‌ రాస్తున్నారు.

వినయ్ నర్వాల్ ఏప్రిల్ 21న హనీమూన్ కోసం భార్యతో కలిసి కశ్మీర్ వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పారు.

పహల్గాం దాడి తర్వాత నేలమీద ఓ మృతదేహం పక్కన ఒక మహిళ కూర్చుని రోదిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయింది.

ఆ ఫోటోలో ఉంది వినయ్ నర్వాల్, ఆయన భార్య హిమాన్షి.

దాడికి పాల్పడిన వారిని పట్టుకుని, కఠినంగా శిక్షించాలని వినయ్ నర్వాల్ తాత హవా సింఘ్ నర్వాల్ డిమాండ్ చేశారు.

పహల్గాం, కాల్పులు, వినయ్ నర్వాల్

ఫొటో సోర్స్, Kamal Saini

‘మే 1న వినయ్ పుట్టినరోజు…ఇంతలోనే’

వినయ్ భార్య హిమాన్షి గురుగావ్‌కు చెందిన వారు. పీహెచ్‌డీ చేస్తున్నారు.

ఆమె తండ్రి జీఎస్టీలో సూపరింటెండెంట్. తాత రిటైర్డ్ పోలీసు ఆఫీసర్.

”హనీమూన్ కోసం జమ్ముకశ్మీర్ వెళ్లాలని పెళ్లికి ముందు వినయ్ అనుకున్నారు’’ అని ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు చెప్పారు.

మే 1న వినయ్ పుట్టినరోజని, హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబంతో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలని అనుకున్నారని ఆయన తెలిపారు.