SOURCE :- BBC NEWS
- రచయిత, మేడలిన్ హల్‌ప్రెట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
8 జనవరి 2025
ఫ్లోరిడాలోని లాడర్‌డేల్ విమానాశ్రయంలో జెట్‌బ్లూ సంస్థ విమానంలోని ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ ( విమానం ఎగిరాక దాని చక్రాలు ముడుచుకునే ప్రదేశం)లో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను గుర్తించినట్లు జెట్‌బ్లూ సంస్థ ప్రకటించింది.
విమానం ల్యాండయిన తర్వాత సోమవారం రాత్రి నిర్వహించే రెగ్యులర్ తనిఖీల సందర్భంగా ఈ రెండు మృతదేహాలను గుర్తించినట్లు జెట్‌బ్లూ తెలిపింది.
దీనిపై విచారణ జరుగుతోంది.
“ఇది హృదయ విదారక సంఘటన. ఆ ఇద్దరు వ్యక్తులు విమానంలోకి ఎలా వచ్చారనే దానిపై విచారణ జరుగుతోంది” అని ఆ ప్రకటనలో వివరించింది.
ల్యాండింగ్ గేర్‌లోకి ఎందుకెళ్లారు?
ఎయిర్ బస్ సంస్థ తయారు చేసిన ఈ విమానం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు ల్యాండయింది.
ఈ ఇద్దరు వ్యక్తులు విమానంలోకి ఎలా వచ్చారనేదానిపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వారిద్దరూ ఎలా చనిపోయారనేదానిపై మెడికల్ ఎగ్జామినర్ ఆఫీసు పోస్ట్ మార్టం నిర్వహిస్తోందని అమెరికాలో బీబీసీ భాగస్వామి సీబీఎస్ న్యూస్ తెలిపింది.
రెండు వారాల కిందట క్రిస్మస్ వేడుకల సందర్భంగా హవాయి దీవులకు వచ్చిన యునైటెడ్ స్టేట్స్ విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో కూడా ఒక మృతదేహం లభించింది.
ఆ వ్యక్తి ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లోకి ఎలా వచ్చారు? ఎలా చనిపోయారన్న దాని గురించి అధికారులు ఇప్పటి వరకు చెప్పలేదు.
విమానంలో ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ చాలా ప్రమాదకరమైన ప్రాంతం. ఇక్కడ దాక్కున్న వారు తీవ్రమైన చలి బారిన పడే అవకాశం ఉంది. అలాగే ఆక్సిజన్ కూడా ఉండదు.
ల్యాండింగ్ గేర్‌ను విమానంలోపలికి తీసుకున్న తర్వాత ఆ కంపార్ట్‌మెంట్‌లో దాక్కున్నవారు చక్రాల మధ్యన నలిగిపోయి చనిపోయే ప్రమాదముంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS