SOURCE :- BBC NEWS

విజయ్ దేవరకొండ

ఫొటో సోర్స్, YT/Sithara Entertainments

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండపై హైదరాబాద్‌లోని రెండు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. గిరిజనులను అవమానించేలా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలనేది ఈ ఫిర్యాదుల సారాంశం.

హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు గిరిజన హక్కుల సంఘాల నేతలు.

మరోవైపు, విజయ్ దేవరకొండ కూడా ఈ వివాదంపై స్పందించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఫిర్యాదుల్లో ఏముంది?

రెట్రో సినిమా ఈ‌వెంట్‌లో ఆదివాసీలను అవమానించేలా విజయ్ దేవరకొండ మాట్లాడారంటూ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్ రాజ్ చౌహాన్ ఏప్రిల్ 30న హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

”విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి” అని ఫిర్యాదులో కోరారు.

ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసే విషయంపై న్యాయ సలహా తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు ఎస్ఆర్ నగర్ పోలీసులు.

ఇదే ఘటనపై కీసర పోలీస్ స్టేషన్‌లో నేషనల్ బంజరా మిషన్ ఇండియా(ఎన్బీఎంఐ) మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవిరాజ్ రాథోడ్ ఫిర్యాదు చేశారు.

”గిరిజనులను అవమానించే విధంగా మాట్లాడినందుకు విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేయాలి” అని ఫిర్యాదు చేసినట్లు ఆయన బీబీసీతో చెప్పారు.

కీసర సీఐ శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడుతూ, తమకు ఫిర్యాదు అందిందని, కేసు నమోదుపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు.

విజయ్ దేవరకొండ

ఫొటో సోర్స్, YT/Sithara Entertainments

విజయ్ దేవరకొండ ఏమన్నారంటే..

ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో జరిగిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి నటుడు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో విజయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి

పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడి గురించి విజయ్ మాట్లాడుతూ, దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

”కశ్మీరీలు మనవాళ్లే. నేను రెండేళ్ల కిందట ‘ఖుషి’ సినిమా కోసం కశ్మీర్‌లో షూట్ చేశా. నాకు ఎంత మంచి జ్ఞాపకాలు ఉన్నాయో వాళ్లతో(కశ్మీరీలతో). పాకిస్తాన్ వాళ్ల మనుషులనే చూసుకోలేకపోతోంది, అక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇట్లానే కంటిన్యూ అయితే.. పాకిస్తాన్ మీద ఇండియా దాడి చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్లకే విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం మీద దాడి చేస్తారు” అని అన్నారు విజయ్.

”500 ఇయర్స్ బ్యాక్ (500 ఏళ్ల కిందట) ట్రైబల్స్ కొట్టుకున్నట్లు వీళ్లు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేస్తున్నారు. మనమంతా ఐక్యంగా ఉండాలి” అని విజయ్ అన్నారు.

దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ట్రైబల్ అసోసియేషన్ సభ్యులు విజయ్‌పై ఫిర్యాదు చేశారు.

తన వ్యాఖ్యలు వివాదం కావడంతో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఎవరినీ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు: విజయ్

“నేను ‘రెట్రో’ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీసినట్లు నా దృష్టికి వచ్చింది. వీటిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఏ వర్గాన్నీ, ఏ తెగనూ బాధపెట్టడం, లక్ష్యంగా చేసుకోవడం నా ఉద్దేశం కాదు.

నేను ఏ సమూహంపై ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ వివక్ష చూపలేదు. వారందరూ నా కుటుంబ సభ్యులు, నా సోదరులే అనుకుంటాను. నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా” అని ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు విజయ్.

“చారిత్రకపరంగా, డిక్షనరీలో ఉన్న అర్థంలోనే నేను ‘ట్రైబ్’ అనే పదాన్ని ఉపయోగించాను. నా సందేశంలోని ఏదైనా భాగం తప్పుగా అర్థం చేసుకున్నా లేదా బాధ కలిగించినా విచారం వ్యక్తం చేస్తున్నా” అని రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)