SOURCE :- BBC NEWS

విశాఖ స్టీల్ ప్లాంట్‌

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ. 11 వేల 440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ (17.01.2025) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా స్టీల్‌ ప్లాంట్‌కు పునర్వైభవం వస్తుందని భావిస్తున్నామని పలువురు కేంద్ర మంత్రులు అన్నారు.

కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 27న విశాఖ స్టీలు ప్లాంటులోని తమ వాటాను అమ్మివేస్తున్నట్లు ప్రకటించింది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 100 శాతం వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించడంతో ఆ రోజు నుంచి నేటి వరకు కార్మికసంఘాలు అందోళనలు చేస్తూనే ఉన్నాయి.

ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు, మూతపడిన బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేయించేలా ఉపయోగపడుతుందే తప్ప… ఇది ప్రైవేటీకరణను అపేందుకు ఉపయోగపడదని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు అంటున్నాయి.

ఈ ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదా? మరి ఈ ప్యాకేజీ దేనికి ఉపయోగ పడుతుంది? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పిన రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి?

కార్మిక సంఘాల నిరసన

ఫొటో సోర్స్, Vijay Murty

1,436 రోజుల అందోళనలు, రూ. 11,440 కోట్ల ప్యాకేజీ

విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 100 శాతం కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన చేసినప్పటి (2021, జనవరి 27) నుంచి ఇవాళ (2025, జనవరి 17) కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన రోజు వరకు స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల అందోళనలు సాగుతూనే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న అనందోళనలకు నేటి(జనవరి 17, 2025)తో 1,436 రోజులు.

విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ఆర్ధిక ప్యాకేజి ఇవ్వాలని గురువారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీపై శుక్రవారం అధికారికంగా ప్రకటన చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖ స్టీల్ ప్లాంట్

ఫొటో సోర్స్, Getty Images

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం పట్ల కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తంచేశారు.

“ప్రకటించిన ప్యాకేజీలో… డైరెక్ట్ ఈక్విటీ కింద కింద రూ.10,300 కోట్లు, షేర్ క్యాపిటల్ కింద రూ.1,140 కోట్లు కేటాయించారు. ఉక్కు పరిశ్రమ నష్టాలను అధిగమించేందుకు ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుంది” అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు

ఫొటో సోర్స్, I&PR

ప్యాకేజీపై చంద్రబాబు ఏమన్నారంటే?

స్టీల్‌ ప్లాంటుకు కేంద్ర ప్యాకేజీ చరిత్రాత్మక నిర్ణయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని ఎక్స్‌లో తెలిపారు.

విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని ఆయన చెప్పారు.

“ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదో గర్వించదగిన, భావోద్వేగ సమయం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పాటైన తర్వాత ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ఆ కృషికి కేంద్రం స్పందించింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బతికించడం కోసం రూ. 11,440 కోట్లు ఆర్థిక మద్దతు ఇచ్చింది. వికసిత్ భారత్ – వికసిత్ ఆంధ్రలో భాగంగా దేశ నిర్మాణం కోసం ప్రధానమంత్రి విజన్‌లో నేనూ భాగస్వామిని అవుతా” అంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు.

పురందేశ్వరీ

ఫొటో సోర్స్, FACEBOOK/DAGGUBATI PURANDESWARI

ఏపీపై కేంద్రానికి ఉన్న ప్రేమ: పురందేశ్వరి

2021 జనవరిలో విశాఖపట్నం స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ ప్రతిపాదన రాగానే అప్పుడు అన్నీ రాజకీయ పార్టీలు ఉద్యోగులకు సంఘీభావంగా నిలుస్తూ అందోళనలు చేపట్టాయి.

2024 సాధారణ ఎన్నికల్లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రంగా కూడా మారింది.

స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రదర్శనలు చేపట్టాయి. ప్రైవేటీకరణ మీద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని పలువురు నేతలు అప్పుడు ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు.

“విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో పాటు సొంత ఐరన్ గనులు లేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ప్లాంట్‌లో పని చేసే ఉద్యోగులు, కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఈ అంశాలను ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్లాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. ఆర్ధిక సాయం అందజేసే ఆలోచన ఉన్నట్లు కేంద్ర మంత్రి కుమారస్వామి అనేక సందర్భాల్లో మాకు చెప్పారు. ఎంతోమంది కృషి ఫలించి కేంద్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్లు ఆర్ధిక ప్యాకేజీ అందించడం ఆనందంగా ఉంది. ఇది బీజేపీ సర్కార్‌తోనే సాధ్యమని విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మరోసారి రుజువైంది” అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు.

కుమారస్వామి

ఫొటో సోర్స్, hdkumaraswamy/facebook

స్టీల్ ప్లాంట్ ఇంకా నష్టాల్లోనే: కుమారస్వామి

ప్రత్యేక ప్యాకేజీపై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి స్పందించారు.

“ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోనే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలను పూర్తి స్థాయిలో అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తాం. ఆంధ్ర‌ప్రదేశ్ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ప్రస్తుతానికి ఈ నిర్ణయాలు తీసుకున్నాం” అని అన్నారు.

2024 జులైలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కుమారస్వామి వచ్చారు. ఈ ప్లాంట్‌ను పరిరక్షించడమే బాధ్యతగా ముందుకు వెళతామని కుమారస్వామి అన్నారు. ప్రధాని ఆశీస్సులతో స్టీల్‌ప్లాంట్‌ను వంద శాతం పునరుద్ధరించే అవకాశమున్నదని ఆయన చెప్పారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కుమారస్వామి వద్ద మీడియా ప్రస్తావించగా “ప్రైవేటీకరిస్తారని మీకు ఎవరు చెప్పారు” అని ఆయన ప్రశ్నించారు.

ఆ పర్యటన సందర్భంగా “విశాఖ స్టీల్ ప్లాంట్ మూత పడే ప్రసక్తే లేదు” అని విజిటర్స్‌ బుక్‌లో రాశారు కుమారస్వామి.

విశాఖ స్టీల్ ప్లాంట్‌

ఫొటో సోర్స్, Vijay Murty

ఇది స్వల్ప ఊరట మాత్రమే: స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు

ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్‌కు స్వల్ప ఊరట మాత్రమేనని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నాయకుడు, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు నీరుకొండ రామచంద్రరావు బీబీసీతో చెప్పారు.

“స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సమస్యకు పరిష్కారం కావాలంటే ప్రస్తుతానికి సెయిల్‌లో విలీనం చేయడం ఒక్కటే మార్గం. ప్లాంట్ రూ. 35 వేల కోట్లు అప్పుల్లో ఉంది. దానిని నుంచి బయట పడాలంటే స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కావాలి. అది లేకపోవడం వలన ప్రతి టన్ను ఉక్కు తయారీకి రూ. 4 వేలు అదనంగా ఖర్చు చేస్తున్నాం. అందుకే ప్లాంట్ నష్టాల్లోకి కురుకుపోతోంది” అని రామచంద్రరావు అన్నారు.

”ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీతో కార్మికులకు, ఉద్యోగులకు బకాయిపడ్డ జీతాలు ఇవ్వవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులతో మూతపడిన బ్లాస్ట్ ఫర్నేస్‌లను మళ్లీ క్రమంగా ప్రారంభించవచ్చు. మార్కెట్‌లో అనుకూల పరిస్థితులు ఉండి…బ్లాస్ట్ ఫర్నేస్ లు రన్నింగులో ఉంటే ప్లాంట్ ను లాభాల బాట పట్టించవచ్చు.

కానీ ఈ ప్యాకేజీతో ప్రవేటీకరణ ఆగిపోతుందంటే నమ్మలేం. ఎందుకంటే 2021 జనవరిలో చేసిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన వెనక్కి తీసుకోలేదు. ఆ ప్రకటన వెనక్కి తీసుకుని, సొంత గనులు కేటాయించినప్పుడే స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆగిందనుకోవాలి”అని రామచంద్రరావు అన్నారు.

ఆర్సెలార్ మిట్టల్‌పై అంత ప్రేమ ఎందుకు?

ప్లాంట్‌కు సొంత గనులు లేవు, కానీ ఆరెస్సెస్ మిట్టల్‌కు ఇవ్వమని అడుగుతున్నారని మరో యూనియన్ నాయకుడు గంధం వెంకటరావు అన్నారు.

”స్టీల్ తయారీలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతినెలా 3 లక్షల టన్నుల కోకింగ్ కోల్ కొనుగోలు చేస్తుంది. దీనిని రష్యా, ఆస్ట్రేలియా, అమెరికాల నుంచి ఆర్డర్ చేస్తారు. నిజానికి స్టీల్ ప్లాంట్‌లో 40 రోజులకు సరిపడా కోకింగ్ కోల్ మెటీరియల్ నిల్వ ఉండాలి. కానీ ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి, కేంద్రం సహకారం లేకపోవడం కారణంగా ఎప్పటికప్పుడు కోల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది” అని ఉద్యోగ సంఘాల నాయకుడు గంధం వెంకటరావు అన్నారు.

మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ఆర్సెలార్‌ మిట్టల్‌ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన అందించింది.

పరిశ్రమ మొదటి దశ నిర్మాణాన్ని 2029 జనవరికి పూర్తి చేసి ఉత్పత్తిలోకి తీసుకురానున్నట్లు అందులో పేర్కొంది.

“విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వాలని ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కృషి చేయలేదు. కానీ అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్‌ మిట్టల్‌ ప్రతిపాదిస్తున్న ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని పొలిటికల్ పార్టీలు కూడా లాబీయింగ్ చేస్తున్నాయి. ఇదే పనిని విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చేయడం లేదు” అని గంధం వెంకటరావు అన్నారు.

ఆశ మొదలైంది: పల్లా శ్రీనివాసరావు

ప్యాకేజీ ప్రకటించినా తమ అందోళనలు ఆగవని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.

స్టీల్ ప్లాంట్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన వెనక్కి తీసుకున్నాకే తమ అందోళనలు ఆగుతాయని నీరుకొండ రామచంద్రరావు చెప్పారు.

“ప్యాకేజీతో నష్టాల నుంచి గట్టెక్కుతుందని కేంద్రం అంటుంది కానీ, ప్రైవేటీకరణ ఆగిపోతుందని ఒక్కరు చెప్పలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి” అని ఆయన అన్నారు.

“ఈ ప్యాకేజీతో ప్రవేటీకరణ జరగదనే ఆశ మొదలైంది. ముందు ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి క్రమంగా గట్టెక్కుతుంది” అని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)