SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
వెనెజ్వెలా దేశానికి రాకపోకలు సాగించే అన్ని నిషేధిత చమురు ట్యాంకర్లపై ” సంపూర్ణ పూర్తిస్థాయి దిగ్బంధం’’ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ఈ ప్రకటనలో, వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వాన్ని “విదేశీ ఉగ్రవాద సంస్థ”గా అమెరికా గుర్తిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఆస్తులను దోచుకోవడం, ఉగ్రవాదానికి మద్దతివ్వడం, మాదకద్రవ్యాలు, మానవ అక్రమరవాణాకు పాల్పడుతోందంటూ మదురో ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.
“ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి వెనెజ్వెలాకు రాకపోకలు సాగించే అన్ని నిషేధిత చమురు ట్యాంకర్లపై సంపూర్ణ, పూర్తి దిగ్బంధాన్ని అమలు చేయాలని ఆదేశిస్తున్నాను” అని ట్రంప్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వ్యాఖ్యలు వెలువడటానికి వారం రోజుల ముందు, వెనెజ్వెలా తీరానికి సమీపంలో ఒక చమురు ట్యాంకర్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంది. దీనిపై వెనెజ్వెలా ప్రభుత్వం స్పందిస్తూ, ట్రంప్ వ్యాఖ్యలను ‘‘పాశవిక బెదిరింపు”అంటూ ఖండించింది.
ట్రంప్ తన పోస్టులో, “దక్షిణ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నౌకాదళం వెనెజ్వెలాను పూర్తిగా చుట్టుముట్టింది” అని వ్యాఖ్యానించారు. ఈ సైనిక సమీకరణ ఇంకా పెరుగుతుందని, వెనెజ్వెలా ఎన్నడూ చూడని స్థాయిలో ఉంటుందని ఆయన హెచ్చరించారు.
మదురో ప్రభుత్వం దోచుకున్న చమురును ఉపయోగించి ‘‘నిధులు సమకూర్చుకోవడంతోపాటు , మాదకద్రవ్య ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, హత్యలు, అపహరణలు’’ వంటి నేరాలకు పాల్పడుతోందని ట్రంప్ ఆరోపించారు.
వెనెజ్వెలా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కేంద్రంగా మారిందని ట్రంప్ ప్రభుత్వం పదే పదే ఆరోపిస్తోంది . ఫెంటానిల్ సహా ఇతర మాదకద్రవ్యాలను అమెరికాకు తరలిస్తున్నాయనే ఆరోపణలపై గత సెప్టెంబర్ నుంచి అమెరికా సైన్యం పడవలపై నిర్వహించిన దాడులలో కనీసం 90మంది మరణించారు. ఇటీవల నెలల్లో అమెరికా తన యుద్ద నౌకలను కూడా ఈ ప్రాంతంలో మోహరించింది.
ఫొటో సోర్స్, Getty Images
గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మోహరింపు
ప్రపంచంలోనే అతిపెద్ద నిర్ధారిత చమురు నిల్వలు ఉన్న దేశాల్లో వెనెజ్వెలా ఒకటి. అమెరికా తమ సహజ వనరులను దోచుకోవడానికే ఈ చర్యలు తీసుకుంటోందని వెనెజ్వెలా ప్రభుత్వం ఆరోపిస్తోంది.
డొనల్డ్ ట్రంప్ పాలనతో పాటు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలోనూ అమెరికా మదురో ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది. ఆయనను అధికారం నుంచి తొలగించాలనే లక్ష్యంతో కఠిన ఆంక్షలు విధించింది.
వెనెజ్వెలా చమురును రవాణా చేస్తున్నాయని చెబుతూ తాజాగా కిందటివారం అమెరికా ఆరు నౌకలపై నిషేధం విధించింది. అదేవిధంగా, మదురో బంధువులు, ఆయనకు సన్నిహితంగా ఉన్న వ్యాపార సంస్థలపై కూడా ఆంక్షలు విధించారు.
అంతకు ఒక రోజు ముందు, వెనెజ్వెలా తీరానికి సమీపంలో ఓ చమురు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆ నౌకపేరు స్కిప్పర్ అని, అక్రమంగా చమురు రవాణా చేస్తోందని ఆరోపిస్తూ, ఆ నౌకను అమెరికా నౌకాశ్రయానికి తరలిస్తామని తెలిపింది.
ఈ చర్యను వెనెజ్వెలా ప్రభుత్వం నిరసించింది. అమెరికా ‘‘నౌకాసిబ్బందిని కిడ్నాప్’’ చేసి, చమురును ‘‘దొంగిలించిందని’’ మదురో చెప్పారు.
దీనికి ముందు , వెనెజ్వెలా ఉత్తర సరిహద్దున ఉన్న కరేబియన్ సముద్రంలో అమెరికా తన సైన్యాన్ని భారీగా మోహరించింది. వేలాది మంది సైనికులతో పాటు, ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక అయిన యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌ను వెనెజ్వెలా సమీపంలో మోహరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS







