SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Attorney General Pamela Bondi/X
అమెరికా భద్రతా దళాలు వెనెజ్వెలా తీరంలో ఒక భారీ చమురు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తెలిపారు. వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై అమెరికా తెస్తున్న ఒత్తిడిలో ఇదో కీలక పరిమాణం.
“మేం వెనెజ్వెలా తీరంలో ఒక ట్యాంకర్‌ను సీజ్ చేశాం. అది చాలా పెద్దది. ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న వాటిలో అతిపెద్ద ట్యాంకర్” అని ట్రంప్ వైట్‌హౌస్‌లో జర్నలిస్టులతో చెప్పారు.
అటార్నీ జనరల్ పామ్ బాండీ.. ట్యాంకర్‌ను సీజ్ చేస్తున్న వీడియోను విడుదల చేస్తూ, ఆ నౌకను “వెనెజ్వెలా, ఇరాన్ నుంచి నిషేధిత చమురు తరలించేందుకు ఉపయోగిస్తున్న క్రూడ్ఆయిల్ ట్యాంకర్”గా చెప్పారు.
దీనికి ప్రతిస్పందించిన వెనెజ్వెలా ఈ చర్యను “ఇంటర్నేషనల్ పైరసీ”(అంతర్జాతీయ దోపిడీ) అంటూ తీవ్రంగా ఖండించింది. దీనికిముందు, ఆ దేశ అధ్యక్షుడు మదురో మాట్లాడుతూ, వెనెజ్వెలా ఎప్పటికీ “ఆయిల్ కాలనీ”గా మారదని స్పష్టం చేశారు.

వెనెజ్వెలా అమెరికాలోకి మాదకద్రవ్యాలను తరలిస్తోందని ఆరోపిస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. ఇటీవలి కాలంలో అధ్యక్షుడు మదురోపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలను తీవ్రతరం చేసింది.
ప్రపంచంలోనే భారీ స్థాయిలో చమురు నిల్వలు కలిగిన వెనెజ్వెలా ప్రతిస్పందిస్తూ, తమ చమురు నిల్వల కోసమే అమెరికా ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తోంది.
ఈ ట్యాంకర్ స్వాధీనం వార్తలతో చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇది రవాణాదారులకు ముప్పుగా మారొచ్చని, వెనెజ్వెలా చమురు ఎగుమతులను దెబ్బతీయొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఈ ట్యాంకర్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌డీఐ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్ కోస్ట్ గార్డులు సమన్వయంతో స్వాధీనం చేసుకున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌కు నేతృత్వం వహిస్తున్న యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ తెలిపారు.
“చాలా సంవత్సరాలుగా ఈ ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా ఆంక్షలున్నాయి. ఎందుకంటే, ఇది విదేశీ ‘టెర్రరిస్ట్’ సంస్థలకు మద్దతిచ్చే చమురు అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో భాగమైంది” అని ఆమె ఎక్స్‌లో రాశారు.
బాండీ విడుదల చేసిన ఆ ఫుటేజీలో.. సైనిక హెలికాప్టర్ నౌకపై గాల్లో తేలుతూ ఉండగా, అందులో నుంచి భద్రతా బలగాలు తాళ్ల సాయంతో ఆ నౌక డెక్‌పై దిగడం, యూనిఫాంలో ఉన్న కొందరు తుపాకులతో నౌకలో సంచరిస్తున్నట్లు కనిపించింది.
అమెరికాకు చెందిన సీనియర్ అధికారి సీబీఎస్ న్యూస్(బీబీసీ అమెరికా భాగస్వామి)తో చెప్పిన వివరాల ప్రకారం, ఈ మిషన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్(రక్షణ శాఖ)కు చెందిన ఒక నౌక నుంచి మొదలైంది.
ఈ ఆపరేషన్‌లో రెండు హెలికాప్టర్లు, 10 మంది కోస్ట్ గార్డులు, 10 మంది మెరైన్ సభ్యులు, ప్రత్యేక బలగాలు పాల్గొన్నాయి.
ఆ ట్యాంకర్‌లోని చమురును ఏం చేస్తారని రిపోర్టర్లు అడిగినప్పుడు, “దానిని అలాగే ఉంచుతాం, అలాగే ఉంచుతామని అనుకుంటున్నా” అని ట్రంప్ బదులిచ్చారు.
మారిటైమ్ రిస్క్ కంపెనీ వాంగార్డ్ టెక్ ఈ ఆయిల్ ట్యాంకర్‌ను ‘స్కిప్పర్’గా గుర్తించింది.
“ఈ నౌకను డార్క్ ఫ్లీట్‌లో భాగంగా పేర్కొంది. వెనెజ్వెలా చమురు ఎగుమతులకు ఉపయోగిస్తున్న ఈ నౌకపై అమెరికా ఆంక్షలు విధించింది” అని తెలిపింది.
డార్క్ ఫ్లీట్ అంటే, ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగించే నౌకల నెట్‌వర్క్. ఇవి తమ గుర్తింపును మార్చుకోవడం, ట్రాకింగ్ సిస్టమ్స్‌ను ఆఫ్ చేయడం, వేరే దేశాల జెండాలతో ప్రయాణించడం వంటివి చేస్తాయి.
బీబీసీ వెరిఫై ఈ ట్యాంకర్‌ను ‘మెరైన్‌ట్రాఫిక్’లో గుర్తించింది. చివరిసారిగా రెండురోజుల కిందట గయానా జెండా కింద ప్రయాణిస్తున్నట్లుగా చూపించింది.
ఫొటో సోర్స్, Getty Images
ట్యాంకర్ సీజ్‌ను “తీవ్రమైన అంతర్జాతీయ నేరం”గా పేర్కొంటూ వెనెజ్వెలా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
“రాజ్యాంగబద్దంగా వెనెజ్వెలా పౌరులకు చెందిన వనరులను దోచుకునేందుకు ఏ విదేశీ శక్తినీ వెనెజ్వెలా అనుమతించబోదు” అని ఆ ప్రకటనలో పేర్కొంది.
వెనెజ్వెలాపై కొనసాగుతున్న ఈ దాడులు “మన సహజ వనరులు, మన ఆయిల్, మన ఇంధనం.. వెనెజ్వెలా వాసులకు మాత్రమే చెందిన ఈ వనరుల కోసమే ఇవన్నీ” అని తెలిపింది.
బుధవారం జరిగిన ఒక సభలో మదురో 1988 నాటి ఒక పాపులర్ పాట పాడుతూ, వెనెజ్వెలాతో యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్న అమెరికన్లకు ఒక సందేశమిచ్చారు.
“యుద్ధాన్ని వద్దనుకునే అమెరికన్లకు నేనొక పాపులర్ పాట ద్వారా సందేశమిస్తున్నా. డోంట్ వర్రీ, బీ హ్యాపీ” అంటూ మదురో స్పానిష్‌లో ఆ పాట పాడారు.
“నాట్ వార్, బీ హ్యాపీ. నాట్, నాట్ క్రేజీ వార్, నాట్, బీ హ్యాపీ.”
అయితే, ఈ సభకు ముందే ట్యాంకర్ సీజ్ చేసిన విషయం మదురోకి తెలుసా, లేదా అనే విషయం స్పష్టంగా తెలియలేదు.
అమెరికన్ బలగాలు నౌకపై దిగిన తర్వాత, వెనెజ్వెలా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో అమెరికాను “హంతకులు, దొంగలు, దోపిడీదారులు” అని వ్యాఖ్యానించారు.
ఆయన పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సినిమాను ప్రస్తావించారు. ఆ సినిమాలో కెప్టెన్ జాక్ స్పారో హీరో అయితే, “వీళ్లు మాత్రం సముద్రపు దొంగలు” అని అన్నారు.
“ఇలాగే అమెరికా ప్రపంచమంతటా యుద్ధాలు మొదలుపెట్టింది” అని కాబెల్లో అన్నారు.
ఇటీవల కొద్దిరోజులుగా వెనెజ్వెలా ఉత్తరాన ఉన్న కరేబియన్ సముద్రంలో అమెరికా తన సైనికులను మోహరించింది.
ఇందులో భాగంగా వేలాది మంది సైనికులు, ప్రపంచంలోనే అతిపెద్ద, విమాన వాహక యుద్ధనౌక అయిన యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్‌ను వెనెజ్వెలాపై దాడి చేయగలిగేంత దూరంలో మోహరించినట్లు బీబీసీ వెరిఫై రిపోర్ట్ చేసింది.
ఈ సన్నాహకాలతో ఏదో ఒక విధమైన సైనిక చర్య జరిగే అవకాశం ఉండొచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
గత సెప్టెంబర్ నుంచి అమెరికా ఈ ప్రాంతంలో బోట్లపై 22 దాడులు చేసింది. వాటి ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు అమెరికా ప్రభుత్వం చెబుతోంది. ఈ దాడుల్లో 80 మందికిపైగా చనిపోయారు.
(ఈ కథనానికి లోన్ వెల్స్ సాయమందించారు)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS







