SOURCE :- BBC NEWS

women

ఫొటో సోర్స్, Getty Images

‘‘విశాఖపట్నంలో పాకిస్తాన్ జాతీయులు ఇద్దరు ఉన్నారు’’ అని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ బీబీసీతో చెప్పారు.

వారిద్దరూ తండ్రీకొడుకులని తెలిపారు.

ఆ ఇద్దరినీ విశాఖలో ఉంచాలా, పాకిస్తాన్‌కు పంపించేయాలా అనే విషయంలో ఎఫ్ఆర్ఆర్ఓ (ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్) ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
విశాఖ, పాకిస్తాన్, పహల్గాం

ఫొటో సోర్స్, UGC

వారిద్దరు పోలీసులను ఎందుకు కలిశారంటే…

పహల్గాం దాడి తర్వాత భారత్‌లో ఉన్న పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది.

గడువులోగా భారత్‌ను వీడకుంటే కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఆదేశాలు పాటించకపోతే మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తామని తెలిపింది. మెడికల్‌ వీసాలు ఉన్నవారు మంగళవారంలోగా వెళ్లిపోవాలని, అలాగే వీసా ఆన్‌ అరైవల్‌, బిజినెస్‌ వంటి 12 రకాల వీసాలపై వచ్చినవారు ఆదివారం నాటికి భారత్‌నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది.

వివిధ కారణాలతో కొందరు పాకిస్తాన్ జాతీయులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు.

వారిలో వైద్య చికిత్సల కోసం వచ్చిన వారు ఉన్నారు.

విశాఖపట్నంలో ఉంటున్న ఇద్దరు ఇక్కడి ఆసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చినవారేనని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ బీబీసీతో చెప్పారు.

“తమ చికిత్స పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండనివ్వాలని కోరుతూ మెడికల్ వీసాపై ఉన్న ఇద్దరు పాకిస్తానీ జాతీయులు కుటుంబంతో వచ్చి కలిశారు” అని నగర పోలీస్ కమిషనర్ బీబీసీతో చెప్పారు.

విశాఖ, పాకిస్తాన్, పహల్గాం

ఫొటో సోర్స్, Getty Images

వైజాగ్ అమ్మాయి, పాకిస్తాన్ అబ్బాయి.. దుబయిలో ప్రేమ, పెళ్లి

ఈ ఇద్దరు పాకిస్తాన్ జాతీయులు ఎవరు? ఆ కుటుంబంలో మిగతావారి ఎక్కడి పౌరులు అనేది విశాఖ పోలీసులు తెలిపారు.

‘‘విశాఖ నగర పరిధిలో నివాసముంటున్న భార్య, భర్త, ఇద్దరు కుమారులున్న ఒక కుటుంబంలో ఇద్దరు పాకిస్తాన్ జాతీయత కలిగి ఉండగా…మరో ఇద్దరు భారత పౌరసత్వంతో ఉన్నారు. వీరిలో భర్త, ఒక కుమారుడికి పాకిస్తాన్ పౌరసత్వం ఉంది. భార్య మరో కుమారుడికి భారత పౌరసత్వం ఉంది’ అని పోలీసులు చెప్పారు.

“ఉపాధి కోసం విశాఖకు చెందిన యువతి, పాకిస్తాన్ చెందిన యువకుడు దుబాయ్ వెళ్లారు. అక్కడ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కుమారులు జన్మించారు. అందులో ఒకరు పాకిస్తాన్‌లో, మరొకరు ఇండియాలో పుట్టారు. పాకిస్తాన్‌లో పుట్టిన కుమారుడికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చికిత్స కోసం విశాఖ తీసుకుని వచ్చి వైద్యం అందిస్తున్నారు” అని పోలీసులు తెలిపారు.

పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులు భారత్ విడిచి పెట్టాల్సిరావడంతో ఈ కుటుంబమంతా వచ్చి తమ కుమారుడి వైద్యం కోసం ఇక్కడ ఉండనివ్వాలని కోరినట్టు పోలీసులు చెప్పారు.

తమ లాంగ్ టర్మ్ వీసా దరఖాస్తు పెండింగులో ఉందని చెప్తూ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించారని సీపీ తెలిపారు.

“కుమారుడికి విశాఖలో ఏఏ ఆసుపత్రుల్లో వైద్యం అందుతుందో ఆ వివరాలు తెలిపారు. ఎలాంటి వైద్యం తీసుకుంటున్నారో, అందుకు కుటుంబ సభ్యులు సహకారం ఎంత అవసరమో వివరించారు. నిరుడు జూన్‌లో ఎఫ్ఆర్ఆర్ఓలో లాంగ్ టర్మ్ వీసాకి అప్లయ్ చేసుకున్నారు. అదింకా పెండిగులో ఉంది” అని సీపీ శంఖబ్రత బాగ్చీ బీబీసీకి తెలిపారు.

విశాఖ, పాకిస్తాన్, పహల్గాం

ఫొటో సోర్స్, Getty Images

విశాఖలో ఉంటున్న పాకిస్తానీ జాతీయులు లాంగ్ టర్మ్ వీసాకి దరఖాస్తు చేసుకున్నారు. అలాంటి వారిని వెంటనే పంపించాల్సిన అవరసం లేదని హైదరాబాదులోని ఎఫ్ఆర్ఆర్ఓ తెలిపింది.

విశాఖలో ఉన్న పాకిస్తానీయుల ఆరోగ్యపరమైన సమస్యను తాము ఎఫ్ఆర్ఆర్ఓకి వివరించామని సీపీ తెలిపారు.

“విశాఖలో ఉన్న పాకిస్తాన్ జాతీయుల విషయాన్ని పరిశీలించాం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వారిని అక్కడే ఉండనివ్వండి” అని తమకు ఎఫ్ఆర్ఆర్ఓ తెలిపిందని సీపీ చెప్పారు.

విశాఖ, పాకిస్తాన్, పహల్గాం

ఫొటో సోర్స్, Getty Images

ఎఫ్ఆర్ఆర్ఓ ఏం చేస్తుందంటే…

ఎఫ్ఆర్ఆర్ఓ అంటే ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. 180 రోజుల కంటే ఎక్కువగా ఇండియాలో నివాసం ఉండాలని కోరుకుంటున్న వారికి, నిబంధనలకు అనుగుణంగా ఉంటే వీసాలను పొడిగించడం లేదా రద్దు చేసే వ్యవహారాన్ని ఎఫ్ఆర్ఆర్ కార్యాలయం చూసుకుంటుంది.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.

”లాంగ్ టర్మ్ వీసా (ఎల్‌టీవీ)కి దరఖాస్తు చేసుకున్న పాకిస్తానీయులను వెంటనే పంపించాల్సిన అవసరం లేదని, వారు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించిన మీదట వారి విషయంలో నిర్ణయం తీసుకుంటామని విశాఖ పోలీసులకు ఎఫ్ఆర్ఆర్ఓ తెలిపింది. మేం వారి తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. విశాఖలో వీరిద్దరూ తప్ప ఇంకెవరూ పాకిస్తానీయులు లేరు” అని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)