SOURCE :- BBC NEWS

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
-
2 మే 2025, 09:58 IST
ఆంధ్రప్రదేశ్‌లో 2014లో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ, పాలనా సౌలభ్యం, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల విధానాన్ని తెరపైకి తెచ్చింది.
మళ్లీ ఇప్పుడు, ఏపీకి అమరావతే ఏకైక రాజధానంటూ మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తోంది కూటమి ప్రభుత్వం.
గత ప్రభుత్వం రాజధానులుగా ప్రకటించిన కర్నూలు, విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు ఏమైనా తరలించిందా? ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి?


ఫొటో సోర్స్, FB/YS Jagan Mohan Reddy
వైసీపీ మూడు రాజధానులు
”అమరావతిపై మాకు వ్యతిరేకత లేదు. కానీ అభివృద్ధి అంతా ఒక్క చోటే కేంద్రీకృతం కాకూడదు. అందుకే వికేంద్రీకరణ జరగాలి” అంటూ 2021, డిసెంబర్ 17న అసెంబ్లీలో అప్పటి సీఎం జగన్ అన్నారు.
ఆ ప్రకటన తర్వాత జగన్ విశాఖను కేంద్రంగా చేసుకుని పాలన సాగిస్తానని పలుమార్లు ప్రకటించారు.
దీనిని వ్యతిరేకిస్తూ అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ విపక్షాలు, అమరావతి రైతులు ఆందోళన చేశారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తామని కూడా అప్పటి సీఎం, మంత్రులు ప్రకటించారు.
ఇటు విశాఖ, అటు కర్నూలులో కొన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, వాటికి అనుబంధంగా మరి కొన్ని కార్యాలయాలు వస్తున్నాయనే ప్రచారం జరిగింది.
‘హైకోర్టు…హైకోర్ట్ బెంచ్ గా ఎందుకు మారిందంటే..
మూడు రాజధానుల విధానంలో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రకటించింది. అయితే, న్యాయపరమైన అంశాల కారణంగా వికేంద్రీకరణ చట్టాన్ని వెనక్కు తీసుకుంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి… టీడీపీ జనసే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది.
ఎన్నికల్లో హమీ ఇచ్చినట్లుగానే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
దీనికి అనుగుణంగా కేంద్రానికి సిఫార్సు చేస్తూ 2024, నవంబర్ 20న ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కర్నూలులో హైకోర్టుకు బదులుగా హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకాయుక్త, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సీ) కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేసింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ సంస్థలను కర్నూలు నుంచి అమరావతికి తరలించే అంశం పరిశీలిస్తోందంటూ వార్తలు రావడంతో రాయలసీమ ప్రాంతంలో నిరసనలు మొదలయ్యాయి.
దీంతో “కర్నూలు నుంచి ఏ సంస్థనూ తరలించబోం” అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
“లోకాయుక్త, హెచ్ఆర్‌సీ లాంటివి కర్నూలులోనే ఉంటాయి.” అని సీఎం చంద్రబాబు కూడా చెప్పారు.

విశాఖ విషయానికి వస్తే…
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విధానాన్ని ప్రకటించిన తర్వాత…విశాఖ రుషికొండలోని పర్యటకశాఖకు చెందిన రిసార్ట్స్‌ను దాదాపు రూ. 500 కోట్లతో ఆధునీకరించే పనులు ప్రారంభించింది.
రిసార్ట్స్ ఆధునీకరణకు అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారో వైసీపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు.
కొన్ని సందర్భాల్లో అప్పటి మంత్రులు రుషికొండ భవనాలపై వస్తున్న విమర్శల గురించి స్పందించారు.
అప్పటి పర్యటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు “విదేశీ పర్యటకులను ఆకట్టుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలతో స్టార్ హోటల్ నిర్మిస్తున్నాం” అన్నారు.
“రుషికొండపై భవనాలు కట్టకూడదా? అక్కడ ముఖ్యమంత్రి ఉండకూడదా?” అని ఒక సందర్భంలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
మరో మంత్రి అమర్‌నాథ్ “అక్కడ నిర్మాణాలు ప్రభుత్వ అవసరాల కోసమే” అని చెప్పారు.
ఒకసారి వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో “సీఎం క్యాంపు కార్యాలయంగా రుషికొండ” అంటూ ఫొటోలతో సైతం ట్వీట్ చేసి…విమర్శలు రావడంతో…ఆ ట్వీట్ ను తొలగించారు.
రుషికొండపై విలాసవంతమైన నిర్మాణాలు జగన్ కోసమేనని టీడీపీ, జనసేన నాయకులు ఆరోపిస్తుండేవారు.
కానీ ఏనాడూ ఈ భవనాలు ఫలానా అవసరాల కోసం అంటూ వైసీపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు.

‘విశాఖకు కృష్ణా నదీ జలాల బోర్డు’
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నదీ జలాల పంపిణీ వ్యవహారాలు చూసే కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుండగా…వాటిలో కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖపట్నానికి తరలించాలని 2021 జనవరిలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.
కృష్ణా నదికి సంబంధం లేని ప్రాంతంలో బోర్డు ఏర్పాటు తగదని…ఈ నిర్ణయం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ప్రభుత్వం మాత్రం విశాఖ అన్నింటికీ అనుకూలంగా ఉండే ప్రాంతమని చెప్పుకొచ్చింది. విశాఖలో బోర్డు ఏర్పాటుకు అభ్యంతరం లేదని, తరలింపు కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు మెంబర్ సెక్రటరీ మీనా కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు.
అయితే అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని విశాఖకు తరలించేందుకు జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఇదొక్కటే అని చెప్పుకోవాలి.
“ప్రభుత్వాలకు అకౌంటబులిటీ లేకపోవడంతోనే పనులకు బాధ్యత వహించకుండా… ఇష్టానుసారం చేసుకుపోతున్నారు. ఏపీ రాజధానుల విషయంలో అదే జరిగింది. ఒకసారి అమరావతి, మరోసారి విశాఖ, ఇంకొసారి ఇంకొకటి ..ఇలా మారుతూ ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?” అని ఏయూ జర్నలిజం విభాగం ప్రొఫెసర్ సి. రామకృష్ణ బీబీసీతో అన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమంటూ..
ఉత్తరాంధ్ర ప్రాంతంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు విశాఖలో బస చేయడానికి తగిన వసతిని గుర్తించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ 2023 అక్టోబర్‌లో వైసీపీ ప్రభుత్వం జీవో 2015ని విడుదల చేసింది.
ఆ తర్వాత నగరంలోని వీఎంఆర్‌డీఏ భవనాలు, ఏయూ, మధురవాడలోని ఐటీ సెజ్, పోర్టు గెస్ట్‌హౌస్ ఇలా పలు భవన సముదాయాలను అధికారులు పరిశీలించి నివేదిక రూపొందించారు.
ఈ నివేదిక కాగితాలకే పరిమితమైంది. ఆ తర్వాత ఎన్నికలు రావడం, వైసీపీ ఓడిపోవడంతో…ఈ జీవో కథ ముగిసినట్టయింది.

ఫొటో సోర్స్, GoIR AP
“ఒక రాజధానికి అవసరమైన ఏ కార్యాలయాన్నీ విశాఖలో ఏర్పాటు చేయలేదు. దృష్టంతా రుషికొండలోని ప్యాలెస్ నిర్మాణంపైనే పెట్టారు. అంతకు మించి విశాఖలో ఏం జరగలేదు.” అని పొలిటికల్ ఎనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ వీవీ రమణమూర్తి బీబీసీతో అన్నారు.
“మేం అధికారంలో ఉన్నప్పుడు పాలనను వికేంద్రీకరిస్తూ విశాఖ, కర్నూలును రాజధానులుగా మార్చే ప్రయత్నం చేశాం. కానీ ప్రతి అంశాన్ని కోర్టుకు లాగి…మమ్మల్ని ముందుకు పోనివ్వలేదు. అధికారంలోకి వస్తే రాజధానులపై మా పార్టీ వైఖరి ఏంటనేది ఇప్పుడు నిర్ణయించే అంశం కాదు. అది పార్టీ అధినాయకత్వం చూసుకుంటుంది.” అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఆర్థిక రాజధాని అని చెప్పడమే కానీ…విశాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని వీవీ రమణమూర్తి చెప్పారు.
రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులు ఏవీ కూడా అటు కర్నూలులో కానీ…ఇటు విశాఖపట్నంలో కానీ రాలేదన్నారు.
అమరావతి పనులకు మరోసారి శంకుస్థాపన జరుగుతున్న నేపథ్యంలో..రాజధానుల ఆటలో విశాఖ, కర్నూలుకు ఏం జరిగిందని చూస్తే…హడావుడి, రాజకీయం తప్ప మరేమీ లేదని వీవీ రమణమూర్తి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS