SOURCE :- BBC NEWS

జ్యోతి మల్హోత్రా

ఫొటో సోర్స్, Travel With Jo/Instagram

50 నిమిషాలు క్రితం

జ్యోతి మల్హోత్రా. ఓ ట్రావెల్ వ్లాగర్. యూట్యూబర్ కూడా. పాకిస్తాన్‌కు నిఘా సమాచారాన్ని చేరవేస్తున్నారంటూ హరియాణా, పంజాబ్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

జ్యోతి మల్హోత్రా మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి కొంత అనుమానాస్పద సమాచారం లభించినట్టు హరియాణా పోలీసులు చెప్పారు.

ఆమెపై భారతీయ న్యాయ శిక్షా స్మృతి (బీఎన్ఎస్)లోని అధికారిక రహస్యాల చట్టం సెక్షన్ 152 ( దేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు, సమగ్రతకు ముప్పు కలిగించడం) కింద కేసు నమోదు చేశారు.

జ్యోతి అరెస్ట్ అయినప్పటి నుంచి, ఆమె పాకిస్తాన్‌ను సందర్శించిన విషయం చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు కిందటేడాది పాకిస్తాన్ హైకమిషనర్‌ ఇచ్చిన డిన్నర్ పార్టీకి హాజరైన ఆమె వీడియో ఒకటి వార్తల్లో నిలిచింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే చానల్ నిర్వహించారు

ఫొటో సోర్స్, Youtube

దేశ, విదేశాల గురించి వీడియోలలో

జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ చానల్, ఇన్‌స్టా పేజీ నిర్వహిస్తున్నారు.

ఆమె యూట్యూబ్‌ చానల్‌కు 3.79 లక్షలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో 1.40 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్‌లో 3.22 లక్షలమంది ఆమెను ఫాలో అవుతున్నారు.

ఆమె దేశ, విదేశాలలో చేసిన ప్రయాణాలకు సంబంధించిన వీడియోలను తన చానల్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. ఇప్పటిదాకా 4 వందలకు పైగా వీడియోలు ఆమె తన చానల్‌లో పోస్టు చేశారు.

ఈ వీడియోలలో ఆయా ప్రాంతాల గురించి వివరిస్తూ, వ్యూయర్స్‌కు సమాచారం అందిస్తుంటారు.

మార్చి, ఏప్రిల్ మధ్య జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌ను సందర్శించారు. పాకిస్తాన్‌లో ఆమె టూర్‌కు సంబంధించి అనేక వీడియోలు, రీల్స్ తన చానల్‌లో పోస్టు చేశారు.

పాకిస్తాన్ హై కమిషనర్ విందులో పాల్గొన్న జ్యోతి మల్హోత్రా

ఫొటో సోర్స్, @TravelwithJo/Youtube

డిన్నర్ పార్టీ వీడియోలో ఏముంది?

ప్రస్తుతం వార్తలలో నిలుస్తున్న పాకిస్తాన్ హై కమిషనర్ డిన్నర్ పార్టీ వీడియోను జ్యోతి మల్హోత్రా తన చానల్‌లో 2024 మార్చి 30న పోస్టు చేశారు.

పాకిస్తాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇస్తున్న డిన్నర్ పార్టీకి తనకు ప్రత్యేక ఆహ్వానం అందిందని ఆ వీడియో ప్రారంభంలో ఆమె చెప్పారు.

అదే వీడియోలో ఆమె ఓ వ్యక్తిని కలిశారు. జ్యోతిని యూట్యూబర్ అంటూ ఇతరులకు పరిచయం చేసిన ఆ వ్యక్తిని ‘డానిష్‌జీ’ అని ఆమె సంబోధించారు.

పాకిస్తాన్ హైకమిషన్ అధికారులు, కార్యక్రమానికి హాజరైన ఇతర యూట్యూబర్లు, అతిథులను కలుసుకుని వారి గురించి తన ఫాలోయర్లకు జ్యోతి వివరించారు.

జ్యోతి మల్హోత్రాను రిమాండ్ కు తరలించిన తర్వాత ఈ వీడియో వార్తల్లోకి వచ్చింది.

జ్యోతి మల్హోత్రా

ఫొటో సోర్స్, Travel With Jo/Facebook

పోలీసులు ఏం చెబుతున్నారు?

బీబీసీ కరస్పాండెంట్ కమల్ సైనీ అందించిన సమాచారం ప్రకారం, హిసార్ నివాసి జ్యోతి మల్హోత్రాను అధికారిక రహస్యాల చట్టం, బీఎన్ఎస్ సెక్షన్ 152 కింద అరెస్ట్ చేసినట్లు డిఎస్సీ కమల్ జిత్ తెలిపారు.

జ్యోతి ఓ పాకిస్తాన్ పౌరుడితో నిరంతరం టచ్‌లో ఉండేదని, విచారణలో ఆమె నుంచి మరింత సమాచారం రాబట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ”ఆధునిక యుద్ధాలు కేవలం సరిహద్దులో మాత్రమే జరగవు. కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను నియమించుకోవడానికి పీఐఓ(పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్)లు ప్రయత్నిస్తున్న కొత్త పద్ధతిని మేం చూశాం. వీరిని తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు” అని ఆయన చెప్పారు.

ఈ క్రమంలో కేంద్ర సంస్థల నుంచి తమకు సమాచారం అందిందని, జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశామని చెప్పారు. ఒక పీఐవోతో ఆమెకు పరిచయం ఏర్పడిందని, ఆమె పలుమార్లు పాకిస్తాన్‌ను, ఒకసారి చైనాను సందర్శించారని పోలీసులు చెప్పారు.

‘‘ఆమెను ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నాం. కేంద్ర సంస్థల సహకారంతో ఆమె ఆర్థిక వివరాలు, ప్రయాణాలను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నాం. జ్యోతి మల్హోత్రా పీఐవోతో టచ్‌లో ఉన్నారు’’ అని హిసార్ ఎస్పీ తెలిపారు.

జ్యోతి మల్హోత్రా

ఫొటో సోర్స్, Travel With Jo/Facebook

జ్యోతి నేపథ్యం ఏమిటి?

జ్యోతి గురించి మే 7వ తేదీనే పంజాబ్ పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని, దీంతో ఆమెను విచారణకు పిలిచి శుక్రవారం నాడు అరెస్టు చేసి, శనివారం కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు వెల్లడించారు. తర్వాత ఆమెను ఐదురోజుల పోలీసు రిమాండ్‌కు పంపారు.

పాకిస్తాన్ కోసం జ్యోతి గూఢచర్యం చేస్తున్నారని అధికారులు చెప్పినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలిపింది.

ఆమె పాకిస్తాన్‌లోని తన హ్యాండర్ల్స్‌తో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారని, పాకిస్తాన్‌పై సానుకూల దృక్పథం కలిగే కంటెంట్ తయారు చేస్తున్నారని ఆ ప్రతిక తన కథనంలో పేర్కొంది.

గురుగ్రామ్‌లోని ఓ కంపెనీలో జ్యోతి పనిచేసేవారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో, ఆమె ఉద్యోగాన్ని వదిలేసి, మూడేళ్ల కిందటే ట్రావెల్ వ్లాగర్‌గా మారారు.

2023లో విజిటింగ్ వీసా కోసం పాకిస్తాన్ హైకమిషన్‌కు వెళ్లానని ప్రాథమిక దర్యాప్తులో జ్యోతి చెప్పినట్లు పోలీసులను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.

పాకిస్తాన్ హైకమిషన్ అధికారి ఎహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్‌తో రెండేళ్ల కిందట ఆమెకు పరిచయం ఏర్పడిందని పోలీస్ ఎఫ్ఐఆర్‌ను పేర్కొంటూ ది హిందూ పత్రిక తెలిపింది.

ఆ సమయంలో ఆమె వీసా కోసం పాక్ హైకమిషన్ కు వెళ్లారు. డానిష్‌తో టచ్‌లో ఉన్న ఆమె రెండుసార్లు పాకిస్తాన్‌లో పర్యటించారు. అక్కడ ఆమె డానిష్‌కు పరిచయమున్న అలీ అనే వ్యక్తిని కలుసుకుని పాకిస్తాన్‌లో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

డానిష్ నంబర్‌ను జ్యోతి పోలీసులకు ఇచ్చారని, అతనితో టచ్‌లో ఉన్నానని చెప్పినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది.

పాకిస్తాన్ హైకమిషన్‌కు చెందిన ఎహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్‌ను అవాంఛనీయ వ్యక్తిగా ఈ నెల 13న ప్రకటించిన భారత్, 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

జ్యోతి మల్హోత్రా తండి హరీష్ కుమార్

ఫొటో సోర్స్, Kamal Saini/BBC

జ్యోతి మల్హోత్రా తండ్రి ఏమంటున్నారు?

తన కుమార్తెపై వచ్చిన అభియోాగాలను జ్యోతి తండ్రి హరీశ్ కుమార్ ఖండించారని ది హిందూ రిపోర్ట్ చేసింది. ఈ కేసులో తన కుమార్తెను ఇరికించారని ఆయన అన్నారు.

పోలీసులు గురువారంనాడు తమ ఇంటికి వచ్చి జ్యోతిని తీసుకువెళ్లారని హరీశ్ కుమార్ బీబీసీకి చెప్పారు.

”ఐదారుగురు వచ్చారు. అరగంటకుపై ఇంట్లో సోదాలు చేశారు. తరువాత మూడు మొబైల్ ఫోన్లను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు” అని ఆయన వెల్లడించారు.

”ప్రభుత్వ అనుమతితోనే నా కుమార్తె పాకిస్తాన్‌కు వెళ్లింది. ఆమె నేపథ్యాన్ని విచారించిన తరువాతే వీసా ఇచ్చారు. ఆ తరువాతే ఆమె పాకిస్తాన్ వెళ్లింది” అని హరీశ్ కుమార్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)