SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Reuters
ఒక గంట క్రితం
రష్యా, యుక్రెయిన్ ‘‘ ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయి’’ అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు. ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య మాస్కోలో చర్చలు ముగిశాక ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సంప్రదింపుల విషయంలో ఇవాళ మంచి రోజు అని ట్రంప్ చెప్పగా, చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని క్రెమ్లిన్ స్పందించింది. అయితే ఈ చర్చల్లో యుక్రెయిన్ ప్రతినిధి లేరు.
”కీలకమైన విషయాల్లో చాలా వాటికి ఆమోదం లభించింది.” అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రష్యా, యుక్రెయిన్ ఉన్నతస్థాయి సమావేశంలో ఒప్పందం కుదర్చుకోవాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు.
బేషరతుగా కాల్పుల విరమణ అంగీకరించడానికి ”రష్యామీద గట్టి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది”అని శుక్రవారం(ఏప్రిల్ 25) పొద్దుపోయిన తర్వాత విడుదల చేసిన వీడియోలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ వ్యాఖ్యానించారు.
”పూర్తిస్థాయిలో బేషరతుగా కాల్పుల విరమణ”కు అంగీకారం కుదిరితే… కీయెవ్, మాస్కో మధ్య భౌగోళిక సమస్యలపై చర్చించగలమని జెలియెన్‌స్కీ బీబీసీతో చెప్పారు.


ఫొటో సోర్స్, AFP
యుద్ధం ముగింపునకు అమెరికా ప్రయత్నాలు
అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందం ప్రకారం…రష్యా ఆక్రమించిన ప్రాంతాల్లో చాలా భాగం యుక్రెయిన్ వదులుకోవాల్సిఉంటుందని రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.
మాస్కో 2014లో ఆక్రమించిన క్రిమియా, రష్యాలో భాగంగా ఉండడాన్ని తాను సమర్థిస్తానని ట్రంప్ చెప్పారు. అయితే జెలియెన్‌స్కీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
రష్యా 2022లో యుక్రెయిన్ పై పూర్తి స్థాయి ఆక్రమణమొదలుపెట్టింది. యుక్రెయిన్ భూభాగంలో దాదాపు 20శాతం ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉంది.
ఉన్నతస్థాయి చర్చల కోసం విట్కాఫ్ మాస్కో చేరుకున్నప్పుడు ఆయన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఏడాదిలో విట్కాఫ్ రష్యాలో పర్యటించడం ఇది నాలుగోసారి.
మూడు గంటల పాటు జరిగిన ఈ చర్చలు ”చాలా ఉపయోగకరమైనవి” అని పుతిన్ సహచరుడు యురి ఉషకోవ్ వ్యాఖ్యానించారు.
”యుక్రెయిన్ విషయంలోనే కాకుండా ఇతర అంతర్జాతీయ అంశాలపైనా, రష్యా, అమెరికా వైఖరిని ఈ చర్చలు దగ్గర చేశాయి” అని ఆయనన్నారు.
”యుక్రెయిన్ సంక్షోభం గురించి జరిగిన చర్చలో రష్యా, యుక్రెయిన్ ప్రతినిధుల మధ్య మళ్లీ నేరుగా చర్చలు ప్రారంభించే అవకాశం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం” అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
చర్చలకు సానుకూలంగా పుతిన్?
యుద్ధం ప్రారంభమైన తరువాత తొలిసారిగా జెలియెన్‌స్కీతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ఈ వారం ప్రారంభంలో పుతిన్ సంకేతాలు ఇచ్చారు.
30 గంటల ఈస్టర్ కాల్పుల విరమణను 30 రోజుల పాటు పొడిగించాలన్న జెలియెన్‌స్కీ ప్రతిపాదనకు ప్రతిస్పందనగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. అయితే ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదు.
యుద్ధాన్ని ముగించడానికి మాస్కోతో కుదిరే ఒప్పందంలో భాగంగా కొన్ని భౌగోళిక మినహాయింపులకు ఒప్పుకోవాలని ట్రంప్ వైపు నుంచి కీయెవ్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
క్రిమియా ప్రత్యేక అంశంగా మారింది.
క్రిమియాను రష్యాలో భాగమని అంగీకరించడానికి జెలియెన్‌స్కీ ఒప్పుకోవడం లేదు. ”మా వైఖరి మారలేదు. యుక్రెయిన్ భూభాగాలు ఏవన్నది నిర్ణయించే హక్కు యుక్రెయిన్ ప్రజలకు మాత్రమే ఉంది” అని జెలియెన్‌స్కీ వ్యాఖ్యానించారు.
”పూర్తిస్థాయి బేషరతు కాల్పుల విరమణ ప్రతి విషయాన్ని చర్చించడానికి అవకాశం కల్పిస్తుంది” అని జెలియెన్‌స్కీ బీబీసీతో చెప్పారు.
”క్రిమియా రష్యాతో ఉంటుంది” అని ట్రంప్ టైమ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలను జెలియెన్‌స్కీ ప్రస్తావించారు.
”ట్రంప్ చెప్పింది నిజం. క్రిమియా ద్వీపకల్పంపై తిరిగి నియంత్రణ సాధించగల ఆయుధ సంపత్తి మాకు లేదు.” అని జెలియెన్‌స్కీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ISW
అమెరికా ప్రతిపాదన ఏంటి?
‘రష్యా ఆక్రమించిన ప్రాంతమంతా ఆ దేశంలో భాగంగానే ఉంటుంది’ అని వాషింగ్టన్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నిబంధన మాస్కోకు అనుకూలంగా ఉంది. ఈ ప్రణాళికను అమెరికా ఇంకా విడుదల చేయలేదు.
గతవారం అమెరికా తన ప్రతిపాదనలను యూరోపియన్ అధికారులకు అందించిందని, దానికి ప్రతిగా యూరప్, యుక్రెయిన్ నుంచి ప్రతిపాదనలు అమెరికాకు అందాయని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఈ ప్రతిపాదనల మధ్య చాలా అసమానతలు ఉన్నాయని రాయిటర్స్ చెప్పింది.
క్రిమియా ఆక్రమణను అమెరికా చట్టప్రకారం అంగీకరిస్తున్నట్టు వాషింగ్టన్ ప్రతిపాదిత ఒప్పందంలో ఉంది. అలాగే లుహాన్స్క్ ప్రాంతం సహా రష్యా ఆక్రమించిన ప్రాంతాలన్నింటిపై మాస్కో నియంత్రణను గుర్తిస్తుంది.
రష్యా ఆక్రమించిన యుక్రెయిన్ ప్రాంతాలను ఏం చేయాలనేదానిపై కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే చర్చలు జరుపుతామని యుక్రేనియన్లు, యూరోపియన్లు అంటున్నారు.
నాటోలో యుక్రెయిన్ సభ్యత్వం విషయాన్ని కూడా అమెరికా తన ప్రణాళికలో పక్కన పెట్టిందని రాయిటర్స్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
‘యుద్ధాన్ని ఆపేయడమే లక్ష్యం’
చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని పుతిన్, విట్కాఫ్ సమావేశాన్ని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. ”వాళ్లు పుతిన్‌తో సమావేశమయ్యారు. అనేక విషయాలున్నాయి. సుంకాల ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందాలు సహా అనేక మంచి విషయాలతో చర్చలు ముగుస్తాయి” అనుకుంటున్నా అని ట్రంప్ చెప్పారు.
యుక్రెయిన్‌లో పోరాటాన్ని ముగించడం తన లక్ష్యమని ట్రంప్ అన్నారు. వారానికి ఐదువేలమంది యుక్రేనియన్లు, రష్యన్ల ప్రాణాలు పోతున్నాయని ట్రంప్ చెప్పారు. శాంతి ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నామని తాను నమ్ముతున్నట్టు తెలిపారు.
అమెరికాతో అత్యంత ముఖ్యమైన అరుదైన భూ ఖనిజాల ఒప్పందం తుదిపత్రాలపై జెలియెన్‌స్కీ ఇంకా సంతకం చేయలేదని ట్రంప్ అన్నారు.
ఇప్పటికే మూడువారాలకు పైగా ఆలస్యమయిందని, వెంటనే దీనిపై సంతకం చేస్తారని తాను భావిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు.
యుక్రెయిన్‌లో సమృద్ధిగా ఉన్న సహజవనరుల నిక్షేపాల్లో అమెరికాకు వాటా కల్పించే ఖనిజాల ఒప్పందంపై ఫిబ్రవరిలో సంతకాలు జరగాల్సిఉంది. ఈ ఒప్పందంపై చాలా కాలం నుంచి చర్చ జరుగుతోంది. అయితే వాషింగ్టన్లో ట్రంప్, జెలియెన్‌స్కీ మధ్య జరిగిన క్లిష్టమైన సమావేశం తర్వాత ఈ విషయం పక్కకు వెళ్లిపోయింది.

ఫొటో సోర్స్, Reuters
రష్యాపై ఒత్తిడి పెంచాలి: జెలియెన్‌స్కీ
రష్యా, యుక్రెయిన్ వైఖరి గమనిస్తే, శాంతి ఒప్పందం కుదుర్చుకునే విషయంలో ఆ రెండు దేశాలు ఇంకా ఆమడదూరంలోనే ఉన్నట్టు అర్ధమవుతుంది. మాస్కోలో జరిగిన చర్చల్లో పాల్గొనాల్సిందిగా యుక్రెయిన్‌కు చెందిన ఎవరినీ ఆహ్వానించలేదు.
మార్చి 11న అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించడంలో రష్యా విఫలమయిందని జెలియెన్‌స్కీ సోషల్ మీడియాలో విమర్శించారు. రష్యాపై ఒత్తిడి పెంచాలని మిత్రదేశాలను కోరారు.
”గగనతలంలో, సముద్రంలో, యుద్ధభూమిలో నిశ్శబ్దం పాటించాలన్న ట్రంప్ ప్రతిపాదనను యుక్రెయిన్ అంగీకరించి 45రోజులయింది. కానీ రష్యా దీన్నంతటినీ తిరస్కరించింది. రష్యాపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముంది. ఒత్తిడి లేకపోతే పరిష్కారం లభించదు” అని జెలియెన్‌స్కీ అన్నారు.
ఉత్తరకొరియా వంటి దేశాల నుంచి క్షిపణులను దిగుమతి చేసుకుని రష్యా వాటిని కీయెవ్‌పై ప్రయోగిస్తోందని, గురువారం(ఏప్రిల్ 24) జరిగిన దాడిలో 12 మంది చనిపోయారని, 20మందికిపైగా గాయపడ్డారని జెలియెన్‌స్కీ తెలిపారు.
కీయెవ్ ప్రజల ప్రాణాలు తీసిన క్షిపణిలో కనీసం 116 భాగాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవని, వాటిలో ఎక్కువభాగం అమెరికా తయారుచేసినవని జెలియెన్‌స్కీ ఆరోపించారు.
కీయెవ్‌పై రష్యా దాడి తర్వాత ట్రంప్ స్పందించారు. యుద్ధాన్ని ముగించేందుకు తాను రెండువైపులా ఒత్తిడి పెంచుతున్నానని తెలిపారు. ‘వ్లాదిమిర్…ఆపు’ అని నేరుగా పుతిన్‌ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాను అని చెప్పారు.
యుద్ధం ప్రారంభమవడానికి కీయెవ్ కారణమని ట్రంప్ ఆరోపించారు . ”నాటోలో చేరడం గురించి వారు మాట్లాడడం మొదలుపెట్టడమే యుద్ధానికి కారణమని అనుకుంటున్నా” అని టైమ్ మ్యాగజైన్‌తో ట్రంప్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)