SOURCE :- BBC NEWS

shyam benegal

ఫొటో సోర్స్, Getty Images

ఒక గంట క్రితం

ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు.

సోమవారం సాయంత్రం 6.30 ప్రాంతంలో ఆయన మరణించినట్లు కుమార్తె పియా బెనగల్ వెల్లడించారు.

గత రెండేళ్లుగా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవలే తన 90వ పుట్టిన రోజు జరుపుకొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
శ్యామ్ బెనగల్

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్‌లోనే బాల్యం, విద్యాభ్యాసం

శ్యామ్ బెనగల్ అప్పటి హైదరాబాద్‌లో తిరుమలగిరి ప్రాంతంలో 1934లో డిసెంబర్ 14న జన్మించారు. ఆయన పూర్తిపేరు శ్యామ్ సుందర్ బెనగల్.

అడ్వర్టైజింగ్‌లో కాపీ రైటర్‌గా కెరీర్ ప్రారంభించారు శ్యామ్ బెనగల్.

హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో చదువుకున్న ఆయన సామాజిక అంశాలపై సినిమాలు రూపొందించి దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు.

అంకుర్, నిశాంత్, మంథన్, జునూన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్: ద ఫర్గాటెన్ హీరో వంటి చిత్రాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి.

పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు.

2006 నుంచి 2012 మధ్య రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు.

శ్యామ్ బెనగల్

చివరిసారిగా ఏడాదిరన్నర కిందట మాట్లాడాను: దర్శకుడు బి.నర్సింగరావు

శ్యాం బెనగల్ ఇల్లు అల్వాల్ ఉంటుంది. గత 25-30 ఏళ్లుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. శిథిలావస్థలో ఉంది. ఆయన 1955లోనే ముంబయికి వెళ్లిపోయారు.

శ్యాం బెనగల్ గురించి సినీ దర్శకుడు బి.నర్సింగరావు బీబీసీతో మాట్లాడుతూ ”నేను ఆయనను చాలాసార్లు కలిశాను. గతంలో మా ఇంటి వద్దనే శ్యాం బెనగల్ ఇల్లు కూడా ఉండేది. మొదటిసారి బేగంపేట ఎయిర్ పోర్టులో ఆయన్ను కలిశాను. ఆ సమయంలో ఆయన అనుగ్రహం సినిమా చేస్తున్నారు. శ్యాం బెనగల్ సినిమాలో నటించాలని అనుకున్నా, కుదర్లేదు. అప్పట్లో శ్యాం బెనగల్ నిజాం కాలేజీలో చదివేటప్పుడు ఫిలిం క్లబ్ మొదలుపెట్టారు. థియేటర్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ముంబయికి వెళ్లిపోయారు” అని చెప్పారు.

‘చివరిసారిగా ఏడాదిన్నర కిందట ఆయనతో మాట్లాడాను. ఆరోగ్యం సరిగా లేదని చెప్పారు, ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు’ అని నర్సింగరావు అన్నారు.

నిజాం కాలేజ్‌లో నాకు సీనియర్: మేల్కొటె

శ్యాంబెనగల్ తనకు ఎంతో ఆప్తమిత్రుడని బీబీసీతో చెప్పారు నటుడు శంకర్ మేల్కొటె.

”నిజాం కాలేజీలో నాకన్నా మూడు సంవత్సరాలు సీనియర్. వయసులో నాలుగు సంవత్సరాలు పెద్దవాడు. ఆయనకు ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో గ్రీటింగ్స్ పంపుతుండేవాడిని. ప్రతి మెసేజ్, ఫోన్ కాల్‌కు స్పందించి మాట్లాడేవారు’ అన్నారు మేల్కొటె.

‘డయాలసిస్ చేస్తున్నారు అని చెప్పేవారు. అంతా బాగానే జరుగుతోంది అన్నారు.

ఈ మధ్య మేసేజ్ చేసినా, ఆయన నుంచి సమాధానం రాలేదు’ అని చెప్పారు.

శంకర్ మేల్కొటే 1975లో శ్యాంబెనగల్ తీసిన నిశాంత్ సినిమాలో తొలిసారిగా నటించారు. అందులో ఆయన లాయర్ పాత్రలో నటించినట్లు చెప్పారు.

”శ్యాం బెనగల్‌కు ముందు నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. ఆయన తండ్రి బొల్లారంలో ఫొటో స్టుడియో నిర్వహించేవారు. అలా ఫొటోగ్రఫీ, షూట్స్‌పై ఆసక్తి ఏర్పడింది.

అల్వాల్ నుంచి నిజాం కాలేజీ వరకు సైకిల్‌పై వచ్చేవారు. అలా సైక్లింగ్ చాంపియన్ కూడా అయ్యారు.

స్విమ్మింగ్ పోటీల్లోనూ ఆయన పాల్గొని ఛాంపియన్‌షిప్ గెలిచారు.

నిజం కాలేజీ కొలీజియం అని మ్యాగజైన్ వచ్చేది. దాన్ని ఆయన రెండేళ్లపాటు ఎడిట్ చేశారు.

ముంబయి వెళ్లాకే నేషనల్ ఎడ్వర్టైజింగ్ సహా వివిధ సంస్థల్లో కాపీ రైటర్‌గా పనిచేశారు.

దాదాపు 500కుపైగా అడ్వర్టైజింగ్ ఫిలింలు చేశారు.

అంకుర్ అనే సినిమా యాప్రాల్‌కు చెందిన ఒక యువకుడి కథ. తెల్లవారుజామున 5గంటలకే వెళ్లి షూట్ చేసేవారు. నేను, నా భార్య రమా అందరం కలిసి అప్పట్లో షూటింగ్ చూశాం.

నిశాంత్ షూటింగ్ కూడా గుండ్లపోచంపల్లిలో జరిగింది. శ్యాం దర్శకత్వంలో ఆ సినిమాలో నటించడం ఎంతో గౌరవంగా భావిస్తాను. అప్పట్లో నాకు రూ.500 చెక్ ఇచ్చారు.

ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నన్ను కలిసేవారు. కలిసి భోజనం చేసిన సందర్భాలు, మాట్లాడుకున్నవి ఎన్నో ఉన్నాయి” అని బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)