SOURCE :- BBC NEWS

వివాదాస్పద బౌద్ధ సన్యాసి

ఫొటో సోర్స్, Getty Images

శ్రీలంకలో ఓ అతివాద సన్యాసికి 9 నెలల జైలు శిక్ష పడింది. ఇస్లాంను కించపరిచి, మత విద్వేషాలను రెచ్చగొట్టారంటూ ఆయనకు కోర్టు జైలు శిక్ష విధించింది.

పదవీచ్యుతుడైన మాజీ అధ్యక్షుడు గొటాబయ రాజపక్సకు ఆయన సన్నిహితుడు.

గాలగోడ జ్ఞానసారా అనే ఈ సన్యాసి 2016లో చేసిన వ్యాఖ్యాలకు గానూ గురువారం(2025 జనవరి 9న) శిక్ష విధించారు.

బౌద్ధ సన్యాసులను దోషులుగా తేల్చడం శ్రీలంకలో అరుదు.

విద్వేషపూరిత వ్యాఖ్యలు, ముస్లిం వ్యతిరేక హింసకు పాల్పడ్డారనే అభియోగాలపై జ్ఞానసార జైలుకు వెళ్లడం ఇది రెండోసారి.

గతంలో బెదిరింపులు, కోర్టు ధిక్కరణకు సంబంధించి ఆరేళ్లు జైలు శిక్ష పడిన కేసులో 2019లో జ్ఞానసారకు అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించారు.

తాజాగా కొలంబో మేజిస్ట్రేట్ కోర్టు జ్ఞానసారకు 9నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

2016లో ఓ మీడియా సమావేశంలో ఇస్లాంను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నేరంపై జ్ఞానసారను డిసెంబరులో అరెస్ట్ చేశారు.

కోర్టు జ్ఞానసారకు జైలు శిక్షతోపాటు 1,500 శ్రీలంక రూపాయల జరిమానా విధించింది.

జరిమానా కట్టని పక్షంలో మరో నెలరోజులు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది.

తన జైలు శిక్షపై జ్ఞానసార అప్పీలుకు వెళ్లారు. అప్పీలుపై తుది తీర్పు వచ్చేదాకా బెయిల్ మంజూరు చేయాలన్న జ్ఞానసార న్యాయవాది అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
బౌద్ద సన్యాసి

ఫొటో సోర్స్, Reuters

తరచూ వివాదాలు

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా 2022లో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో బలవంతంగా రాజీనామా చేసి, విదేశాలకు పారిపోయిన మాజీ అధ్యక్షుడు గొటాబయ రాజపక్సకు జ్ఞానసార నమ్మకమైన సన్నిహితుడు.

సింహళ బౌద్ధ జాతీయవాద గ్రూపుకు నేతృత్వం వహించే జ్ఞానసారను, రాజపక్స పాలనా కాలంలో మత సామరస్యాన్ని కాపాడటానికి ఎటువంటి చట్టపరమైన సంస్కరణలు తీసుకురావాలో సిఫార్సు చేసేందుకు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌కు అధ్యక్షుడిగా చేశారు.

రాజపక్స పదవీచ్యుతుడైన తరువాత కిందటేడాది, శ్రీలంకలో ముస్లిం మైనార్టీలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు గానూ జ్ఞానసారకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది.

అప్పుడు ఆయన అప్పీలుకు వెళ్లి బెయిల్ పొందారు.

అదృశ్యమైపోయినట్టుగా అందరూ భావిస్తున్న ఓ రాజకీయ కార్టునిస్టు భార్యను జ్ఞానసార బెదిరించిన కేసులో 2018లో ఆయనకు కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది.

కానీ ఆయన కేవలం 9 నెలల జైలు శిక్షను మాత్రమే అనుభవించారు.

తరువాత అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన క్షమాభిక్ష ప్రసాదించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)