SOURCE :- BBC NEWS

పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు

ఫొటో సోర్స్, screengrab/Pakistan PM’s office

2 గంటలు క్రితం

పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఒక అంతర్జాతీయ వేదికపై భేటీ కావడం ఇప్పుడు చర్చల్లో నిలిచింది.

శాంతి, విశ్వాసాన్ని పెంపొందించే చర్యలపై నిర్వహించిన అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు తుర్క్‌మెనిస్తాన్ రాజధాని అష్గాబాత్‌కు షాబాజ్ షరీఫ్ చేరుకున్నారు.

ఈ వరల్డ్ ఫోరమ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోవాన్ కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఇరాన్, రష్యా, తుర్కియేతో పాటు తుర్క్‌మెనిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజిస్తాన్ అధ్యక్షులతో కూడా పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భేటీ అయ్యారని పాక్ పీఎంఓను ఉటంకిస్తూ బీబీసీ ఉర్దూ పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో షాబాజ్ షరీఫ్ భేటీ సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చల్లో నిలిచింది.

ఈ నాయకులిద్దరి మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగలేదు.

కానీ, పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన వీడియోలో షాబాజ్ షరీఫ్, పుతిన్ కరచాలనం చేసుకుంటూ మాట్లాడుకుంటున్నట్లు కనిపించారు.

పుతిన్‌ను కలవడానికి షాబాజ్ షరీఫ్ చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చిందని చాలా మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోవన్‌తో పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సమావేశంలో పాల్గొన్నారు

ఫొటో సోర్స్, AFP via Getty Images

పుతిన్‌తో సమావేశంలో ఏం జరిగింది?

బీబీసీ ఉర్దూ ప్రకారం, షాబాజ్ షరీఫ్-పుతిన్ మధ్య జరిగిన సంభాషణ వివరాలను పాకిస్తాన్ అధికారులు వెల్లడించలేదు.

కానీ, రష్యా మీడియా ప్లాట్‌ఫామ్ ఆర్టీ ఇండియా తన ఎక్స్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో చాలామంది స్పందించారు.

అయితే, ఆ వీడియోను తర్వాత హ్యాండిల్‌ నుంచి తొలగించారు. ఆర్టీ ఇండియా దీని గురించి మరో పోస్ట్ చేసింది.

‘పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, వ్లాదిమిర్ పుతిన్‌ను కలవడానికి వేచి ఉన్నారని ఇంతకుముందు మేం చేసిన ఒక పోస్టును ఇప్పుడు తొలగించాం. ఆ పోస్టులో సంఘటనలకు సంబంధించిన సమాచారం సరియైనది కాకపోవచ్చు’ అని ఆర్టీ ఇండియా తన ట్వీట్‌లో రాసింది.

ఆర్టీ ఇండియా తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన 14 సెకన్ల వీడియోలో.. షాబాజ్ షరీఫ్ ఒక కుర్చీలో కూర్చున్నట్లు, ఆయన పక్కన రష్యా జెండా ఉన్న కుర్చీ ఖాళీగా ఉన్నట్లు చూడొచ్చు.

షాబాజ్‌తో పాటు ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, సమాచార మంత్రి అతావుల్లా తరార్‌లను కూడా ఆ వీడియో క్లిప్‌లో చూడొచ్చు.

Tweet

ఫొటో సోర్స్, X

రష్యా మీడియా ఏమంటోంది?

రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ 40 నిమిషాలు వేచిచూశారని, ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా పుతిన్, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోవాన్ మధ్య భేటీ జరుగుతున్న గదిలోకి షరీఫ్ వెళ్లారని ఆర్టీ ఇండియా పేర్కొంది.

ఈ అంశంపై స్పష్టత కోసం పాక్ విదేశాంగ కార్యాలయాన్ని బీబీసీ ఉర్దూ సంప్రదించింది.

అందులో ఏదో పొరపాటు జరిగిందని, ఆ తర్వాత ఆర్టీ ఇండియా తన పోస్టును తొలగించిందని పాక్ విదేశాంగ కార్యాలయం బీబీసీకి వెల్లడించింది.

మరోవైపు, ఆర్టీ ఇండియా కూడా తాము ఆ పోస్టును తొలగించినట్లు ధ్రువీకరించింది.

కానీ, క్రెమ్లిన్‌తో పాటు మరికొన్ని రష్యా మీడియా సంస్థలు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశానికి సంబంధించిన సంక్షిప్త నివేదికలు విడుదల చేశాయి.

తుర్కియే అధ్యక్షుడు ఎర్డోవాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య సమావేశం ముగిసిన తర్వాత క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

‘ఈ సమావేశంలో తుర్కియే, రష్యా మధ్య సహకారాన్ని పెంపొందించడం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, బాహ్య ఒత్తిడి, యుక్రెయిన్‌తో పాటు ఇతర అంశాలపై ఇద్దరు నాయకులు వివరంగా చర్చించారు. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా తర్వాత ఈ సమావేశంలో భాగమయ్యారు’ అని ఆ ప్రకటనలో క్రెమ్లిన్ పేర్కొంది.

రష్యా వార్తాపత్రిక కోమర్సెంట్ కూడా ఈ ఘటన గురించి తన కథనంలో ప్రస్తావించింది.

‘పుతిన్‌తో ఆయన (ఎర్డోవాన్) సమావేశం చాలాసేపు కొనసాగింది. పక్క గదిలో వేచివున్న పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ అరగంట పాటు ఒంటరిగా కూర్చొని విసుగు చెందారు. చివరికి, అక్కడి నుంచి లేచి వెళ్లి, తలుపు తెరుచుకుని పుతిన్- ఎర్దోవాన్ మధ్య జరుగుతున్న సమావేశంలో చేరారు’ అని కోమర్సెంట్ పేర్కొంది.

మరో రష్యన్ వార్తాపత్రిక ఎంకేఆర్‌యూ కూడా ఈ సమావేశాన్ని క్లుప్తంగా ప్రస్తావించింది. తుర్కియే, రష్యా అధ్యక్షుల సమావేశంలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా పాల్గొన్నారని పేర్కొంది.

అయితే, ఈ ఉమ్మడి సమావేశం తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

tweet

ఫొటో సోర్స్, X

సోషల్ మీడియాలో చర్చనీయాంశం

షాబాజ్ షరీఫ్-పుతిన్-ఎర్డోవాన్ సమావేశంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

పుతిన్ వెయిట్ చేయించారంటూ కొందరు యూజర్లు షాబాజ్ షరీఫ్‌ను ఎగతాళి చేస్తుండగా, ‘ప్రపంచ నాయకుల మధ్య ప్రధాన ఆకర్షణ మా నాయకుడే’ అంటూ ఆయన మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు.

షాబాజ్ షరీఫ్‌ను వెయిట్ చేయించారనే వాదన గురించి నసీమ్ అబ్బాస్ అనే యూజర్ ఎక్స్‌లో స్పందించారు.

‘ఈ సంఘటన అంతర్జాతీయ వేదికపై జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా ఈ వార్తను చూసి నవ్వుతోంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

మరో యూజర్ దీనిపై స్పందిస్తూ, ‘పుతిన్ కోసం షరీఫ్ 40 నిమిషాలు వేచి ఉన్నారు. కానీ, ఆయన రాలేదు. అతని దౌత్యపరమైన గైర్హాజరు అంతర్జాతీయంగా ప్రశ్నలను లేవనెత్తుతోంది’ అని ట్వీట్ చేశారు.

మరోవైపు, తుర్క్‌మెనిస్తాన్‌లో షాబాజ్ షరీఫ్ ఇతర నాయకులతో నిర్మాణాత్మక సమావేశాలు నిర్వహించారని పాక్ ప్రధాని అంతర్జాతీయ మీడియా ప్రతినిధి ముషారఫ్ జైదీ ట్వీట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)