SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
షార్క్ శరీర భాగాల అక్రమ రవాణాలో తమిళనాడు కీలకంగా మారిందని, ఈ అక్రమ వ్యాపారం తమిళనాడులోనే 65 శాతం జరిగిందని ట్రాఫిక్, వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యుడబ్ల్యుఎఫ్) -ఇండియా సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ తెలిపింది.
భారత్‌లో సొర చేప రెక్కల్ని వ్యర్థమైనవిగా భావిస్తారు. అయితే వీటికి అంతర్జాతీయ మార్కెట్‌లో గిరాకీ పెరగడంతో అక్రమంగా రవాణా చేస్తున్నారని వన్యప్రాణి నేర నివారణ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
షార్క్ రెక్కల అక్రమ రవాణాకు సంబంధించి నవంబర్‌లో తమిళనాడులోనే రెండు కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
అసలు షార్క్ రెక్కల అక్రమ రవాణా ఎందుకు పెరుగుతోంది?
రామనాథపురం జిల్లాలోని కీజకరై బీచ్ నుంచి శ్రీలంకకు ఏనుగు దంతాలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను డిసెంబర్ 7న తీర రక్షక దళం అరెస్ట్ చేసింది.
ఆ ముగ్గురిలో ఒకరు ఏనుగు దంతాలతో పాటు షార్క్ రెక్కలను కూడా సముద్ర మార్గం ద్వారా అక్రమ రవాణా చేసే ఏజెంట్‌గా పని చేస్తున్నట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
బస్తాల కొద్దీ షార్క్ రెక్కలు
షార్క్ రెక్కల అక్రమ రవాణాకు సంబంధించి గతేడాది మేలో మరో సంఘటన రామనాథపురంలోనే జరిగింది. ఓ హత్య కేసుకు సంబంధించి మరైకార్ పట్టినం ప్రాంతంలోని ఓ వ్యక్తిని ప్రశ్నించేందుకు తిరుపుల్లాని పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో వారు సముద్ర తీరంలో సోదాలు నిర్వహించారు. అక్కడ వారు 23 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 15 బస్తాలలోకి షార్క్ చేపల రెక్కలు ఉన్నాయి.
రామనాథపురం జిల్లాలో షార్క్ రెక్కలు దొరకడం మామూలుగా మారింది. 2022 ఆగస్టులో క్యూ డివిజన్ పోలీసులు తిరుపుల్లానిలోని సల్లితోప్ బీచ్ ప్రాంతం నుంచి దాదాపు 200 కిలోల బరువున్న షార్క్ రెక్కలను స్వాధీనం చేసుకున్నారు.
భారత్ నుంచి 2012-13, 2013-14లో విదేశాలకు షార్క్ చేపల రెక్కలను ఎగుమతి చేశారు. సముద్రంలో సొర చేపల సంఖ్య తగ్గడంతో 2015 ఫిబ్రవరి 6న షార్క్ రెక్కల ఎగుమతిపై నిషేధం అమల్లోకి వచ్చింది.
ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న అక్రమ రవాణా
నిషేధం అమల్లో ఉన్నప్పటికీ షార్క్ రెక్కల అక్రమ రవాణా కొనసాగుతోందని వన్యప్రాణి పరిశోధకుడు శంకర్ ప్రసాద్ చెప్పారు.
“చైనా, ఇండోనేసియా, వియత్నాం, థాయిలాండ్‌లో సొర చేప రెక్కలతో వండిన సూప్ ప్రసిద్ధి చెందిన వంటకం” అని ఆయన చెప్పారు.
“షార్క్ చేప మత్స్యకారుల వలలో చిక్కుకున్నప్పుడు కొంతమంది వల కోసి, ఆ చేపను సముద్రంలో వదిలేస్తారు. మరి కొంతమంది దాని రెక్కలను ఒడ్డుకు తెచ్చి అమ్ముతారు” అని శంకర్ ప్రకాష్ చెప్పారు.
దక్షిణ అమెరికా దేశాలలో కూడా షార్క్‌ను ఆహారంగా ఉపయోగిస్తారని ఆయన అన్నారు.
సొర చేపలు రక్షిత జాబితాలో ఉన్నాయి. దీంతో వాటితో అవసరం ఉన్న వారు వాటి కోసం ఎక్కువ సొమ్ము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని శంకర్ ప్రసాద్ చెప్పారు.
సొర చేపలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరిగే వ్యాపారంలో వాటి రెక్కలదే ప్రధాన పాత్ర అని ది వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ చెబుతోంది.
షార్క్ రెక్కలతో చేసే సూప్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార పదార్థాలలో ఒకటి అని వన్యప్రాణుల అక్రమ రవాణాను పర్యవేక్షించే ట్రాఫిక్ అనే సంస్థకు భారత దేశంలో అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న మెర్విన్ ఫెర్నాండెజ్ చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
మత్స్యకారులను వాడుకుంటున్న ఏజెంట్లు
తమిళనాడు తీర ప్రాంతంలో బంగాళాఖాతం, మన్నార్ గల్ఫ్, పాక్ జలసంధి జలాల్లో అనేక రకాల సొరచేపలు కనిపిస్తాయని వాటిలో గాలంగల్ షార్క్, స్క్విడ్ షార్క్, కొండయన్ షార్క్, కొంబన్ షార్క్, మిల్క్ షార్క్ ఉన్నాయని ఏఐటీయూసీ మత్స్యకారుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సెంథిల్‌వేల్ చెప్పారు.
షార్క్ రెక్కలు రామేశ్వరం మీదుగా శ్రీలంకకు అక్రమ రవాణా చేస్తున్నారని ఆయన అన్నారు.
“సముద్రంలో లోతైన ప్రాంతాల్లో చేపలను వేటాడేవారు సముద్రంలోనే షార్క్‌ల రెక్కలను కత్తిరిస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఆ రెక్కలను వేల రూపాయలకు అమ్ముతారు. వాటి సైజును బట్టి ధర నిర్ణయిస్తారు. షార్క్ రెక్కల కోసం కొందరు ఏజెంట్లు మత్స్యకారులను ఉపయోగించుకుంటున్నారు” అని సెంథిల్‌వేల్ చెప్పారు.
రామనాథపురంలో షార్క్ రెక్కలను షార్క్ పీల్ అని పిలుస్తారని ఆయన తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో 160 రకాల షార్క్ చేపలు
భారత వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం నిషేధిత షార్క్ రెక్కలను కలిగి ఉంటే కనీసం 3 ఏళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు.
భారతదేశంలో 160 షార్క్ జాతులు ఉన్నాయి. వీటిలో 26 షార్క్ జాతులు వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 1, 2 జాబితాల్లో ఉన్నాయని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ డేటా చెబుతోంది.
“భారతదేశంలో తిమింగలం, సొరచేపలతో సహా కొన్ని రకాల సొరచేపలను పట్టుకోవడం నిషిద్ధం. ఆహారం కోసం ఇతర సొరచేపలను పట్టుకోవచ్చు” అని వైల్డ్ లైఫ్ క్రైమ్ ప్రివెన్షన్ యూనిట్ అధికారి ఒకరు చెప్పారు. ఆయన తన పేరును బహిర్గతం చేయవద్దని కోరారు.
“షార్క్ రెక్కలను విదేశాలకు రవాణా చేయడంపై నిషేధం ఉంది. మీరు రెక్కను కత్తిరించినట్లయితే, అది నిషేధించిన జాతికి చెందినదా, ఆహారం కోసం అనుమతి ఉన్న జాతికి చెందినదా అని నిర్థరించడం అంత తేలికకాదు” అని ఆయన బీబీసీతో అన్నారు.
“అరుదైన జాతులను మినహాయించి, మిగతా వాటిని పట్టుకోవచ్చు. వాటి రెక్కలను ఇక్కడ వృధాగా భావిస్తారు. అయితే ప్రపంచ మార్కెట్‌లో వాటికి చాలా గిరాకీ ఉంది” అని ఆయన చెప్పారు.
సొర చేపల రెక్కల అక్రమ రవాణాకు హాంగ్‌కాంగ్ కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచి రెక్కలు ప్రపంచవ్యాప్తంగా స్మగ్లింగ్ అవుతున్నాయి.
“గత వారం చెన్నై విమానాశ్రయంలో ఒకరు దొరికారు. గత నెలలోనే సొర చేప రెక్కలకు సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి” అని వైల్డ్ లైఫ్ క్రైమ్ ప్రివెన్షన్ యూనిట్ అధికారి బీబీసీతో అన్నారు.
సొర చేప రెక్కల అక్రమ రవాణా భారత్‌తో పాటు ఇతర దేశాల్లోని సొర చేపలకు ప్రమాదకరమైనదని ది వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ చెబుతోంది.
“తగిన పర్యవేక్షణ యంత్రాంగం లేకపోవడం వల్ల, ఈ విషయంలో చట్టపరమైన, అక్రమ వాణిజ్యం మధ్య తేడా గుర్తించడం సవాలుగా మారింది” అని ఆ సంస్థ తెలిపింది.
అయితే భారత దేశంలో అరుదైన షార్క్‌లను వేటాడటంపై నిషేధం గురించి మత్స్యకారుల్లో కొంత అవగాహన ఉందని సెంథిల్‌వేల్ చెబుతున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో చెన్నైలో ఒక సొరచేపను ముక్కలు చేసి అమ్మిన ఘటన జరిగింది.
చెన్నైలోని కాసిమేడు ఫిషింగ్ పోర్టులో మత్స్యకారులు సొరచేపలను కోసి అమ్ముతున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఉన్న షార్క్ చేప హామర్ రకానికి చెందినగా గుర్తించారు.
ఇది వన్యప్రాణుల రక్షణ చట్టంలోని షెడ్యూల్‌లో రెండో జాబితాలో ఉంది.
“నిషేధిత షార్క్ జాతులను వేటాడటం, వాటిని విక్రయించడం చట్ట విరుద్ధం. వీడియోలో షార్క్ మాంసం అమ్ముతున్న మత్స్యకారుడిని అధికారులు హెచ్చరించారు” అని వైల్డ్‌లైఫ్ క్రైమ్ ప్రివెన్షన్ యూనిట్ అధికారి చెప్పారు
ఈ వివరాలను బీబీసీ స్వయంగా ధృవీకరించలేకపోయింది.
షార్క్ రెక్కలను అక్రమంగా రవాణా చేసే వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వ వైల్డ్‌లైఫ్ క్రైమ్ ప్రివెన్షన్ యూనిట్ సౌత్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ తేన్‌మొళి చెప్పారు.
“నిషేధిత సొర చేపల వేట, అక్రమ రవాణాను ఆపేందుకు మేం రాష్ట్ర అటవీశాఖతో కలిసి పని చేస్తున్నాం” అని ఆమె బీబీసీకి వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
“12 ఏళ్లలో 16వేల కేజీలు” వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్
వన్య ప్రాణుల అక్రమ వ్యాపారాన్ని పర్యవేక్షించే ది వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్, దాని భాగస్వామిగా ఉన్న ట్రాఫిక్ సంస్థ 2024లో షార్క్ రెక్కల అక్రమ వ్యాపారం గురించి కొన్ని వివరాలు వెల్లడించాయి.
జనవరి 2010 నుంచి డిసెంబర్ 2022 మధ్య 16వేల కేజీల షార్క్ రెక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భారీ మొత్తంలో షార్క్ గుజ్జు, దంతాలు ఉన్నట్లు ఆ సంస్థలు తెలిపాయి.
“షార్క్ రెక్కల అక్రమ రవాణా కేసులు ఎక్కువగా తమిళనాడులోనే నమోదవుతున్నాయి. షార్క్ రెక్కల్లో దాదాపు 65 శాతం తమిళనాడులోనే దొరుకుతున్నాయి” అని ఆ నివేదిక తెలిపింది.
తమిళనాడు తర్వాత కర్ణాటక, గుజరాత్, కేరళ, మహారాష్ట్రలో షార్క్ రెక్కలు దొరికాయి. వీటిని సింగపూర్, హాంకాంగ్, శ్రీలంక, చైనాకు అక్రమ రవాణా చేస్తున్నట్లు వెల్లడించింది.
షార్క్ శరీర భాగాలను ఆహారంతో పాటు తోలు ఉత్పత్తులు, నూనె, విటమిన్ ఏ, సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీకి కూడా ఉపయోగిస్తున్నారని డాక్టర్ మెర్విన్ ఫెర్నాండెజ్ చెప్పారు.
“పర్యావరణ సమతుల్యం, జీవ వైవిధ్యంలో షార్క్ చేపలు ముఖ్యమైనవి. వాటిని ఎక్కువగా వేటాడటం వల్ల అవి అంతరించి పోయే ప్రమాదం ఉంది” అని ది వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ హెచ్చరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)







