SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, SamirKhan
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో మూడున్నరేళ్ల చిన్నారి బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతుండటంతో, ఆమెకు ఉపవాసంతో ప్రాణాలు త్యాగం చేసే ‘సంతారా’ దీక్షను ఇచ్చారు. ఆ చిన్నారి మృతి చెందిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
జైన మతంలో వృద్ధాప్యంలోగానీ, నయంకాని వ్యాధి సోకినప్పుడు లేదా జీవించాలనే సంకల్పం పోయినప్పుడు ‘సంతారా’ దీక్ష చేపడుతూ ఉంటారు.
అయితే, మూడున్నరేళ్ల చిన్నారి తనకు తానుగా ఈ దీక్షను తీసుకుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ విషయంపై మధ్యప్రదేశ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కమిషన్ విచారణ చేపట్టింది. దీనిపై ఇందౌర్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.


ఫొటో సోర్స్, SamirKhan
చిన్నారి తల్లిదండ్రులు ఏం చెప్పారు?
చికిత్స చేయించినప్పటికీ, తన బిడ్డ ఆరోగ్యం మెరుగుపడలేదని బాలిక తండ్రి పీయూష్ జైన్ చెప్పారు. దీంతో, జైన మత ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు సంతారా వ్రతాన్ని చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు.
చిన్నారి తల్లి వర్షా జైన్ కూడా తన కుమార్తెను సంతారా ఉపవాసం పాటించేలా చేయడాన్ని సమర్థించారు.
2021 నవంబర్ 20న పుట్టింది వియానా. ఈ ఏడాది జనవరి నుంచి తలనొప్పి, వాంతులతో ప్రతిరోజూ ఇబ్బంది పడుతుందని తల్లి వర్షా జైన్ చెప్పారు.
వైద్య పరీక్షల్లో తన కూతురికి బ్రెయిన్ ట్యూమర్ అని తేలినట్లు తెలిపారు. ఆ తర్వాత ముంబయిలో సర్జరీ చేయించామని, ఆ తర్వాత కొంత కోలుకుందని చెప్పారు.
మార్చి 15 నుంచి మళ్లీ వియానాకు తలనొప్పి వస్తుందని, పాపకు మళ్లీ బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని పరీక్షల్లో తేలిందన్నారు. పాప పరిస్థితి బట్టి వెంటనే ఆపరేషన్ చేయలేమని వైద్యులు చెప్పారు.

ఫొటో సోర్స్, SamirKhan
క్రమంగా పాప పరిస్థితి ప్రమాదకరంగా మారిందని, కనీసం తినలేక, తాగలేక ఇబ్బంది పడిందని వర్షా జైన్ చెప్పారు.
‘‘మార్చి 21న మేం పాపను జైనమత సాధువు దగ్గరికి తీసుకువెళ్లాం. పాప రోజులు దగ్గరపడుతున్నాయి. సంతారా వ్రతాన్ని ఆచరించాలని ఆయన చెప్పారు. సంతారా వ్రతం రాత్రి 9.55కి ప్రారంభమైంది. రాత్రి 10.05కు పాప చనిపోయింది” అని తల్లి వర్షా జైన్ వివరించారు.
‘‘వియానాను నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు, ఆమెకు సమయం దగ్గర పడుతున్నట్లు అనిపించింది. అందుకే పాప సంతారా వ్రతాన్ని ఆచరించేలా చేయాలని తల్లిదండ్రులకు చెప్పాను” అని జైన మత గురువు రాజేశ్ ముని మహారాజ్ తెలిపారు.
‘‘ఉపవాస దీక్షలో ఉన్నవారు కఠినమైన ఆహార నియమాలను పాటించాలా అని తల్లిదండ్రులు అడిగినప్పుడు, ఒకవేళ పాప అడిగితే, ఆమెకు ఇవ్వొచ్చని, ఆమెకు అవసరమైన మెడిసిన్లను ఇవ్వాలని చెప్పాను. దానికి పాప తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.” అని చెప్పారు.
పాపను ఆస్పత్రికి తీసుకెళ్లి, అక్కడ చనిపోయేలా చేయడం కంటే జైన మత ఆచారాల ప్రకారం సంతారా వ్రతాన్ని ఆచరించడం మంచిదని తాము భావించినట్లు చిన్నారి తండ్రి పీయూష్ జైన్ చెప్పారు.
‘‘సంతారా వ్రతాన్ని తీసుకోవాలని ఎవరికి బలవంతం చేయకూడదు. బతకడంలో విసిగిపోయినప్పుడు, ఎలాంటి వైద్య చికిత్స లేని జబ్బును పడ్డప్పుడు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు” అని ఆల్ ఇండియా జైన్ సమాజ్ ప్రెసిడెంట్ రమేశ్ భండారి తెలిపారు.
సంతారా వ్రత ఆచారాలపై సుప్రీంకోర్టులో పోరాడుతున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, SamirKhan
సంతారా ఆచారంపై వివాదం
సంతారా అనేది జైనుల ఆధ్యాత్మిక ఆచారం. కొంతమంది ఈ ఆచారాన్ని వ్యతిరేకిస్తున్నారు. కొందరు దీన్ని ఆత్మహత్య అని కూడా అంటుంటారు.
2006లో సంతారా విధానానికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. ఆధునిక యుగంలో దీనిని పాటించడం సరికాదని ఈ పిటిషన్ పేర్కొంది.
2015లో రాజస్థాన్ హైకోర్టు ఈ పిటిషన్‌పై తన ఆదేశాలను జారీ చేసింది.
ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), సెక్షన్ 309 (ఆత్మహత్యకు ప్రయత్నించడం) వంటి శిక్షించదగ్గ నేరాల కిందకు ఈ ఆచారం వస్తుందని తెలిపింది.
అయితే జైన మతానికి చెందిన వివిధ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు….రాజస్థాన్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.
”జైన మతస్తులు సంతారాను పవిత్రమైన పద్ధతిగా భావిస్తారు. దీన్ని అనుసరించే వారు ఆహారం తీసుకోరు. ఈ విషయం ఇప్పటికే కోర్టు పరిగణనలోకి వచ్చింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత, 2015లో సంతారా విధానాన్ని కొనసాగించుకోవచ్చని సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది” అని సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు చెప్పారు.
”ఈ కేసులో, పాప అప్పటికే బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. నయం కావడానికి, లేదా బతకడానికి అవకాశం లేదు. సంతారా వ్రతాన్ని చేపట్టిన 10 నిమిషాలకే పాప మరణించింది. పాపను టార్చర్ చేయలేదు. ఆమెను ఆకలితో, దాహంతో ఉంచలేదు” అని తెలిపారు.
సంతారా అంటే ఏమిటి?
జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించిన తర్వాత లేదా శరీరం స్పందించని సమయంలో సంతారా వ్రతాన్ని ఆచరించవచ్చన్నది జైన మత విశ్వాసం.
సంతారా ఆచారాన్ని ‘సల్లేఖన వ్రతం’ అని కూడా పిలుస్తారు.
జైన మతానికి చెందిన న్యాయమూర్తి డీకే తుకోల్ ‘సల్లేఖన ఈజ్ నాట్ సూసైడ్’ అనే పుస్తకంలో ఇలా రాశారు.
‘‘సంతారా అంటే ఆత్మశుద్ధి’’ అని అన్నారు. ఎవరైనా దీని ప్రతిజ్ఞను తీసుకుంటే కర్మబంధాల నుంచి విముక్తి పొంది ముక్తిని పొందడమే మానవ జన్మ లక్ష్యంగా భావిస్తారు. సంతారా దీనికి తోడ్పడుతుంది” అని పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)