SOURCE :- BBC NEWS

అమెరికా, ట్రంప్, అల్కాట్రాజ్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్‌కు సమీపంలో ఉన్న ద్వీపం అల్కాట్రాజ్.

1963 వరకు ఇక్కడ అత్యంత భయంకరమైన, కరడుగట్టిన నేరస్థులను బందీలుగా ఉంచేవారు.

ఈ కారాగారాన్ని మళ్లీ ప్రారంభించాలని, విస్తరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు.

”తరచుగా నేరాలకు పాల్పడుతున్నవారితో.. హింసాత్మక, ప్రమాదకర నేరస్థులతో అమెరికా సుదీర్ఘకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అల్కాట్రాజ్ జైలును పునఃప్రారంభించి, దాన్ని శాంతిభద్రతలకు, న్యాయానికి ప్రతీకగా ఉపయోగించాలి” అని ట్రంప్ ఆదివారం ‘ట్రూత్ సోషల్’లో రాశారు.

‘‘పునఃప్రారంభించడానికి వీలుగా అల్కాట్రాజ్‌ను విస్తరించాలి, పునర్నిర్మించాలి. బ్యూరో ఆఫ్ ప్రిజన్స్‌తో పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్‌బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాలను ఈ మేరకు ఆదేశిస్తున్నాను’’ అని ట్రంప్ రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
అమెరికా, ట్రంప్, అల్కాట్రాజ్

ఫొటో సోర్స్, Getty Images

ఒకప్పుడు ప్రమాదకర నేరస్థులను ఉంచే జైలు

వాస్తవానికి అల్కాట్రాజ్ తొలుత నౌకాదళ రక్షణ కోట. 20వ శతాబ్దం తొలినాళ్లలో దీన్ని పునర్నిర్మించి సైనిక కారాగారంగా మార్చారు.

1930లో అమెరికా న్యాయశాఖ దీన్ని స్వాధీనం చేసుకుని.. ఫెడరల్ ప్రిజన్ సిస్టమ్ పరిధిలోని ఖైదీలను ఇక్కడకు పంపించడం ప్రారంభించింది.

అల్ కాపోనె, మైకే కోహెన్, జార్జ్ ‘మెషిన్ గన్’ కెల్లీ వంటి ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్లు సహా సంచలనం సృష్టించిన పలువురు నేరస్థులను ఉంచడానికి ఈ జైలు ఉపయోగపడింది.

హత్యకేసులో జీవితఖైదు పడిన రాబర్ట్ స్ట్రాడ్ పాత్రలో బర్ట్ లాంకాస్టర్ నటించిన 1962 నాటి ‘బర్డ్‌మ్యాన్ ఆఫ్ అల్కాట్రాజ్’ చిత్రంతో ఈ ద్వీపకారాగారం మరింత ప్రచారంలోకి వచ్చింది.

ఇక్కడ జైలు జీవితం గడుపుతూనే పక్షులపై ఆసక్తితో అధ్యయనం ప్రారంభించిన రాబర్ట్ తర్వాత ఒక నిపుణుడైన పక్షి శాస్త్రవేత్తగా ఎదగడం ఈ చిత్రం కథాంశం.

అల్కాట్రాజ్ ద్వీపంలో బందీలైన ఎస్ఏఎస్ (స్పెషల్ ఎయిర్ సర్వీసు) మాజీ కెప్టెన్, ఎఫ్‌బీఐ కెమిస్ట్‌లకు విముక్తి కల్పించడమనే కథాంశంతో 1996లో సీన్ కానరీ, నికోలస్ కేజ్ తారాగణంతో విడుదలైన ‘ది రాక్’ సినిమా చిత్రీకరణ కూడా ఇక్కడే జరిగింది. ఈ సినిమా చిత్రీకరణ చాలా సహజంగా ఉంటుంది.

అమెరికా, ట్రంప్, అల్కాట్రాజ్

ఫొటో సోర్స్, Getty Images

మళ్లీ జైలుగా మారనున్న పర్యటక ప్రాంతం

ఈ జైలు 1963లో మూతపడింది. అందుకు కారణం మిగతా జైళ్ల కన్నా ఈ ద్వీప కారాగార నిర్వహణ భారం మూడింతలు అధికంగా ఉండడమని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్ వెబ్‌సైట్ తెలియజేస్తోంది.

శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జికి దగ్గరలో ఉన్న అల్కాట్రాజ్ ప్రస్తుతం పర్యటక ప్రాంతంగా ఉంది.

అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన, హింసాత్మకమైన నేరస్థులకు ఈ జైలు ఆవాసం అవుతుందని ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు. వెనిజ్వెలా గ్యాంగ్ సభ్యులుగా అనుమానిస్తున్న 200 మందికిపైగా నిందితులను మార్చిలో ఎల్ సాల్వడార్‌లోని జైలుకు పంపిన నేపథ్యంలో స్వదేశంలోని నేరస్థులను విదేశీ జైళ్లకు పంపే విధానంపైనా ట్రంప్ మాట్లాడారు. ఈ విధానం విషయంలో ట్రంప్, కోర్టుల మధ్య విభేదం నెలకొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)