SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, facebook/Geetha Arts
ప్రేమ కథలు రెండు రకాలు. సెంటిమెంట్, ఎమోషన్, త్యాగాలతో నడిచేవి ఒక రకమైతే. అవేమీ లేకుండా కామెడీతో నడిచేవి రెండో రకం. శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘సింగిల్’ రెండో రకం. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మెప్పించిందా? శ్రీ విష్ణు హిట్ కొట్టాడా?.
విజయ్ (శ్రీవిష్ణు) ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తుంటాడు. అరవింద్ (వెన్నెల కిషోర్) అతని స్నేహితుడు. ఎవరో ఒక అమ్మాయిని పడేసి సింగిల్ కార్డ్‌కి ఫుల్‌స్టాఫ్ పెట్టాలని విజయ్ కోరిక.
ఒకరోజు మెట్రో రైలులో పూర్వ (కేతికా శర్మ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఆడికార్ల కంపెనీలో పనిచేస్తుంది. ప్రేమ కోసం హీరో కారు కొనేవాడిలా పరిచయం చేసుకుంటాడు.
మరోవైపు హరిణి (ఇవానా) హీరోని ఇష్టపడుతూ ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటానని అబద్ధం చెప్పి హీరోకి దగ్గరవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. హాస్యంతో సాగే ఈ ముక్కోణపు ప్రేమ ఎన్ని మలుపులు తిరిగిందనేదే కథ..

ఎక్కడో విన్నట్టుందా? అవును, ఇది 1990 నాటి కథే.
సినిమా పుట్టినప్పటి నుంచి ఇలాంటివి ఎన్నో చూశాం. అయితే, సింగిల్ ప్రత్యేకత ఏమిటంటే.. డైలాగులు చాలా వరకూ కొత్తగా, క్యాచీగా ఉంటాయి. నవ్వులు పండిస్తాయి. అయితే, కథ ఎటు వెళుతుందో అర్థం కాక తికమకపడతాం.

ఫొటో సోర్స్, facebook/Geetha Arts
ఆ ఇద్దరే..
హీరో శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. మామూలు డైలాగ్‌లతో కూడా ప్రేక్షకులను నవ్వించారు. సినిమాలో ఈ ఇద్దరి సన్నివేశాలే ఎక్కువుంటాయి.
హీరో హీరోయిన్ కోసం ప్రయత్నించడం, సెకండ్ హీరోయిన్ హీరో కోసం ప్రయత్నించే ఎపిసోడ్స్ కాకుండా కథలోకి కొత్త పాత్రలు, సన్నివేశాలు రాకపోవడంతో సినిమా ముందుకు కదలనట్లే కనిపిస్తుంది.
ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే సీన్ కూడా హిందీ సినిమాల్లో చూసినదే. సెకండాఫ్‌లో ఆ సీన్ గురించి ప్రస్తావన కూడా ఉండదు. బిగినింగ్ నుంచి నాన్ సీరియస్‌గా కనిపించే హీరో, ఉన్నట్టుండి సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా కనిపించడం కథలో కుదరలేదు. సెకండాఫ్‌లో రాజేంద్రప్రసాద్ సబ్‌ప్లాట్ అనవసరం అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, facebook/Geetha Arts
ఎవరెలా చేశారు?
పాత సినిమాల్లో ధర్మవరం సుబ్రమణ్యంలా కనిపిస్తాడు విటివి గణేష్. సత్య చివర్లో అలా మెరుస్తాడు. హీరోయిన్లు ఇద్దరూ ఉన్నారంటే ఉన్నారు. సినిమాలో వారి ముద్ర వేయలేకపోయారు.
సినిమా మొత్తం విష్ణు, వెన్నెల కిషోర్ భుజాలపైనే నడుస్తుంది. హీరోలని అనుకరిస్తూ విష్ణు చెప్పే డైలాగులు ఈ సినిమా ప్రత్యేకం.
నిర్మాణ విలువలు కూడా పూర్‌గా ఉన్నాయి. కథలోకి కొత్త పాత్రలు రావు, లోకేషన్లు కూడా రావు.
సంగీతం, కెమెరా, జస్ట్ ఓకే. దర్శకుడు కార్తిక్ రాజ్ కథని కాకుండా కేవలం డైలాగుల్ని నమ్ముకుని సినిమా తీసినట్లుగా ఉంది.
కామెడీకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి, కనీస జాగ్రత్తలు కథనంలో తీసుకున్నా తగిన ఫలితం దక్కేది.
కాసేపు నవ్వుకోవాలనుకునే వాళ్లు ఒకసారి ప్రయత్నం చేయొచ్చు.

ఫొటో సోర్స్, facebook/Geetha Arts
ప్లస్ పాయింట్స్
1.శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ
2.డైలాగులు
మైనస్ పాయింట్స్
1.పాత కథ, కథనాలు
2. సెకండాఫ్
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)