SOURCE :- BBC NEWS

సింధు లోయ నాగరికత లిపి

ఫొటో సోర్స్, Getty Images

తరతరాలుగా పండితులకే అంతుబట్టకుండా ఉన్న ఒక పురాతన లిపిని అర్థం చేసుకున్నామంటూ కంప్యూటర్ సైంటిస్ట్ అయిన రాజేశ్ పీఎన్ రావుకు ప్రతీ వారం ప్రజల నుంచి ఈమెయిళ్లు వస్తుంటాయి.

ఈ లిపిని అర్థం చేసుకున్నామని చెప్పేవారిలో ఇంజినీర్లు, ఐటీ నిపుణుల నుంచి పదవీ విరమణ చేసినవారు, టాక్స్ ఆఫీసర్ల వరకు ఉంటారు. వీరిలో అత్యధికులు భారతీయులు లేదా విదేశాల్లో నివసిస్తోన్న భారత సంతతి ప్రజలే.

వారంతా సింధు లోయ నాగరికత లిపిని అర్థం చేసుకున్నామని నమ్ముతారు. సంకేతాలు, చిహ్నాల సమ్మేళనం సింధు లిపి.

”ఈ లిపిని సరిగ్గా అర్థం చేసుకున్నామని వారు చెబుతారు. అక్కడితో సమస్య పరిష్కారం అయ్యిందని అనుకుంటారు” అని వాషింగ్టన్ యూనివర్సిటీలోని హవాంగ్ ఎండోడ్ ప్రొఫెసర్ రాజేశ్ పీఎన్ రావు చెప్పారు. సింధు లోయ నాగరికత లిపిపై ఆయన పలు అధ్యయన పత్రాలను రాశారు.

ఈ లిపి గుట్టు విప్పే ప్రయత్నాలను మరింత ప్రోత్సహించేందుకు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల సింధు లోయ లిపి గురించి ఒక ప్రకటన చేశారు. ఈ లిపిని సరిగ్గా డీకోడ్ చేసినవారికి 10 లక్షల డాలర్లు(సుమారు రూ. 8.66 కోట్లు) నజరానా అందిస్తామని స్టాలిన్ ప్రకటించారు. దీంతో ఈ లిపిని డీకోడ్ చేసే ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి.

ప్రపంచంలోని అత్యంత పురాతన పట్టణ నాగరికతల్లో ఒకటైన సింధు, హరప్పా నాగరికత 5,300 ఏళ్ల క్రితం ప్రస్తుత వాయవ్య భారత్‌, పాకిస్తాన్‌లలో విలసిల్లింది.

ఈ నాగరికత కాలంలో రైతులు, వ్యాపారులు కాల్చిన ఇటుకలతో, గోడలతో కూడిన నగరాల్లో నివసించారు. శతాబ్దాల పాటు ఈ నాగరికత వర్ధిల్లింది. వందేళ్ల క్రితం సింధు లోయ నాగరికత ఆనవాళ్లు బయల్పడినప్పుడు ఈ రీజియన్ వ్యాప్తంగా దాదాపు 2,000 ప్రాంతాలను గుర్తించారు.

ఈ నాగరికత క్షీణత వెనుక కారణాలు అస్పష్టంగానే ఉన్నాయి. అక్కడ యుద్ధం, కరవు, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లుగా స్పష్టమైన ఆధారాలేవీ లేవు. ఆ నాగరికత కాలం నాటి లిపిని అర్థం చేసుకోవడం అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఈ కారణంగా ఆనాటి భాష, పాలన, నమ్మకాలు ఎవరికీ అంతుబట్టని విషయాలుగా మిగిలిపోయాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
సింధు లోయ నాగరికత

ఫొటో సోర్స్, Getty Images

లిపిని అర్థం చేసుకోవడంలో సవాళ్లు

భాషావేత్తలు, శాస్త్రవేత్తలు, పురాతత్వవేత్తలు వంటి నిపుణులు సింధు లిపిని అర్థం చేసుకునేందుకు శతాబ్ద కాలంగా ప్రయత్నించారు. సింధు లిపిని బ్రాహ్మి లిపితో, ద్రవిడ, ఇండో ఆర్యన్ భాషలతో, సుమేరియన్ భాషతో అనుసంధానించే సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. రాజకీయ, మతపరమైన చిహ్నాలతో ఈ లిపి ఏర్పడిందనే వాదనలు కూడా వచ్చాయి.

ఈ లిపి రహస్యాలు ఇంకా నిగూఢంగానే ఉన్నాయి.

”సింధు లిపి బహుశా అత్యంత ముఖ్యమైన రచనా విధానం. ఇది ఎవరికీ అవగతం కాలేదు” అని ఒక ప్రముఖ ఇండోలజిస్ట్ అస్కో పర్పోలా చెప్పారు.

ఈ రోజుల్లోని అత్యంత జనాదరణ పొందిన సిద్ధాంతాలు, ఈ లిపిని వేదాలలోని అంశాలతో సరిపోల్చడంతోపాటు, ఇందులోని శాసనాలకు ఆధ్యాత్మిక, మాంత్రిక అర్థాలను ఆపాదిస్తాయి.

అయితే ఈ ప్రయత్నాలన్నీ ఒక విషయాన్ని విస్మరిస్తున్నాయి. వాణిజ్య, వ్యాపారాల కోసం ఉపయోగించిన ఈ లిపి ఎక్కువగా శిలా శాసనాలపై కనిపిస్తుంది. ఇందులో మతపరమైన, ఆధ్యాత్మిక అంశాలు ఉండే అవకాశాలు తక్కువనే విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని రావు అన్నారు.

సింధు లిపిని అర్థం చేసుకోవడంలో చాలా సవాళ్లు ఉన్నాయి.

మొదటిది ఈ లిపి ఉన్న స్క్రిప్టులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. శాసనాలు, కుండలు, ఫలకాలు వంటి చిన్న వస్తువులపై దాదాపు 4,000 స్క్రిప్టులు ఉన్నాయి.

ఈ స్క్రిప్టులు సంక్షిప్తంగా ఉండటం మరో సవాలు. సగటున అయిదు సంకేతాలు లేదా చిహ్నాలతో ఇది ఉంటుంది. గోడలు, ఫలకాలు, రాతి శిలలపై కూడా తక్కువ పరిమాణంలో స్క్రిప్టు ఉంటుంది.

సాధారణంగా ఈ లిపిలోని చతురస్రాకారంలో ఉండే ముద్రలను పరిగణలోకి తీసుకుంటే అదొక యూనికార్న్ రూపంలో కనిపిస్తుంది. దానిపక్కన ఒక వస్తువు ఉంటుంది. దాని అర్థం ఏంటో కూడా ఎవరికీ తెలియదు.

సింధు లోయ నాగరికత

ఫొటో సోర్స్, Getty Images

లిపి విశ్లేషణకు మెషిన్ లర్నింగ్ టెక్నిక్

సింధు లిపిని అవగతం చేసుకోవడానికి, ఇందులోని సంక్లిష్టతను పరిష్కరించడానికి ఇటీవలి కాలంలో కంప్యూటర్ సైన్స్‌ను ఉపయోగించారు. లిపిని విశ్లేషించడానికి, అందులోని నిర్మాణాలను, సంకేతాలను అర్థం చేసుకోవడానికి పరిశోధకులు, మెషిన్ లెర్నింగ్ టెక్నిక్‌లను వాడారు.

ఇలాంటి పద్ధతులను వాడిన వారిలో ముంబయికి చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ (టీఐఎఫ్‌ఆర్) పరిశోధకురాలు నిషా యాదవ్ ఒకరు.

రావు వంటి పరిశోధకులతో కలిసి ఈ లిపిని విశ్లేషించడానికి స్టాటిస్టికల్, కంప్యూటేషనల్ పద్ధతులను వర్తింపచేయడంపై ఆమె దృష్టి సారించారు.

స్క్రిప్టులోని సంకేతాలతో కూడిన డిజిటల్ డేటా సెట్ ద్వారా వారు ఆసక్తికర నమూనాలను గుర్తించారు.

”ఆ సంకేతాలు పూర్తి పదాలా లేక పదాల్లోని భాగమా లేక వాక్యంలోని భాగమా అనే సంగతి మాకు ఇప్పటికీ తెలియదు” అని నిషా యాదవ్ చెప్పారు.

సింధు లోయ నాగరికత

ఫొటో సోర్స్, Getty Images

అంతర్లీనంగా తర్కం

లిపిలో 67 సంకేతాలను యాదవ్, ఆమె సహచర పరిశోధకులు గుర్తించారు. ఈ 67 సంకేతాలతో 80 శాతం లిపిని రాయవచ్చు.

రెండు హ్యాండిల్స్‌తో ఒక కూజాలా ఉన్న సంకేతాన్ని తరచుగా ఈ లిపిలో వాడారు. అలాగే ఎక్కువ సంకేతాలతో మొదలైన స్క్రిప్టులు తుదివరకు వచ్చేసరికి తక్కువ సంకేతాలతో ముగిశాయి. కొన్ని నమూనాలు ఊహించినదానికంటే ఎక్కువసార్లు లిపిలో కనిపించాయి.

అస్పష్టమైన, పాడైపోయిన రచనలను పునరుద్ధరించడానికి ఒక మెషిన్ లెర్నింగ్ స్క్రిప్ట్ మోడల్‌ను రూపొందించారు. భవిష్యత్ పరిశోధనలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

”ఈ లిపి నిర్మాణాత్మకంగా ఉంది. ఈ లిపిలో అంతర్లీనంగా ఒక లాజిక్ ఉన్నట్లు మాకు అర్థమైంది” అని నిషా చెప్పారు.

సింధు లిపి తరహాలోనే అనేక సవాళ్ల కారణంగా చాలా పురాతన లిపిలు ఇంకా ఎవరికీ అంతుబట్టని విషయాల్లాగే మిగిలిపోయాయి.

ప్రొటో-ఎలమైల్ (ఇరాన్), లీనియర్ ఎ (క్రీట్), అట్రస్కన్ (ఇటలీ) వంటి స్క్రిప్టుల్లో అంతర్లీనంగా ఉన్న భాష గురించి ఎవరికీ తెలియదని రావు ఉదహరించారు.

సింధు లోయ నాగరికత

ఫొటో సోర్స్, Getty Images

తమిళనాడుకు, సింధు లోయ సంస్కృతికి సంబంధం ఉందా?

ఇక భారత్ విషయానికొస్తే, లిపిని డీకోడ్ చేస్తే నజరానా ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎందుకు ప్రకటించారో స్పష్టంగా తెలియదు. సింధు లోయ సంకేతాలను తమిళనాడులో బయల్పడిన గ్రాఫిటీకి అనుసంధానిచ్చే కొత్త అధ్యయనానికి ఇది దారి తీసింది.

తమిళనాడులోని 140 ప్రాంతాల నుంచి వెలికి తీసిన 14,000కు పైగా కుండల శకలాలను కె రాజన్, ఆర్ శివనంథన్ విశ్లేషించారు. ఈ కుండలపై గ్రాఫిటీ ఉంది. వాటిలో 2,000కు పైగా చిహ్నాలు ఉన్నాయి.

”ఇందులోని చాలా చిహ్నాలు సింధు లిపిలోని చిహ్నాలతో పోలి ఉన్నాయి. దాదాపు 60 శాతం చిహ్నాలు, సింధు లిపితో సరిపోలుతున్నాయి. ఇక్కడ కనిపించిన 90 శాతం గ్రాఫిటీ గుర్తులు, సింధు లోయ నాగరికత కాలం నాటి వాటితో సరితూగుతున్నాయి” అని పరిశోధకులు అంటున్నారు.

ఇది సింధు లోయ, దక్షిణ భారతం మధ్య ఒక రకమైన సాంస్కృతిక సంబంధం ఉన్నట్లు సూచిస్తోందని రాజన్, శివనంథన్ అన్నారు.

స్టాలిన్ చేసిన ప్రకటన తమిళనాడు వారసత్వం, సంస్కృతికి ఆయన గొప్ప పరిరక్షకుడిగా భావించేలా చేసిందని పలువురు నమ్ముతున్నారు. దేశాన్ని పాలిస్తోన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చినట్లు భావిస్తున్నారు.

అయితే, స్టాలిన్ ప్రకటించిన నజరానాను ఇప్పట్లో ఎవరూ గెలుచుకునే అవకాశం లేదని పరిశోధకులు అంటున్నారు. సింధు లిపిని అవగతం చేసుకోవడంలో కీలకమైన అన్ని లిఖిత పూర్వక ఆధారాలను డేటాబేస్‌లో భద్రపరిచారు.

”సింధు లోయ ప్రజలు ఏం రాశారు? ఆ విషయాలు మనకు అర్థమైతే బావుంటుంది” అని నిషా యాదవ్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)