SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, E.Gopi
మహేష్, శైలజ సాప్ట్‌వేర్ ఉద్యోగులు. రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోం విధానంలో జాబ్ చేస్తూ విశాఖలోనే ఉంటున్నారు. చందనోత్సవం రోజున లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు సింహాచలం వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఏడుగురిలో వీరిద్దరూ ఉన్నారు.
శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జరి మహాలక్ష్మి కూడా ఈ ప్రమాదంలో మరణించారు. దీంతో వీరి కుటుంబంలో నలుగురు మరణించారు.
సింహాచలం దేవస్థానంలో గోడకూలిన ఘటనలో మొత్తం ఏడుగురు చనిపోయారు.

మిగిలిన ముగ్గురిలో ఇద్దరు డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట వాసులు.
విశాఖలో ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ చేస్తున్న పత్తి దుర్గాస్వామి నాయుడు, ఫార్మా కంపెనీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న మణికంఠ చనిపోయారు.
మరొకరు సింహాచలం సమీపంలోని అడవివరం ప్రాంతానికి చెందిన వెంకటరావు. ఈయన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి.

‘కనీసం గోడలైనా కట్టడం రాదా ఈ అధికారులకి’
‘‘మహేష్, శైలజకు పెళ్లై మూడేళ్లైంది. ఇప్పుడు వారిద్దరికీ నూరేళ్లు నిండిపోయాయి” అంటూ మహేష్ తల్లి శాంతి విశాఖలోని కేజీహెచ్ మార్చురి వద్ద కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు.
“బాబు టీవీ వాళ్లు వచ్చారు. నీ కోసం మాట్లాడమంటున్నారు. నేను టీవీలో మాట్లాడితే చూడాలని అనేవాడివి కదా.. రారా నేను మాట్లాడుతున్నానంటూ పదే పదే కొడుకు మహేష్‌ని, కోడలు శైలజని రమ్మని పిలుస్తూనే ఉన్నారామె.
మహేష్‌కు ఒక సోదరి ఉన్నారు. ఆమె భర్త మూడేళ్ల క్రితం మరణించారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. ఇంట్లో మహేష్ ఒక్కడే మగపిల్లాడు కావడంతో, అందరికి అతనే తోడుగా ఉండేవాడని శాంతి బీబీసీతో అన్నారు.
దేవుడి దగ్గరకి వెళ్లి వస్తావని అనుకుంటే.. అక్కడే ఉండిపోయావా.. కనీసం గోడలైనా కట్టడం రాదా ఈ అధికారులకి అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

‘అదే చివరి మేసేజ్’
మహేష్, శైలజ దంపతులతో పాటు శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త మహాలక్ష్మి రాత్రి 1.30 గంటలకు ఒకే కారులో చందనోత్సవానికి బయలుదేరి వెళ్లారు.
“బయలుదేరే ముందు రాత్రి 10.30 గంటలకి మహేష్ ఫోన్ స్టేటస్ చూశాను. ఒక రాజకీయ నాయకుడిని కలసిన ఫోటో పెట్టుకున్నాడు. నన్నెందుకు తీసుకెళ్లలేదని వాట్సప్ చేస్తే.. నేను ఎక్కడికి వెళ్లినా అక్కడ నువ్వున్నట్లే కదా అన్నాడు. ఉదయం లేచే సరికి మహేష్ దంపతులతో పాటు మా కుటుంబంలో మొత్తం నలుగురు చనిపోయారనే వార్త వినాల్సి వచ్చింది” అని మృతుడు మహేష్‌కి బావ వరుసయ్యే ఇప్పిలి గోపి బీబీసీతో చెప్పారు.
శైలజ తండ్రి మార్చురీ దగ్గరే ఉన్నారు. భార్యను, కుమార్తెను కోల్పోయిన ఆయన గాల్లోకి చూస్తూ పదే పదే కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే…
ఈ విషాద ఘటన చందనోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూ. 300 క్యూలైన్‌లో జరిగింది. ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. క్యూలైన్ దారిలో, సెల్ ఫోన్లు, లగేజ్ భద్రపరిచే గదుల సమీపంలో గత 15 రోజులుగా కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. అక్కడ ఐరన్ స్టాండ్లతో షెల్టర్లు, యాష్ బ్రిక్స్‌తో గోడలను నిర్మించారు.
“అలా నిర్మించిన గోడే కూలిపోయింది. బుధవారం రాత్రి 2.30 గంటల సమయంలో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఆ వర్షానికి తడిసిన గోడ క్యూలైన్‌లో ఉన్న భక్తులపై పడిపోయింది. ఆ గోడ మీదపడడంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు” అని ఘటన స్థలానికి వచ్చిన హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు.

విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
ప్రమాదం స్థలాన్ని మంత్రులు, అధికారులతో పాటు విపక్ష వైసీపీ నేతలు పరిశీలించారు. 10 రోజుల క్రితమే నిర్మించిన గోడ.. ఇలా ఎలా కూలిపోయిందని వైసీపీ నేతలు ప్రశ్నించారు.
ఇదే ప్రశ్నతో మృతుల బంధువులు కూడా అధికారులను, పరామర్శకు వచ్చిన నాయకులను నిలదీశారు.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఘటనపై విచారణ జరిపి 72 గంటల్లోగా ప్రమాదానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు.
జిల్లా కలెక్టర్ సమక్షంలో కమిటీ దర్యాప్తు చేయనుంది. ఈ కమిటీలో రెవెన్యూ, ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారు.
గోడ నిర్మాణంలో లోపాలు ఉన్నట్లుగా గుర్తించారు. బాధ్యులు ఎవరైనా సరే కఠిన చర్యలు ఉంటాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.

మార్చురీ వద్ద మృతుల కుటుంబాల ఆందోళన
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం, మృతుల కుటుంబాల్లో ఒకరికి దేవాదాయశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది.
అయితే, తమకి కాంట్రాక్ట్ విధానంలో కాకుండా, పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పించాలంటూ మృతుల కుటుంబాలు కేజీహెచ్ మార్చురీ వద్ద అందోళన చేపట్టాయి.
విషయం తేల్చేదాకా మృతదేహాలను కూడా తీసుకుని వెళ్లమంటూ అక్కడికి వచ్చిన హోంమంత్రితో చెప్పారు.
విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి రెగ్యులర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని హోంమంత్రి చెప్పడంతో ఆందోళన విరమించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)