SOURCE :- BBC NEWS

సారంగపాణి జాతకం మూవీ, ప్రియదర్శి

ఫొటో సోర్స్, Facebook/SrideviMovies

కోర్ట్ సినిమాతో జోష్‌లో ఉన్న ప్రియ‌ద‌ర్శి, సెన్సిటివ్ కామెడీ ద‌ర్శ‌కుడు మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సారంగ‌పాణి జాత‌కం ప్రేక్ష‌కులను మెప్పించిందా, న‌వ్వించిందా చూద్దాం.

2004లో గ్ర‌హ‌ణం సినిమాతో ప్రారంభ‌మైన మోహ‌న్‌కృష్ణ అష్టాచెమ్మా, అమీతుమీ, స‌మ్మోహ‌నం లాంటి మంచి కామెడీలు తీశారు.

జంధ్యాల లేని లోటు తీరుస్తాడ‌ని అంద‌రూ ఆశించారు. క‌రోనాలో నానితో తీసిన “వి” పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు.

2022లో ‘ఆ అమ్మాయి గురించి నీకు చెప్పాలి’ తీసినా ఎవ‌రికీ గుర్తు లేదు. మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత సారంగ‌పాణి జాతకం వ‌చ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఏమిటి కథ?

సారంగ‌పాణి ఒక కార్ల కంపెనీలో ప‌ని చేస్తూ ఉంటాడు. అక్క‌డే ప‌ని చేస్తున్న మైథిలి (రూపా కొడువాయూర్‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె కూడా ఓకే అంటుంది. ఎంగేజ్‌మెంట్ కూడా అవుతుంది. అయితే హీరోకి విప‌రీత‌మైన జాత‌కాల పిచ్చి, హ‌స్త సాముద్రికం వంటివాటిపై న‌మ్మ‌కం.

జిగ్నేశ్వ‌ర్ అనే ఆస్ట్రాల‌జ‌ర్ ఒక ప‌బ్‌లో కలుస్తాడు. నీ జాత‌కంలో ఒక మ‌ర్డ‌ర్ చేస్తావ‌ని రాసి ఉంద‌ని సారంగ‌పాణికి చెబుతాడు. హ‌త్య చేసి జైలుకు వెళితే మైథిలి అన్యాయ‌మైపోతుంద‌ని, అందుక‌ని పెళ్లికి ముందే హ‌త్య చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. దీనికి స్నేహితుడు వెన్నెల కిశోర్ సాయం తీసుకుంటాడు. హ‌త్య చేసినా దొరక్కుండా ఉండేలా ప‌థ‌కం వేస్తాడు.

సారంగ‌పాణి పెళ్లిని వాయిదా వేసి ఒక ముస‌ల‌మ్మ‌కి విష‌పు చాక్లెట్ ఇచ్చి చంపాల‌ని అనుకుంటాడు. బెడిసి కొడుతుంది. ఇంకొక ప్ర‌యత్నం చేస్తాడు. అదీ కుద‌ర‌దు.

చివ‌రికి ఏం చేస్తాడు? జాత‌కాన్ని జ‌యించి ఎలా ప్రేమ‌ని సాధించుకుంటాడ‌నేది మిగ‌తా క‌థ‌.

సారంగపాణి జాతకం మూవీ, ప్రియదర్శి

ఫొటో సోర్స్, Facebook/SrideviMovies

ఎలా ఉంది?

ఇది సింగిల్ లైన్ క‌థ‌. హీరో మ‌ర్డ‌ర్ ప్ర‌య‌త్నాలు, దాని ప‌ర్య‌వ‌సానాలు 2 గంట‌ల 15 నిమిషాలు ఇదే ఉంటుంది.

క‌థ‌లో కొత్త‌కొత్త సంఘ‌ట‌న‌లు లేక‌పోవ‌డం, ఊహ‌కి అంద‌ని ట్విస్టులు ఏమీ లేక‌పోవ‌డంతో సినిమా ప్లాట్‌గా మారిపోయింది.

మ‌ర్డ‌ర్ చేసే హస్త రేఖ ఉంద‌ని జ్యోతిష్యుడు చెబితే హీరో న‌మ్మ‌డం.. దానికి స్నేహితుడు స‌హ‌క‌రించ‌డం అనేది కొంచెం కూడా క‌న్విన్సింగ్‌గా లేదు.

కామెడీ క‌థ‌లో లాజిక్‌లు అడ‌గ‌కూడ‌ద‌ని అనుకుందాం. అయినా అక్క‌డ‌క్క‌డ త‌ప్ప‌, కామెడీ వ‌ర్కౌట్ కాలేదు. సెకండాఫ్ అంతా హోట‌ల్‌లో ఇరుక్కుపోయి స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంది.

1960-70ల‌ మ‌ధ్య‌లో టెంపోరావు , కొమ్మూరి సాంబ‌శివ‌రావు ఇలాంటి అంశాల‌తో డిటెక్టివ్ న‌వ‌ల‌లు రాసేవాళ్లు. ఆ కాలంలో చెల్లింది. ఇప్పుడు కూడా ఆ ర‌కం క‌థ‌ల‌తో సినిమాలు తీస్తే ఎలా?

1986లో లేడీస్ టైల‌ర్ వ‌చ్చింది. దాంట్లో కూడా హీరోకి జ్యోతిష్యం పిచ్చి. తొడ‌మీద పుట్టు మ‌చ్చ‌తో వున్న అమ్మాయిని చేసుకుంటే ల‌క్ష్మీదేవి క‌రుణిస్తుందని ఒక కోయ‌దొర చెబుతాడు. ఆ మ‌చ్చ వెత‌క‌డ‌మే సినిమా. క్లాసిక్ కామెడీ. ఇపుడు చూసినా ప‌గ‌ల‌బ‌డి నవ్వుతాం.

సారంగపాణి జాతకం

ఫొటో సోర్స్, Facebook/SrideviMovies

సీనియర్ నటులున్నా..

సారంగ‌పాణిలో కూడా ఇలాంటి విష‌య‌మే. కాక‌పోతే మ‌చ్చ‌కి బ‌దులు మ‌ర్డ‌ర్. ఒక హ‌త్యా ప‌థ‌కంతో కామెడీ సృష్టించ‌డం క‌ష్టం. హీరోపైన మ‌న‌కి ఎలాంటి సానుభూతి ఉండ‌దు. మంచం మీద ఉన్న ముస‌ల‌మ్మ‌ని చంప‌డానికి విష‌పు చాక్లెట్ ఇస్తే మ‌న‌కి నవ్వాల‌నిపించ‌దు. అదే విధంగా సెకెండాఫ్‌లో కూడా న‌వ్వుకంటే హీరో అవ‌స్థ‌ల‌పైన జాలి ఎక్కువ‌గా క‌లుగుతుంది.

ఇంద్ర‌గంటి ఎక్క‌డో ఆగిపోయి పాత క‌థ‌నే అందుకున్నాడు. క‌రోనా త‌ర్వాత ప్రేక్ష‌కుడు మారిపోయాడు. మామూలు క‌థ‌లు ఆన‌వు. క్రైం ఎలిమెంట్ వున్న ఈ క‌థ‌కి అనేక లేయ‌ర్లు ఉంటే బ‌తికేది. న‌రేష్‌, వ‌డ్ల‌మాని శ్రీ‌నివాస్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ లాంటి మంచి న‌టులున్నా, క‌థ‌లో స్పేస్ లేక వృథా అయిపోయారు. యూట్యూబ్ యాంక‌ర్ వ‌ర్షిణి చిన్న‌పాత్ర‌లో క‌నిపించి న‌వ్వించ‌డం విశేషం.

ప్రియ‌ద‌ర్శి మంచి టైమింగ్ ఉన్న న‌టుడు. అత‌నికి వెన్నెల కిశోర్, వైవా హ‌ర్ష క‌లిస్తే నెక్ట్స్ లెవెల్‌. బ‌ల‌హీన‌మైన క‌థ‌ని కాసేపైనా న‌వ్వుల‌తో నిల‌బెట్టారంటే వీళ్ల స్టామినానే కార‌ణం. డైలాగ్‌లు కొన్ని చోట్ల పేలాయి. కొన్నిచోట్ల స్టాండ‌ప్ కామెడీలా అనిపించింది.

సినిమాలో ఏమిటీ సీరియ‌ల్ డ్రామా, అస‌లేం జ‌రుగుతోంది అనే డైలాగ్‌లున్నాయి. ప్రేక్ష‌కుడి అభిప్రాయం కూడా అదే. మొత్తం మీద మోహ‌న్‌కృష్ణ జాత‌కం బాగాలేదు.

సారంగపాణి జాతకం, ప్రియదర్శి

ఫొటో సోర్స్, Facebook/SrideviMovies

ప్లస్, మైనస్ పాయింట్స్

ప్ల‌స్ పాయింట్స్:

1.వెన్నెల కిశోర్‌, వైవా హ‌ర్ష పంచ్ డైలాగ్స్‌

2.నిడివి త‌క్కువ వుండ‌డం

మైన‌స్ పాయింట్స్:

1.పాత క‌థ‌, క‌థ‌నం

2.కామెడీ వ‌ర్కౌట్ కాలేదు

2.సుదీర్ఘ క్లైమాక్స్‌

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)