SOURCE :- BBC NEWS

ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో

ఫొటో సోర్స్, Getty Images

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో తీవ్రవాదుల దాడి జరిగిన ఒక రోజు తర్వాత, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారతదేశం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది.

పాకిస్తాన్‌తో దౌత్య కార్యకలాపాలను తగ్గించడం, సరిహద్దును మూసివేయడం, సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం తదితర నిర్ణయాలు తీసుకుంది.

అయితే పాకిస్తాన్ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇకపై పాకిస్తాన్ గగనతలాన్ని ఇండియా ఉపయోగించుకోలేదు. దీంతోపాటు 1972 నాటి సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసినప్పటి నుంచి, సిమ్లా ఒప్పందం నుంచి పాకిస్తాన్ వైదొలగాలనే డిమాండ్ ఆ దేశంలో బలంగా వినిపిస్తోంది.

“పాకిస్తాన్‌లో కొత్త చర్చ జరుగుతోంది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో సంతకం చేసిన సింధు జలాల ఒప్పందానికి గుడ్‌బై చెప్పాలని భారత్ కృతనిశ్చయంతో ఉంటే , ఏ అంతర్జాతీయ సంస్థ మధ్యవర్తిత్వం వహించని సిమ్లా ఒప్పందం నుంచి వైదొలిగే హక్కు కూడా పాకిస్తాన్‌కు ఉంది” అని పాకిస్తానీ జర్నలిస్ట్ హమీద్ మీర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

“భారతదేశం ఏకపక్షంగా సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. దీనికి ప్రతిగా, పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం నుంచి వైదొలగాలి. ముఖ్యంగా కశ్మీర్‌కు సంబంధించిన విషయాలలో అని పాక్ పాలిత కశ్మీర్ మాజీ ప్రధాని రాజా మొహమ్మద్ ఫరూఖ్ హైదర్ ఖాన్ ఎక్స్‌లో రాశారు.

పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించగా.., అది తమకు ప్రయోజనం చేకూరుస్తుందని చాలా మంది పాకిస్థానీయులు అభిప్రాయపడుతున్నారు.

సిమ్లా ఒప్పందం కశ్మీర్ సమస్యపై అంతర్జాతీయ జోక్యాన్ని నివారించిందని , కానీ ఇప్పుడు ఎటువంటి దౌత్యపరమైన బాధ్యత లేకుండా ప్రతి అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్, కశ్మీర్ సమస్యను లేవనెత్తవచ్చని వారు వాదిస్తున్నారు. కానీ పాకిస్తాన్ ఇప్పటికే అలా చేస్తోంది. సిమ్లా ఒప్పందం నుంచి బయటకు వచ్చాక అంతర్జాతీయ మీడియాలో కూడా కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ గట్టిగా మాట్లాడుతుందని పాకిస్తాన్ విశ్లేషకులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
జమ్మూ కశ్మీర్‌

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ సిమ్లా ఒప్పందం?

భారత్, పాకిస్తాన్ మధ్య 1971 యుద్ధం తరువాత సిమ్లా ఒప్పందంపై రెండు దేశాలూ సంతకం చేశాయి. ఇది ఒక అధికారిక ఒప్పందం, రెండు దేశాల మధ్య శత్రుత్వ అంతానికి సిమ్లా ఒప్పందాన్ని ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ ఒప్పందం ప్రకారం అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి.

1971 యుద్ధం తర్వాత, సిమ్లా ఒప్పందం ప్రకారం నియంత్రణ రేఖను (LOC) ఏర్పాటు చేశారు. రెండు దేశాలు దానిని గౌరవించడానికి అంగీకరించాయి. ఏ దేశం కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. నియంత్రణ రేఖని ఒక ప్రమాణంగా ఉపయోగించి, ఇరుపక్షాలూ ఒకరి భూభాగం నుంచి మరొకరు సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అంగీకరించాయి.

సింధు జల ఒప్పందం నిలిపివేతకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం నుంచి వైదొలగడం ఎంతవరకు సరైనది?

ఈ ప్రశ్నకు దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని దక్షిణాసియా అధ్యయన కేంద్రం ప్రొఫెసర్ మహేంద్ర పీ లామా సమాధానం చెప్పారు.

“సింధు జలాల ఒప్పందంలోని ప్రతి వాక్యం ఇప్పటికీ సజీవంగా ఉండగా, సిమ్లా ఒప్పందం ఇప్పటికే చచ్చిపోయింది. చచ్చిపోయిన ఒప్పందాన్ని సజీవమైన, ప్రభావవంతమైన ఒప్పందంతో పోల్చలేం. పాకిస్తాన్ చాలా కాలం క్రితమే హత్య చేసిన ఒప్పందాన్ని ముగించాలని పాకిస్తాన్ ప్రజలు మాట్లాడుతున్నారు’’

“సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం పాకిస్తాన్‌పై చాలా ప్రభావాన్ని చూపుతుంది” అని ప్రొఫెసర్ లామా అంటున్నారు. దీనివల్ల పాకిస్తాన్‌లో 80 శాతానికి పైగా ప్రజలు ప్రభావితమవుతారని, పాకిస్తాన్ వ్యవసాయ ఉత్పత్తులలో 80 శాతానికి పైగా సింధు జలాల ఒప్పందం నుంచి వచ్చే నీటిపై ఆధారపడి ఉంటాయి. ఈ నీటి సరఫరా నిలిచిపోతే, పాకిస్తాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు.’’ అని లామా చెప్పారు.

“సిమ్లా ఒప్పందం విషయానికొస్తే, ఇప్పుడు దానికి అర్థం లేదు. పాకిస్తాన్ ప్రతిరోజూ దీనిని ఉల్లంఘిస్తోంది. అటువంటి పరిస్థితిలో ఆ దేశం ఒప్పందం నుంచి బయటపడటమే మంచిది. ” అన్నారు.

లద్దాఖ్‌లోని సింధు నది

ఫొటో సోర్స్, Getty Images

‘భారత్‌కు నష్టమేమీ లేదు’

అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF)సంస్థ సీనియర్, పాకిస్తాన్ వ్యవహారాల పరిశీలకులు సుశాంత్ సరీన్ మాట్లాడుతూ, సిమ్లా ఒప్పందం నుంచి పాకిస్తాన్ వైదొలగడం భారతదేశంపై ఏమాత్రం ప్రభావం చూపదని అన్నారు.

“ఇది కశ్మీర్ సమస్యపై పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో భారత్‌కే ఉపయోగపడుతుంది” అని సరిన్ అంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ ఎప్పడో ఈ ఒప్పందాన్ని వదిలేసింది. ఏనాడూ ఒప్పందానికి కట్టుబడి లేదు. అలా కట్టుబడి ఉంటే కార్గిల్ యుద్ధాన్ని ప్రారంభించేది కాదు. ప్రతిరోజూ సరిహద్దు వెంబడి కాల్పులు జరిపేదీ కాదు, తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేదీ కాదు. ఇలాంటి పరిస్థితులలో ఒప్పందం నుంచి పాకిస్తాన్ వైదొలగాలనుకుంటే అది ఇప్పటికే చనిపోయిన ఒప్పందాన్ని సమాధిచేయడం మాత్రమే. అంతేకానీ దానివల్ల భారత్‌కు కొత్తగా వచ్చే నష్టమేమీలేదు’’ అన్నారు.

భారతదేశం సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించలేదా? జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించడం కాదా?

“ఆర్టికల్ 370 రద్దు సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు కాదు” అని ప్రొఫెసర్ మహేంద్ర లామా అన్నారు.

“ఆర్టికల్ 370 భారత రాజ్యాంగానికి సంబంధించిన విషయం. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం నుంచి వైదొలిగితే భారతదేశంపై దాని ప్రభావం ఉండదు. ఏదేమైనా, పాకిస్తాన్‌ను సిమ్లా ఒప్పందంతో కాదు, బలంతో మాత్రమే ఎదుర్కోగలం” అని ఆయన చెప్పారు.

సింధు జలాల నిర్వహణ భారత్‌కు సాధ్యమేనా?

“ఇప్పుడు ఈ నీటి నిర్వహణ కష్టంగా ఉండవచ్చు, కానీ ఒక ముఖ్యమైన నిర్ణయానికి రావాలంటే మొదట్లో కొన్ని ఆటంకాలు తప్పవు” అని ప్రొఫెసర్ లామా చెప్పారు. భారతదేశం సింధు జలాల్లో కొంత భాగాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. అయితే రాబోయే సంవత్సరాల్లో ఈ ఏర్పాట్లు మరింత పెరుగుతాయి అని ఆయన తెలిపారు.

చైనా ఏం చేస్తుంది?

సింధు నదీ జలాల ఒప్పందంపై భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోజాలదని పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రభుత్వ మాజీ కార్యదర్శి, సీనియర్ న్యాయవాది రాజా మొహమ్మద్ రజాక్ పేర్కొన్నారు. బ్రహ్మపుత్ర నదికి దిగువన ఉన్న విషయాన్ని భారత్ గుర్తించాలి. బంగ్లాదేశ్ చేరుకునే ముందు బ్రహ్మపుత్ర నది చైనా నుంచి భారత్ కు వస్తుంది. ఈశాన్య భారతదేశం ఎక్కువగా బ్రహ్మపుత్ర నదిపై ఆధారపడి ఉంది. చైనా కూడా భారత్ లాగా నిర్ణయం తీసుకోగలదు అని ఎక్స్‌లో రాశారు.

చైనా కూడా అలాంటి నిర్ణయం తీసుకోగలదా అని ప్రొఫెసర్ మహేంద్ర పి లామాను ప్రశ్నిస్తే..

బ్రహ్మపుత్ర నది విషయంలో చైనా అలా చేస్తే బంగ్లాదేశ్ పై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రొఫెసర్ లామా అన్నారు. పాకిస్తాన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు చైనా రెండు దేశాలను ఇబ్బంది పెడుతుందని అనుకోవడం లేదన్నారు.

సింధు నది కూడా చైనా నుంచే పుట్టింది కాబట్టి సింధు నదీ జలాలు పాకిస్తాన్ కు వెళ్లకుండా భారత్ అడ్డుకుంటే చైనా మౌనంగా ఉంటుందా?

సింధు నది టిబెట్ నుంచి ఉద్భవించింది, టిబెట్‌లో నీటిని చైనా నిర్వహించగలదని అనుకోవడం లేదని ప్రొఫెసర్ లామా అన్నారు. ఒకవేళ చైనా కూడా సింధు నీటిని ఆపినా అది పాకిస్తాన్‌కు చేరదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)