SOURCE :- BBC NEWS
సిరియాలో మరో కొత్త వివాదం మొదలైంది. క్రైస్తవులు ఎక్కువగా నివసించే సుకేలబియా ప్రాంత నడిబొడ్డున ఒక క్రిస్మస్ ట్రీ కాలిపోతున్నదృశ్యం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న వీడియోలో కనిపిస్తోంది.
ఈ ఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు దారి తీసింది. సిరియాలో మైనారిటీల భద్రతకు బాధ్యత తీసుకోవాలంటూ కొత్తగా అధికారాన్ని చేపట్టిన ఇస్లామిస్ట్ నాయకులను నిరసనకారులు డిమాండ్ చేశారు.
బషర్ అల్-అసద్ పాలనను కూలదోసిన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన హయత్ తహ్రిర్ అల్-షామ్ (హెచ్ టీ ఎస్) సంస్థ దీనిపై స్పందించింది. ఈ ఘటనకు కారకులైన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.
సిరియాలో మత, జాతిపరమైన మైనారిటీల హక్కులను కాపాడతామని హెచ్‌టీఎస్ హామీ ఇచ్చింది.
నిరసనకారులు ఏమంటున్నారు?
సిరియాలోని క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఈ ఘటన జరిగింది. మాస్కులు ధరించిన కొందరు వ్యక్తులు క్రిస్మస్ ట్రీపై ఏదో ద్రవాన్ని చల్లుతున్నట్లు వీడియోలో కనిపించింది.
అయితే వీరు మంటలను ఆర్పుతున్నారా లేక ఇంకా రాజేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.
మరోవైపు కాలిపోయిన క్రిస్మస్ ట్రీని వెంటనే సరిచేయిస్తామని హెచ్‌టీఎస్ రెబెల్ గ్రూప్‌కు చెందిన ఒక మత నాయకుడు ఆందోళనకారులకు నచ్చజెబుతున్న దృశ్యాలు కూడా వీడియోల ద్వారా బయటకు వచ్చాయి.
సుకేలబియాలో నిరసనకారులకు సంఘీభావం తెలుపుతూ ఆ నాయకుడు ఒక శిలువను పైకెత్తి చూపారు. ఇస్లామిస్ట్ సంప్రదాయవాదులు సాధారణంగా ఇలాంటి పనులు చేయరు.
మంగళవారం డమాస్కస్, దాని శివార్లలో మరికొంతమంది ఆందోళనకారులు ఈ దాడిని నిరసిస్తూ వీధులకెక్కారు.
సిరియాలోని విదేశీ ఫైటర్లకు వ్యతిరేకంగా కస్సా ప్రాంతంలో నినాదాలు వినిపించాయి.
ఈ దాడికి విదేశీశక్తులు పాల్పడి ఉండవచ్చనే హెచ్‌టీఎస్ వ్యాఖ్యాల ఆధారంగా, ‘సిరియా విముక్తమైంది. విదేశీయులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి’ అని వారు పిలుపునిచ్చారు.
మరోవైపు డమాస్కస్ సమీప బాబ్ టూమా ప్రాంతంలో శిలువలు, సిరియా జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ నిరసనకారులు ‘ శిలువ కోసం మా ప్రాణాలను సైతం త్యాగం చేస్తాం’ అని నినాదాలు చేశారు.
‘మా క్రైస్తవ మతాన్ని మా సొంత దేశంలోనే మేం ఆచరించలేకపోతే, ఇక ఈ ప్రాంతం మా సొంతం కాదు’ అని జార్జెస్ అనే ఓ ఆందోళనాకారుడు అన్నారు.
పలు మతాల నిలయం
సిరియా పలు మతాలు, జాతులకు నిలయం. కుర్దులు, ఆర్మేనియన్లు, అస్సీరియన్లు , క్రైస్తవులు, అలవైట్ షియాలు, అరబ్ సున్నీ లాంటి అనేక మత వర్గాలు ఉన్నాయి.
ముస్లిం జనాభాలో అధికంగా ఉండేది అలవైట్ షియాలు, అరబ్ సున్నీలే.
అసద్ కుటుంబ 50 ఏళ్ల పాలనకు అంతం పలుకుతూ 2 వారాల కిందట రెబల్ గ్రూపులు సిరియాలో అధికారాన్ని చేజిక్కించున్నాయి.
అంతకు ముందు అసద్ పాలనలో నిర్వాసితులైన ఎంతోమంది సిరియన్లు తిరిగి తమ ఇళ్లకు పయనమయ్యారు.
సుమారు 25 వేల మందికి పైగా సిరియన్లు తమ దేశం నుంచి తిరిగి వెళ్లారని మంగళవారం తుర్కియే ప్రకటించింది.
హెచ్‌టీఎస్ పాలన ఎలా ఉండనుంది?
ఇప్పుడు సిరియన్లతో పాటు ప్రపంచమంతా ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూస్తోంది. ఇస్లామిక్ చట్టం (షరియా)ను స్థాపించే తమ ధ్యేయాన్ని సాధించేందుకు హింసకు సైతం పాల్పడే ఒక జిహాది గ్రూపుగా హెచ్‌టీఎస్ మొదలైంది.
కానీ, గత కొన్ని సంవత్సరాలుగా వాస్తవిక స్థితిగతులకు అనుగుణంగా సరళమైన విధానాలవైపు మారింది.
‘‘అన్నివర్గాల ప్రజల కోసం ఒక కొత్త సిరియాను నిర్మించాలనుకుంటున్నాం’’ అని ఆ సంస్థ నాయకులు కూడా ఈ నెల ప్రారంభంలో ప్రకటించారు.
సిరియాలో ఉన్న అన్ని సాయుధ బలగాలను ఒక రక్షణ మంత్రిత్వ శాఖలో విలీనం చేసేందుకు విప్లవ సాయుధ బలగాలతో అహ్మద్ అల్-షారా చర్చలు జరిపినట్లు కొత్త ప్రభుత్వ అధికారులు వెల్లడించారని పలు వార్తా సంస్థల కథనాలు వెల్లడించాయి.
సిరియాలో అనేక సాయుధ బలగాలు ఉన్నాయి. కొన్ని హెచ్‌టీఎస్‌కు వ్యతిరేకమైనవి, మరి కొన్నింటికి దానితో పెద్దగా అనుబంధం లేదు.
ఐక్యరాజ్య సమితి,యూరోపియన్ యూనియన్ సహా యూఎస్, యూకే దేశాలు ఇప్పటికీ హెచ్‌టీఎస్‌ను ఒక తీవ్రవాద సంస్థగానే పరిగణిస్తాయి. అయితే దౌత్యపరమైన మార్పులు జరగొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
సీనియర్ దౌత్యవేత్తలు, హెచ్‌టీఎస్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం, అప్పటి వరకు అహ్మద్ అల్-షారా పై ప్రకటించిన 10 మిలియన్ డాలర్ల ( సుమారు రూ.83 కోట్లు) నజరానాను అమెరికా ఉపసంహరించుకుంది . అయినా సిరియాలో తన సైనిక చర్యలను కొనసాగిస్తోంది.
విదేశీ ఫైటర్లు, ఇస్లామిక్ అతివాదులతోపాటు మైనారిటీల హక్కులను ఉల్లంఘించే చిన్న చిన్న సంస్థల వరకు…సిరియాలోని కొత్త ప్రభుత్వం సవాళ్లు ఎదుర్కోక తప్పేలా లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)